గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Feb 22 2016 3:38 AM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM

Last week Business

నియామకాలు
* మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్‌గా యూ కే సిన్హా పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సెబీ చైర్మన్‌గా సిన్హా వచ్చే ఏడాది మార్చి 1 వరకు లేదా తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే దాకా పదవిలో కొనసాగుతారు.
* దేశీ మూడవ అతి పెద్ద అయిల్ మార్కెటింగ్ కంపెనీ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సీఎండీగా ఎం.కె.సురానా నియమితులయ్యారు.
 
ఫండ్స్‌కి బాండ్ల నిబంధనలు కఠినం
కార్పొరేట్ బాండ్లలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల నిబంధనలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కఠినతరం చేసింది. ఏ ఒక్క కంపెనీలోనూ 10 శాతానికి మించి ఇన్వెస్ట్ చేయకూడదని నిర్దేశించింది. అలాగే ఒక రంగంలో పెట్టదగిన పెట్టుబడుల పరిమితిని 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. గ్రూప్ స్థాయిల్లో డెట్ సెక్యూరిటీల్లో 20-25 శాతం మేర ఇన్వెస్ట్ చేయొచ్చని పేర్కొంది.
 
క్షీణతలోనే టోకు ధరలు
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో వరుసగా 15వ నెలలోనూ అసలు పెరగకపోగా..  క్షీణతలో (మైనస్) కొనసాగింది. - 0.9 శాతం క్షీణత నమోదయ్యింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తక్కువగా ఉండడం, ఈ ప్రభావం ప్రధానంగా కమోడిటీ ఆధారిత తయారీ ఉత్పత్తుల మీదా ఉండడం, దేశంలో మందగమన ధోరణి అన్నీ కలసి టోకు ద్రవ్యోల్బణాన్ని 15 నెలలుగా క్షీణతలో ఉంచుతున్నాయి.
 
14వ నెలా 14 శాతం క్షీణత
ఎగుమతుల రంగం నిరాశలోనే కొనసాగుతోంది. 2015 జనవరితో పోల్చిచూస్తే... 2016 జనవరిలో ఎగుమతుల విలువలో అసలు వృద్ధి లేకపోగా 14 శాతం క్షీణత నమోదయ్యింది.  విలువలో ఇది 21 బిలియన్ డాలర్లు. ఎగుమతుల క్షీణ ధోరణి ఇది వరుసగా 14వ నెల. ఇక దిగుమతులు కూడా క్షీణతలోనే పయనిస్తున్నాయి. జనవరిలో 11 శాతం క్షీణించి 29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.  దీనితో ఎగుమతి- దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు 8 బిలియన్ డాలర్లుగా ఉంది.
 
600 కోట్లకు ప్రపంచ స్మార్ట్‌ఫోన్ యూజర్లు!
టెలికం పరిశ్రమ వృద్ధి బాటలో పయనిస్తుండటంతో రానున్న కాలంలో స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరగ నున్నది. అంతర్జాతీయంగా 2020 నాటికి వీరి సంఖ్య 600 కోట్లకు పైగా చేరుతుందని చైనా వెబ్ సర్వీసెస్ సంస్థ బైదు తన నివేదికలో పేర్కొంది.
 
వొడాఫోన్‌కు మళ్లీ పన్ను నోటీసులు
టెలికం దిగ్గజం వొడాఫోన్‌కు ఆదాయ పన్ను శాఖ మళ్లీ షాకిచ్చింది. హచిసన్ వాంపోవా భారత కార్యకలాపాల కొనుగోలు డీల్‌కు సంబంధించి రూ. 14,200 కోట్లు కట్టాలంటూ నోటీసులు పంపించింది. చెల్లించని పక్షంలో కంపెనీ ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించింది.
 
సరుకు రవాణ వృద్ధి 3 శాతం
దేశీ ప్రముఖ 12 నౌకాశ్రయాల్లో సరుకు రవాణా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి పది మాసాల్లో 3.36 శాతం వృద్ధితో 499 మిలియన్ టన్నులకు పెరిగింది. ఈ నౌకాశ్ర యాల సరకు రవాణా గతేడాది ఇదే సమయంలో 483 మిలియన్ టన్నులుగా ఉంది. వివిధ రంగాల్లో డిమాండ్ పెరుగుదలే సరకు రవాణా వృద్ధికి కారణంగా కనిపిస్తోంది.
 
రుణ ఎగవేతదార్లపై సుప్రీం కొరడా
బడా రుణ ఎగవేతదారులపై కొరడా ఝళిపించేందుకు సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. రూ. 500 కోట్లకు మించి రుణాలకు సంబంధించి బకాయిలు చెల్లించకుండా డిఫాల్ట్ అయిన కంపెనీల జాబితాను తమముందు ఉంచాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)ను ఆదేశించింది. దీంతోపాటు కార్పొరేట్ రుణ పునర్‌వ్యవస్థీకరణ(సీడీఆర్) స్కీమ్‌లో రుణాలను పునర్‌వ్యవస్థీకరించుకున్న కంపెనీల జాబితాను సైతం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆరు వారాల్లోగా వీటిని సీల్డు కవర్లో సమర్పించాలని పేర్కొంది.
 
చిన్న పొదుపుపై వడ్డీ రేటు కోత
పోస్టాఫీస్ స్వల్ప కాల పథకాలపై పావుశాతం వడ్డీ రేటు తగ్గించింది. 1, 2, 3 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లు, కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), అలాగే ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై ఇదే కాలపరిమితితో ఉన్న ప్రభుత్వ బాండ్ల రేటు కన్నా అదనంగా పావుశాతం (0.25 శాతం) వడ్డీ వస్తోంది. అయితే ఈ ప్రయోజనాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచీ తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  
 
ఫెరారి నుంచి ‘488 జీటీబీ’ మోడల్
ఇటలీకి చెందిన దిగ్గజ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ ‘ఫెరారి’ తాజాగా ‘488 జీటీబీ’ మోడల్ కారును భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత వేగంగా ప్రయాణించే కార్లలో ఇది కూడా ఒకటి. దీని ధర రూ.3.88 కోట్లు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 3 సెకన్లలో, 0-200 కిలోమీటర్ల వేగాన్ని 8.3 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది. కారు గరిష్ట వేగం గంటకు 325 కిలోమీటర్లు.
 
సిమెంట్ డిమాండ్ పెరగొచ్చు
సిమెంట్ డిమాండ్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4-6 శాతంమేర పెరిగే అవకాశముందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) తన నివేదికలో తెలిపింది. కేంద్రం కన్‌స్ట్రక్షన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగంపై దృష్టి కేంద్రీకరించడమే డిమాండ్ పెరుగుదలకు కారణమని పేర్కొంది. ఇండ్-రా నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ 5.6 శాతంమేర పెరిగింది.  
 
వరంగల్‌లో సైయంట్ సెంటర్
ఇంజనీరింగ్ సర్వీసుల సంస్థ సైయంట్ వరంగల్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఏప్రిల్ నుంచి కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. రానున్న 12-18 నెలల్లో ఈ కేంద్రం ద్వారా 1,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది.
 
రూ.15 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు!
తయారీ రంగంలో భారత్‌ను ప్రపంచ హబ్‌గా తయారు చేయాలన్న సంకల్పంతో ప్రధాన మంత్రి మోదీ తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా వీక్ దిగ్విజయంగా ముగిసింది. వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి రూ.15.2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వెల్లువెత్తాయని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) కార్యదర్శి అమితాభ్ కాంత్ గురువారం చెప్పారు.
 
డిజిటల్ మ్యాగజైన్లను నిలిపివేస్తున్న యాహూ
ప్రత్యర్థి కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ఇంటర్నెట్ సంస్థ యాహూ.. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణపై మరింతగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని డిజిటల్ మ్యాగజైన్స్‌ను నిలిపివేయడం మొదలుపెట్టింది. యాహూ ఫుడ్, హెల్త్, పేరెంటింగ్, మేకర్స్, ట్రావెల్, ఆటోస్, రియల్ ఎస్టేట్ మ్యాగజైన్లను దశలవారీగా మూసివేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.
 
వేలానికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆస్తులు
సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఇచ్చిన రుణాల్లో కొంతైనా రాబట్టుకునేందుకు.. ఆ సంస్థ ఆస్తులను అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలకు (ఏఆర్‌సీ) వేలం వేసేందుకు దాదాపు 4 బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. 3-4 బ్యాంకులు ఇందుకోసం ఏఆర్‌సీలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియం.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఇచ్చిన దాదాపు రూ. 6,963 కోట్లు పైగా రుణాలను రాబట్టుకునేందుకు తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే.
 
ఏడాదిలో 700 మిలియన్ డాలర్లు!
రాబోయే 12 నెలల్లో సుమారు 130 దేశీ స్టార్టప్ కంపెనీలు దాదాపు 700 మిలియన్ డాలర్లు సమీకరించనున్నాయి. అలాగే సుమారు 5,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఇన్నోవెన్ క్యాపిటల్ సంస్థ ఇండియా స్టార్టప్ అవుట్‌లుక్ 2016 పేరిట రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది.
 
డీల్స్..
* స్వీడన్‌కు చెందిన వొల్వొ గ్రూప్ ఐటీ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ.895కోట్లు. అంతేకాకుండా వొల్వొ కంపెనీకి ఐదేళ్ల పాటు ఐటీ సేవలు అందించేందుకు అవుట్ సోర్సింగ్ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది.
* ఆన్‌లైన్ చెల్లింపుల సేవలందించే ఇమ్‌వాంటేజ్ పేమెంట్స్ కంపెనీని ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది.
* టెక్ దిగ్గజం ఐబీఎం తాజాగా ట్రూవెన్ హెల్త్ అనలిటిక్స్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 2.6 బిలియన్ డాలర్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement