గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, May 23 2016 2:35 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

Last week Business

టోకు ద్రవ్యోల్బణం యూ టర్న్
తయారీ రంగం, కొన్ని ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల ఫలితంగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం క్షీణదశ నుంచి పెరుగుదల బాటలోకి ‘యూ’ టర్న్ తీసుకుంది. ఏప్రిల్‌లో 0.34 శాతం రేటు నమోదయ్యింది. అంటే సూచీ 2015 ఏప్రిల్‌తో పోల్చితే 2016 ఏప్రిల్‌లో 0.34 శాతం పెరిగిందన్నమాట. 2015 ఏప్రిల్‌లో ఈ రేటు -2.43 శాతం.
    
విలీనానికి ఎస్‌బీఐ గ్రూప్ సిద్ధం
ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మంగళవారం కీలక ప్రతిపాదనను కేంద్రం ముందు పెట్టింది. తన ఐదు అనుబంధ బ్యాంకులు అలాగే భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ)ని విలీనం చేసుకోడానికి అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే (2016-17) ఈ ప్రక్రియ పూర్తవ్వాలన్నది తన ఉద్దేశంగా తెలిపింది.
     
క్రాష్ టెస్ట్‌లో ఐదు కార్లు ఫెయిల్
భారత్‌లో విక్రయమవుతున్న ఐదు కార్లలో ప్రయాణికుల భద్రతా ప్రమాణాలు తగిన విధంగా లేవని గ్లోబల్ ఎన్‌సీఏపీ(న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్స్) వెల్లడించింది. మారుతీ సెలెరియో, ఈకో, రెనో క్విడ్, మహీంద్రా స్కార్పియో, హ్యుందాయ్ ఇయాన్...ఈ ఐదు కార్లు తమ క్రాష్ టెస్ట్‌ల్లో విఫలమయ్యాయని పేర్కొంది. కాగా భారత ప్రభుత్వ భ ద్రత నియమ నిబంధనలకనుగుణంగానే కార్లను తయారు చేశామని మారుతీ, రెనో, హ్యుందాయ్ కంపెనీలు పేర్కొన్నాయి.
   
టాటా మెటాలిక్స్ విలీనానికి టాటా స్టీల్ స్వస్తి
టాటా మెటాలిక్స్, టాటా మెటాలికస్ డీఐ పైప్స్.. ఈ రెండు కంపెనీలను విలీనం చేసుకునే యోచనను టాటా స్టీల్ కంపెనీ అటకెక్కించింది. ఈ విలీనానికి సంబంధించి,  చట్ట, శాసనపరమైన ఆమోదాలు పొందడంలో జాప్యం కావడం, ఇతరత్రా కారణాల వల్ల ఈ విలీన యోచనను పక్కన పెట్టామని టాటా స్టీల్ తెలిపింది.
    
స్టీల్ పైప్స్, ట్యూబ్స్‌పై యాంటీ డంపింగ్ సుంకం
చైనా నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న స్టీల్ పైప్స్, సీమ్‌లెస్ ట్యూబ్స్‌పై  కేంద్ర ప్రభుత్వం యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది. చౌక దిగుమతుల నుంచి దేశీ స్టీల్ పరిశ్రమను ఆదుకోవడానికి ఆయిల్, గ్యాస్ అన్వేషణలో ఉపయోగించే స్టీల్ పైప్స్, ట్యూబ్స్‌పై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని డీజీఏడీ ఇటీవల రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు ఒక ప్రతిపాదన చేసింది.  
    
మార్కెట్‌లోకి మళ్లీ నోకియా ఫోన్స్
మళ్లీ నోకియా బ్రాండ్ ఫోన్లు, ట్యాబ్‌లు మార్కెట్లోకి రానున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ నోకియా బ్రాండ్ హక్కులను హెచ్‌ఎండీ గ్లోబల్‌కు, ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థ ఎఫ్‌ఐహెచ్ మొబైల్‌కు 35 కోట్ల డాలర్లకు విక్రయించింది. నోకియా బ్రాండ్ ఎక్స్‌క్లూజివ్ గ్లోబల్ లెసైన్స్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌కు పదేళ్లపాటు లీజ్‌కు ఇచ్చామని నోకియా పేర్కొంది. దీంతో హెచ్‌ఎండీ గ్లోబల్, ఎఫ్‌ఐహెచ్ మొబైల్ సంస్థలు ఇక నోకియా బ్రాండ్ మొబైళ్లను విక్రయిస్తాయి.
    
పీ-నోట్ల నిబంధనలు మరింత కఠినం
మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి.. పీ-నోట్ల నిబంధనలను మరింత కఠినతరం చేసింది. పార్టిసిపేటరీ నోట్ల ద్వారా ప్రయోజనం పొందేవాళ్లు మనీల్యాండరింగ్‌ను నిరోధించే భారత చట్టాలకు బద్దులై ఉండడం తప్పనిసరని పేర్కొంది. ఆష్‌షోర్ డెరివేటివ్ ఇన్‌స్ట్రుమెంట్స్ (ఓడీఐ-వీటినే పీ-నోట్లగా వ్యవహరిస్తారు)కు సంబంధించి ఏవైనా సందేహాస్పద లావాదేవీలు ఉంటే, వీటిని జారీ చేసిన సంస్థలు తక్షణం తమకు నివేదించాలని సెబి ఆదేశాలు జారీ చేసింది.
    
గూగుల్ అసిస్టెంట్‌ను ఆవిష్కరించిన పిచాయ్
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ‘గూగుల్ అసిస్టెంట్’ అనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఆవిష్కరించారు. దీనితోపాటు ఆయన ‘గూగుల్ హోమ్’ అనే వైస్-యాక్టివేటెడ్ ప్రొడక్ట్‌ను, ‘అలో’ మేసేజింగ్ యాప్‌ను, ‘డుయో’ వీడియో కాలింగ్ యాప్‌ను, ఇన్‌స్టాంట్ యాప్స్‌ను, వీఆర్ ప్లాట్‌ఫామ్ ‘డేడ్రీమ్’ను, మొబైల్ సాఫ్ట్‌వేర్ ‘ఆండ్రాయిడ్ ఎన్’ను, వియరబుల్ ప్లాట్‌ఫామ్ ‘ఆండ్రాయిడ్ వియర్ 2.0’ను ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో జరిగిన సంస్థ 10వ వార్షిక డెవలపర్ సమావేశంలో వీటి ఆవిష్కరణ జరిగింది.
   
హెచ్‌ఎస్‌బీసీ విశాఖ బ్రాంచ్ మూసివేత !
బ్రిటిష్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ కన్సాలిడేషన్ ప్రక్రియలో భాగంగా ఇండియాలో కొన్ని శాఖల్ని మూసివేయనుంది. ప్రస్తుతం 29 పట్టణాల్లో 50 శాఖలను కలిగిన హెచ్‌ఎస్‌బీసీ.. తన బ్రాంచ్‌ల సంఖ్యను 26కి (14 పట్టణాల్లో) తగ్గించుకోనున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ మూసివేయనున్న బ్రాంచ్‌ల్లో విశాఖపట్నం శాఖ కూడా వున్నట్లు తెలుస్తోంది.
    
హైదరాబాద్‌లో యాపిల్ మ్యాప్స్ సెంటర్
టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా మ్యాప్స్ అభివృద్ధి కార్యకలాపాల కోసం హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించింది. మ్యాప్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌పై పెట్టుబడులను వెల్లడించని యాపిల్... దీని ద్వారా దాదాపు 4,000 దాకా ఉద్యోగాలొస్తాయని తెలియజేసింది. కాగా కంపెనీ బెంగళూరులో ‘ఐఓఎస్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్’ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
    
మాల్యా మొత్తం కట్టాల్సిందే: పీఎన్‌బీ చీఫ్
 పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన విజయ్‌మాల్యా... ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందేనని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ స్పష్టం చేశారు. కొంత మొత్తాన్ని చెల్లిస్తామన్న మాల్యా ఆఫర్‌ను ఆమె తిరస్కరించారు. బ్యాంకింగ్ కన్సార్షియానికి నేతృత్వం వహించనప్పటికీ, అందులో ఒక భాగంగా వున్న తాము మాల్యా రుణ మొత్తం చెల్లించాల్సిందేనన్నది డిమాండ్ చేస్తున్నామన్నారు.
    
ఎన్‌ఎస్‌ఈలో వాటా విక్రయ దిశగా ఎస్‌బీఐ
ఎన్‌ఎస్‌ఈలో కొంత వాటాను విక్రయించాలని ఎస్‌బీఐ యోచిస్తోంది. ఎస్‌బీఐకు 15 శాతం వాటా ఉంది. ఈ వాటాలో 5 శాతాన్ని కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా విక్రయించనున్నామని ఒక పబ్లిక్ నోటీస్ ద్వారా ఎస్‌బీఐ పేర్కొంది. ఈ వాటా విక్రయం ద్వారా రూ.1,000 కోట్లు వస్తాయని బ్యాంక్ అంచనా.
 
డీల్స్..

* బయోఫార్మాస్యూటికల్ సంస్థ అనకార్ ఫార్మాస్యూటికల్స్‌ను ఫార్మా దిగ్గజం ఫైజర్ కొనుగోలు చేయనున్నది. అనకార్ ఫార్మాను 520 కోట్ల డాలర్లకు(రూ.34,320 కోట్లు సుమారుగా) అంతా నగదులోనే కొనుగోలు చేయనున్నామని ఫైజర్ తెలిపింది.
* స్టార్టప్‌లలో రతన్ టాటా పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఆయన తాజాగా శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన అత్యవసర వైద్య సేవలందించే స్టార్టప్.. ఎంర్జెన్సీ ఇన్‌కార్పొలో పెట్టుబడులు పెట్టారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత చాట్‌బోట్, నికిడాట్‌ఏఐలోనూ ఇన్వెస్ట్ చేశారు. పెట్టుబడుల వివరాలు వెల్లడి కాలేదు.  
* టాటా కమ్యూనికేషన్స్ సంస్థ తన భారత్, సింగపూర్‌లకు చెందిన డేటా సెంటర్ వ్యాపారంలో 74 శాతం వాటాను ఎస్‌టీ (సింగపూర్ టెక్నాలజీస్ )టెలిమీడియాకు రూ.3,150 కోట్లకు విక్రయించింది.
* క్యాస్ట్రాల్ ఇండియాలో 11.5 శాతం వాటాను ఇంగ్లండ్‌కు చెందిన బీపీ కంపెనీ విక్రయించింది. ఒక్కో షేర్‌ను రూ.365 చొప్పున 5.68 కోట్ల షేర్లను(11.5 శాతం వాటా)ను దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు విక్రయించామని బీపీ కంపెనీ పేర్కొంది. ఈ వాటా విక్రయ విలువ రూ.2,075 కోట్లని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement