150 ఫ్లాట్లను విక్రయించిన ఆర్‌కామ్
రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) కంపెనీ నవీ ముంబైలోని 150 రెసిడెన్షియల్ ఫ్లాట్లను రూ.330 కోట్లకు విక్రయించింది. నవీ ముంబైలోని సీ ఉడ్స్ కాంప్లెక్స్‌లో ఉన్న ఈ ఫ్లాట్స్‌ను విక్రయించామని, దాదాపు సగం డబ్బులు వచ్చేశాయని ఆర్‌కామ్ తెలిపింది. రుణ భారం తగ్గించుకోవడానికి ఆస్తుల నగదీకరణలో భాగంగా ఈ ఫ్లాట్లను విక్రయించామని పేర్కొంది.
కార్పొరేట్ మోసం కోటి దాటితే కేంద్రం దృష్టికి
ఆడిటర్లు కంపెనీల ఖాతాలను పరిశీలించే క్రమంలో రూ. 1 కోటి పైగా విలువ చేసే సందేహాస్పద కార్పొరేట్ మోసాల ఉదంతాలేమైనా గుర్తిస్తే ప్రభుత్వం దృష్టికి తేవాల్సి ఉంటుంది. కంపెనీల చట్టానికి ఈ మేరకు సవరణలు చేస్తూ కార్పొరేట్ వ్యవహారాల శాఖ నిబంధనలు ప్రకటించింది. మోసం ఉదంతం తెలిసిన రెండు రోజుల్లోగా ఆడిటరు ముందుగా కంపెనీ బోర్డు లేదా ఆడిట్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలి.
దీనిపై 45 రోజుల్లోగా వాటి నుంచి వివరణ తీసుకోవాలి. ఆ తర్వాత 15 రోజుల్లోగా ఆడిటరు తన నివేదికను కేంద్రానికి పంపాల్సి ఉంటుంది.
మ్యాట్రిమోని.కామ్, క్విక్‌హీల్ ఐపీఓలకు ఓకే
మ్యాట్రీమోని.కామ్, క్విక్ హీల్ టెక్నాలజీస్ ఐపీఓలకు సెబీ ఆమోదం తెలిపింది. ఈ రెండు కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.1,000 కోట్ల నిధులు సమీకరిస్తాయని అంచనా. ఐపీఓకు సంబంధించిన పత్రాలను మ్యాట్రిమోని.కామ్ సంస్థ ఆగస్టులో, క్విక్ హీల్ టెక్నాలజీస్ సంస్థ సెప్టెంబర్‌లో సెబీకి సమర్పించాయి. మ్యాట్రిమోని.కామ్ కంపెనీ ఈ ఐపీఓ ద్వారా రూ.600-700 కోట్లు సమీకరించనున్నదని అంచనా. ఇక క్విక్ హీల్ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.250 కోట్లను సమీకరించనున్నది.
ఎన్‌సీడీల ద్వారా రూ.15,000 కోట్ల సమీకరణ
భారత కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల(ఎన్‌సీడీ)ల ద్వారా రూ.15,000 కోట్లు సమీకరించాయి. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు ఎన్‌సీడీల ద్వారా రూ.9,713 కోట్లు సమీకరించాయి. విస్తరణ ప్రణాళికలకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల నిమిత్తం, ఇతర సాధారణ వ్యాపార అవసరాల నిమిత్తం కంపెనీలు ఎన్‌సీడీల ద్వారా నిధులు సమీకరించాయి. ఎన్‌సీడీలను షేర్లుగా మార్చుకోవడానికి వీలుండదు. కన్వర్టబుల్ డిబెంచర్ల కన్నా వీటికి అధిక వడ్డీ వస్తుంది.
ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ విలీనం!
దేశీ టెలికం రంగంలో మరో భారీ విలీనానికి రంగం సిద్ధమవుతోంది. అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), ఎయిర్‌సెల్‌ల విలీనం దిశగా అడుగులు పడుతున్నాయి. రెండు కంపెనీల మొబైల్/వైర్‌లెస్ వ్యాపారాలను విలీనం చేయడానికి ఎయిర్‌సెల్ వాటాదారులతో చర్చలు జరుపుతున్నట్లు ఆర్‌కామ్ మంగళవారం ప్రకటించింది. కాగా, ఎంటీఎస్ బ్రాండ్‌తో దేశీయంగా టెలికం సేవలు అందిస్తున్న సిస్టెమా శ్యామ్ టెలీ సర్వీసెస్ భారతీయ వ్యాపారాన్ని విలీనం చేసుకునే ప్రక్రియలో ఆర్‌కామ్ నిమగ్నమైన సంగతి తెలిసిందే.
క్యూ2లో క్యాడ్ 1.6 శాతం
కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) సెప్టెంబర్ త్రై మాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 1.6 శాతంగా నమోదయ్యింది. విలువ రూపంలో ఇది 8.2 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ లోటు జీడీపీలో 2.2 శాతంగా ఉంది. విలువలో 10.9 బిలియన్ డాలర్లు. ఎగుమతులు-దిగుమతులకు మధ్య వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు తగ్గడం త్రై మాసికం పరంగా క్యాడ్ తగ్గడానికి కారణమని ఆర్‌బీఐ తెలిపింది.
ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్‌లో రైల్వే బుకింగ్
ప్రైవేట్ రంగ దిగ్గజం బ్యాంక్ ఐసీఐసీఐ తొలిసారిగా తన వెబ్‌సైట్ ద్వారా రైల్వే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం రైల్వే ఈ-టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్‌సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. వినియోగదారులు ఐసీఐసీఐ వెబ్‌సైట్‌లో రైల్వే టికెట్లను బుకింగ్ చేసుకోవాలంటే ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో సభ్యత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
పాన్ నిబంధనలు సవరించండి
ఆభరణాల కంపెనీల సమాఖ్య ఆల్ ఇండియా జెమ్స్, జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్)... కొత్తగా తెస్తున్న పాన్ నిబంధనలను తప్పుపట్టింది. రూ.2 లక్ష లపై కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి అనే నిబంధనలు జ్యుయలరీ రంగానికి ప్రతికూలమని వ్యాఖ్యానించింది. దీనివల్ల తమ వ్యాపారం దెబ్బతింటుందని, రూ.2 లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని కోరింది. బంగారం దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 10 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని పేర్కొంది.
స్వచ్ఛ భారత్ సుంకం వసూళ్లు రూ.330 కోట్లు
డిసెంబర్ 16 నాటికి స్వచ్ఛ భారత్ సుంకపు వసూళ్లు రూ.329 కోట్లుగా ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సంబంధించి నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం నవంబర్ 15 నుంచి పన్ను పరిధిలోకి వచ్చే అన్ని సేవలపైన 0.5 శాతంమేర స్వచ్ఛ భారత్ సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే. స్వచ్ఛ భారత్ సుంకపు వసూళ్లు వచ్చే ఏడాది మార్చి 31 నాటికి రూ.3,750 కోట్లకు చేరొచ్చని సిన్హా అంచనా వేశారు. స్వచ్ఛ భారత్ సుంకంతో (0.5 శాతం) కలుపుకొని సర్వీస్ ట్యాక్స్ 14.5 శాతానికి చేరింది.
ఐడియా 4జీ సేవలు ప్రారంభం
టెలికం రంగ సంస్థ ఐడియా సెల్యులర్ 4జీ ఎల్‌టీఈ సేవలను బుధవారం ప్రారంభించింది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణతో కలిపి), కర్ణాటక, తమిళనాడు, కేరళ సర్కిళ్లలో ఈ సేవలను ఆవిష్కరించింది. ప్రస్తుతానికి నాలుగు సర్కిళ్లకుగాను 75 పట్టణాల్లో కస్టమర్లు 4జీ ఎల్‌టీఈని పొందవచ్చు. అయితే ఈ జాబితాలో ప్రధాన నగరాలేవీ లేవు.
ఇక రిలయన్స్ క్షిపణులు!
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన సందర్భంగా భారీ డిఫెన్స్ ఒప్పందం కుదిరింది. భారత్‌కు చెందిన రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్.. రష్యా ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ సిస్టమ్స్ తయారీ దిగ్గజం అల్మాజ్‌యాంటేతో గురువారం భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం భారత్ రక్షణ దళాలకు అవసరమైన మొత్తం ఎయిర్‌డిఫెన్స్ మిసైల్స్(క్షిపణులు), రాడార్ సిస్టమ్స్‌ను ఇరు సంస్థలు కలిసి తయారు చేయనున్నాయి.
డీల్స్..
* ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ యూకే (టీఎస్‌యూకే) యూరప్‌లోని తమ లాంగ్ ప్రొడక్ట్స్ వ్యాపార విభాగాన్ని విక్రయించనుంది. ఇందుకు సంబంధించి ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ గ్రేబుల్ క్యాపిటల్‌తో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది.
* చిన్న, మధ్య తరహా సంస్థల ఎదుగుదలకు తోడ్పాటు అందించే దిశగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్‌మెంట్ (నీస్‌బడ్)తో చేతులు కలిపింది.
* భారత్‌లో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో అమెరికాకు చెందిన విటియోస్ గ్రూప్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. డీల్ విలువ 13 కోట్ల డాలర్లు (దాదాపు రూ.861 కోట్లు).
గతవారం బిజినెస్
Published Mon, Dec 28 2015 2:04 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM
Advertisement