న్యూఢిల్లీ: ఆడిటర్లు నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడకుండా, విధానపరమైన ప్రక్రియను అనుసరించాలని నేషనల్ ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ) చైర్‌పర్సన్ అజయ్ భూషణ్ ప్రసాద్ పాండే సూచించారు. ఆడిటింగ్ అన్నది కేవలం టిక్ కొట్టే పని మాత్రం కాదన్నారు. పలు కంపెనీల్లో ఆడిటింగ్ లోపాలు బయటపడుతుండడం, ఈ విషయంలో ఆడిటర్లపై నియంత్రణ సంస్థ చర్యలు తీసుకుంటుండడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ అంశంపై పాండే తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆడిట్ డాక్యుమెంట్లు అన్నవి సరైన విధి విధానాలను అసరించారనే దానికి సాక్ష్యాలుగా పేర్కొన్నారు.
‘‘మేము విలన్‌గా ఇక్కడ లేమని ఆడిటర్ల సమాజానికి నేను హామీ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు సాయం చేయడానికి, వ్యవస్థను మరింత మెరుగుపరచడానికే మేము ఇక్కడ ఉన్నామని తెలియజేస్తున్నాను’’అంటూ పాండే చెప్పారు. ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ (ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను వెల్లడించడం) వ్యవస్థ అనేది ఎంతో ముఖ్యమైనదిగా పేర్కొన్నారు.
ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ కిందకు సుమారు 7,000 కంపెనీలు వస్తాయి. అన్‌లిస్టెడ్ కంపెనీలపైనా నియంత్రణ కలిగి ఉంది. యాజమాన్యం లేదా న్యాయ సలహాలపై ఆడిటర్లు ఎక్కువగా ఆధారపడుతున్నట్టు గుర్తించామని చెప్పారు. ‘‘నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడడం, అవసరమైన విశ్లేషణ చేయకపోవడం అన్నది సరికాదు. నిపుణులు చెప్పిన అభిప్రాయానికే మీరు కూడా మొగ్గు చూపించొచ్చు. కానీ, మీరు ప్రామాణిక ఆడిట్ చేసినట్టు అక్కడ పత్రాలు చెప్పాలి. అది ముఖ్యమైనది’’అని సూచించారు.
ఆడిట్‌తో మోసాలు వెలుగులోకి
చట్టబద్ధమైన ఆడిటింగ్ ప్రక్రియను అనుసరించినప్పుడు మోసాలను గుర్తించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పాండే అన్నారు. ‘‘ఆడిటర్లు మోసాలను అన్ని వేళలా గుర్తిస్తారని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కానీ, మీరు తగిన విధంగా వ్యవహరిస్తే బయట పడేందుకు మంచి అవకాశాలు ఉంటాయి’’అని చెప్పారు. కంపెనీలు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు అవి తమ ఆడిట్ కమిటీలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇండిపెండెంట్ డైరెక్టర్లకు సాధికారత కలి్పంచాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment