ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ ఏర్పాటులో తొందరొద్దు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త కంపెనీల చట్టంలో భాగమైన నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ) ఏర్పాటు విషయంలో ప్రభుత్వం తొందరపడరాదని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రెసిడెంట్ మనోజ్ ఫడ్నిస్ చెప్పారు. చార్టర్డ్ అకౌం టెంట్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం సహా విస్తృతాధికారాలు ఉండే ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏపై ప్రొఫెషనల్స్‌తో మరింతగా చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇప్పటికే నేషనల్ అడ్వైజరీ కమిటీ ఆన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ (ఎన్‌ఏసీఏఎస్) ఈ తరహా విధుల్లో కొన్నింటిని నిర్వహిస్తున్నందున కొత్తగా ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏను ఏర్పాటు చేయడం వల్ల ఒకే పనిని పలు సంస్థలకు అప్పగించినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు.
కంపెనీల చట్టం 2013పై ఆదివారం ఇక్కడ నిర్వహించిన సెమినార్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఆడిటర్లపై కఠిన చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం తమ క్రమశిక్షణ కమిటీ ముందు దీనికి సంబంధించి ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేవని చెప్పారు. ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ ఎం. దేవరాజ రెడ్డి తదితరులు ఈ సెమినార్లో పాల్గొన్నారు.