National Financial Reporting Authority
-
అతిజాగ్రత్తతో వృద్ధికి ఆటంకం
న్యూఢిల్లీ: నియంత్రణ సంస్థలు జాగ్రత్త చర్యలు అతిగా అమలు చేస్తే ఆర్థిక వృద్ధికి ఆటంకం కలుగుతుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. రెగ్యులేటర్లు మరీ సంప్రదాయకంగా, అతిజాగ్రత్తగా వ్యవహరించకూడదన్నారు. అయితే, ఏ రంగంలోనైనా ‘ప్రమాదాలు’ చోటు చేసుకుంటే సత్వరం స్పందించే విధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కోటక్ ఈ విషయాలు తెలిపారు. ‘భారత్ భవిష్యత్తుపై నేను అత్యంత ఆశావహంగా ఉన్నాను. అదే సమయంలో తగిన జాగ్రత్త లేకుండా కేవలం అవకాశాలపైనే పూర్తిగా దృష్టి పెట్టి ముందుకెళ్లడమనేది రిసు్కతో కూడుకున్న వ్యవహారం. అలాగని, మరీ అతిగా జాగ్రత్త చర్యలు తీసుకుంటే మనం అక్కడికి (సంపన్న దేశం కావాలన్న లక్ష్యానికి) చేరుకోలేం‘ అని ఆయన పేర్కొన్నారు. వచ్చే 20–25 ఏళ్ల పాటు 7.5–8 శాతం జీడీపీ వృద్ధి రేటును కొనసాగించాలంటే సామర్థ్యాలను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందని కోటక్ చెప్పారు. -
ఆడిట్ సంస్థల్లో లోపాలు
న్యూఢిల్లీ: బిగ్–4 ఆడిటింగ్ కంపెనీలకు చెందిన నెట్వర్క్ ఎంటెటీలలో ఆడిటింగ్ కార్యకలాపాల పరంగా లోపాలు ఉన్నట్టు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) గుర్తించింది. డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పీ, బీఎస్ఆర్ అండ్ కో ఎల్ఎల్పీ, ఎస్ఆర్బీసీ అండ్ కో ఎల్ఎల్పీ, ప్రైస్ వాటర్ హౌస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎల్ఎల్పీ సంస్థల్లో ఆడిట్ నాణ్యత తనిఖీలను ఎన్ఎఫ్ఆర్ఏ నిర్వహించగా ఈ లోపాలు వెలుగు చూశాయి. ప్రైస్ వాటర్ హౌస్, డెలాయిట్, ఈవై, కేపీఎంజీలను బిగ్–4 ఆడిటింగ్ సంస్థలుగా చెబుతారు. సంస్థల నాణ్యత నియంత్రణలను ఎన్ఎఫ్ఆర్ఏ పరిశీలించింది. మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి సంబంధించి వార్షిక స్టాట్యూటరీ ఆడిట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను అధ్యయనం చేసింది. డెలాయిట్ హస్కిన్స్ అండ్ ఎల్ఎల్పీకి సంబంధించి ఆరు లోపాలను గుర్తించింది. బీఎస్ఆర్ అండ్ కోకు సంబంధించి కూడా ఆరు లోపాలు బయటపడ్డాయి. -
ఆడిటర్లు చట్టబద్ధంగా వ్యవహరించాలి
న్యూఢిల్లీ: ఆడిటర్లు నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడకుండా, విధానపరమైన ప్రక్రియను అనుసరించాలని నేషనల్ ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) చైర్పర్సన్ అజయ్ భూషణ్ ప్రసాద్ పాండే సూచించారు. ఆడిటింగ్ అన్నది కేవలం టిక్ కొట్టే పని మాత్రం కాదన్నారు. పలు కంపెనీల్లో ఆడిటింగ్ లోపాలు బయటపడుతుండడం, ఈ విషయంలో ఆడిటర్లపై నియంత్రణ సంస్థ చర్యలు తీసుకుంటుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై పాండే తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆడిట్ డాక్యుమెంట్లు అన్నవి సరైన విధి విధానాలను అసరించారనే దానికి సాక్ష్యాలుగా పేర్కొన్నారు. ‘‘మేము విలన్‌గా ఇక్కడ లేమని ఆడిటర్ల సమాజానికి నేను హామీ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు సాయం చేయడానికి, వ్యవస్థను మరింత మెరుగుపరచడానికే మేము ఇక్కడ ఉన్నామని తెలియజేస్తున్నాను’’అంటూ పాండే చెప్పారు. ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ (ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను వెల్లడించడం) వ్యవస్థ అనేది ఎంతో ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. ఎన్ఎఫ్ఆర్ఏ కిందకు సుమారు 7,000 కంపెనీలు వస్తాయి. అన్‌లిస్టెడ్ కంపెనీలపైనా నియంత్రణ కలిగి ఉంది. యాజమాన్యం లేదా న్యాయ సలహాలపై ఆడిటర్లు ఎక్కువగా ఆధారపడుతున్నట్టు గుర్తించామని చెప్పారు. ‘‘నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడడం, అవసరమైన విశ్లేషణ చేయకపోవడం అన్నది సరికాదు. నిపుణులు చెప్పిన అభిప్రాయానికే మీరు కూడా మొగ్గు చూపించొచ్చు. కానీ, మీరు ప్రామాణిక ఆడిట్ చేసినట్టు అక్కడ పత్రాలు చెప్పాలి. అది ముఖ్యమైనది’’అని సూచించారు. ఆడిట్‌తో మోసాలు వెలుగులోకి చట్టబద్ధమైన ఆడిటింగ్ ప్రక్రియను అనుసరించినప్పుడు మోసాలను గుర్తించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పాండే అన్నారు. ‘‘ఆడిటర్లు మోసాలను అన్ని వేళలా గుర్తిస్తారని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కానీ, మీరు తగిన విధంగా వ్యవహరిస్తే బయట పడేందుకు మంచి అవకాశాలు ఉంటాయి’’అని చెప్పారు. కంపెనీలు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు అవి తమ ఆడిట్ కమిటీలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇండిపెండెంట్ డైరెక్టర్లకు సాధికారత కలి్పంచాలన్నారు. -
దేవుడే చెప్పినా మా లెక్క తప్పదు!
న్యూఢిల్లీ: స్వయంగా దేవుడే వచ్చి చెప్పినా సరే తాము తప్పుడు లెక్కలు రాయబోమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని స్పష్టం చేశారు. టాప్ మేనేజ్మెంట్ అనైతిక విధానాలకు పాల్పడుతోందంటూ ప్రజావేగులు చేసిన ఆరోపణలు అవమానకరమైనవని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న విచారణపై తమ అభిప్రాయాలు రుద్దే ప్రసక్తి లేదని ఇన్వెస్టర్లతో సమావేశంలో నీలేకని చెప్పారు. మరోవైపు, ఫిర్యాదుల వెనుక సహ వ్యవస్థాపకులు, కొందరు మాజీ ఉద్యోగుల హస్తం ఉందంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన ఖండించారు. ఇవి హేయమైన ఆరోపణలని, వ్యవస్థాపకుల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలని వ్యాఖ్యానించారు. భారీ ఆదాయాలు చూపేందుకు సీఈవో సలిల్ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో నీలేకని వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఈ వదంతులు హేయమైనవి. అంతా ఎంతగానో గౌరవించే వ్యక్తుల ప్రతిష్టను మసకబార్చే లక్ష్యంతో చేస్తున్నవి. సంస్థకు జీవితాంతం సేవలు అందించిన మా సహ–వ్యవస్థాపకులంటే నాకెంతో గౌరవం. వారు కంపెనీ వృద్ధి కోసం నిస్వార్థంగా కృషి చేశారు. భవిష్యత్‌లోనూ కంపెనీ శ్రేయస్సు కోసం పాటుపడేందుకు కట్టుబడి ఉన్నారు‘ అని ఆయన తెలిపారు. టాప్ మేనేజ్మెంట్పై వచ్చిన ఆరోపణల మీద ఇప్పటికే స్వతంత్ర న్యాయ సేవల సంస్థ విచారణ జరుపుతోందని, ఫలితాలు వచ్చాక అందరికీ తెలియజేస్తామని నీలేకని పేర్కొన్నారు. వివరాలు కోరిన ఎన్ఎఫ్ఆర్ఏ.. ప్రజావేగుల ఫిర్యాదులకు సంబంధించి నిర్దిష్ట వివరాలివ్వాలని నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ), కర్ణాటకలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కోరినట్లు ఇన్ఫీ తెలిపింది. ఎక్సే్ఛంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు కూడా మరింత సమాచారం అడిగినట్లు పేర్కొంది. అడిగిన వివరాలన్నింటిని సమర్పించనున్నట్లు ఇన్ఫీ వివరించింది. ప్రజావేగుల ఫిర్యాదులపై ఇన్ఫోసిస్ అంతర్గతంగా విచారణ జరుపుతోంది. అటు అమెరికన్ ఇన్వెస్టర్ల తరఫున అమెరికాలో క్లాస్ యాక్షన్ దావా వేస్తామంటూ ఒక న్యాయ సేవల సంస్థ ప్రకటించింది. -
ఎన్ఎఫ్ఆర్ఏ ఏర్పాటులో తొందరొద్దు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త కంపెనీల చట్టంలో భాగమైన నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) ఏర్పాటు విషయంలో ప్రభుత్వం తొందరపడరాదని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రెసిడెంట్ మనోజ్ ఫడ్నిస్ చెప్పారు. చార్టర్డ్ అకౌం టెంట్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం సహా విస్తృతాధికారాలు ఉండే ఎన్ఎఫ్ఆర్ఏపై ప్రొఫెషనల్స్‌తో మరింతగా చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇప్పటికే నేషనల్ అడ్వైజరీ కమిటీ ఆన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ (ఎన్ఏసీఏఎస్) ఈ తరహా విధుల్లో కొన్నింటిని నిర్వహిస్తున్నందున కొత్తగా ఎన్ఎఫ్ఆర్ఏను ఏర్పాటు చేయడం వల్ల ఒకే పనిని పలు సంస్థలకు అప్పగించినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. కంపెనీల చట్టం 2013పై ఆదివారం ఇక్కడ నిర్వహించిన సెమినార్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఆడిటర్లపై కఠిన చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం తమ క్రమశిక్షణ కమిటీ ముందు దీనికి సంబంధించి ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేవని చెప్పారు. ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ ఎం. దేవరాజ రెడ్డి తదితరులు ఈ సెమినార్లో పాల్గొన్నారు.