పైపైన ఆడిటింగ్‌.. సంక్షోభానికి కారణం | PMC suspended MD Joy Thomas blames superficial auditing | Sakshi
Sakshi News home page

పైపైన ఆడిటింగ్‌.. సంక్షోభానికి కారణం

Published Thu, Oct 3 2019 5:15 AM | Last Updated on Thu, Oct 3 2019 5:18 AM

PMC suspended MD Joy Thomas blames superficial auditing - Sakshi

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు)లో సంక్షోభానికి ఆడిటర్ల తీరే కారణమని బ్యాంకు ఎండీగా సస్పెన్షన్‌కు గురైన జాయ్‌థామస్‌ ఆరోపించారు. సమయాభావంతో బ్యాంకు పుస్తకాలను పైపై ఆడిటింగ్‌ చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్‌బీఐకి ఆయన ఐదు పేజీల లేఖను రాశారు. వసూలు కాని బకాయిలను (ఎన్‌పీఏలు) వాస్తవ గణాంకాల కంటే తక్కువగా చూపించడం వెనుక బ్యాంకు యాజమాన్యం, డైరెక్టర్ల పాత్ర ఉన్నట్టు థామస్‌ అంగీకరించారు.

అలాగే, పీఎంసీ బ్యాంకు మొత్తం రుణ పుస్తకం రూ.8,800 కోట్లలో రూ.6,500 కోట్ల మేర ఒక్క హెచ్‌డీఐఎల్‌ ఖాతాకు (73 శాతం) నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన విషయాన్ని దాచడంలోనూ యాజమాన్యం పాత్ర ఉన్నట్టు థామస్‌ పేర్కొన్నారు. పీఎంసీ బ్యాంకుకు ముగ్గురు ఆడిటర్లు ఉండగా, వీరిలో ఎవరి పేరునూ థామస్‌ తన లేఖలో పేర్కొనలేదు. 2018–19 ఆర్థిక సంవత్సరం వార్షిక నివేదిక ప్రకారం.. లక్డావాల్‌ అండ్‌ కో, అశోక్‌ జయేష్‌ అండ్‌ అసోసియేట్స్, డీబీ కేట్కార్‌ అండ్‌ కో సంస్థలు స్టాట్యుటరీ ఆడిటర్లుగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ముంబై పోలీసు శాఖ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో థామస్‌ లేఖ కూడా భాగంగా ఉంది. థామస్‌తోపాటు, బ్యాంకు చైర్మన్‌ వర్యమ్‌సింగ్, హెచ్‌డీఐఎల్‌ ప్రమోటర్‌ వాద్వాన్‌ పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.

2008 నుంచి గోప్యంగానే..  
బ్యాంకు వృద్ధి క్రమంలో ఉండడంతో ఆడిటర్లు సమయాభావం వల్ల కేవలం పెరిగిన అడ్వాన్స్‌లను (రుణాలు) చూశారే కానీ, మొత్తం బ్యాం కు ఖాతాలకు సంబంధించిన కార్యకలాపాలను పరిశీలించలేదని థామస్‌ తన లేఖలో వివరించా రు. బ్యాంకు ప్రతిష్ట దెబ్బతింటుందన్న భయం తోనే భారీ రుణ ఖాతాల సమాచారాన్ని 2008 నుంచి ఆర్‌బీఐకి తెలియజేయకుండా గుట్టుగా ఉంచినట్టు థామస్‌ తెలిపారు. చెల్లింపుల్లో జా ప్యం ఉన్నప్పటికీ గత మూడేళ్లుగా హెచ్‌డీఐఎల్‌ ఖాతాను స్టాండర్డ్‌గానే చూపించామన్నారు.

రంగంలోకి ఐసీఏఐ
చార్టర్డ్‌ అకౌంటెంట్ల అత్యున్నత మండలి (ఐసీఏఐ) పీఎంసీ బ్యాంకు వ్యవహారంలో రంగంలోకి దిగింది. పీఎంసీ బ్యాంకులో చోటుచేసుకున్న అవకతవకల్లో ఆడిటర్ల పాత్రను తేల్చేందుకు గాను ఆర్‌బీఐ, ఇతర నియంత్రణ సంస్థల నుంచి సమాచారం కో రింది. ఆర్‌బీఐ విజిలెన్స్‌ విభాగం, మహా రాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంకు కమిషనర్‌కు లేఖ రాసింది. తాము గుర్తించిన వివరాలు, ఆడిటర్ల పాత్ర అందులో ఏమైనా ఉందా అన్న వివరాలను తెలియజేయాలని కోరినట్టు ఏఐసీఏఐ తెలిపింది. 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా బ్యాంకు స్టాట్యుటరీ ఆడిటర్ల నుంచి కోరినట్టు వెల్లడించింది. ఆడిటర్ల పాత్ర ఉన్నట్టు తేలితే ఐసీఏఐ తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement