RBI Extended Restrictions On PMC Bank - Sakshi
Sakshi News home page

పీఎంసీ బ్యాంక్‌పై మరో మూడు నెలలు ఆంక్షలు

Published Wed, Dec 29 2021 10:52 AM | Last Updated on Wed, Dec 29 2021 11:20 AM

RBI Extended Restrictions On PMC Bank  - Sakshi

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర సహకార (పీఎంసీ) బ్యాంక్‌పై ఆంక్షలను మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. దీనితో పీఎంసీపై మరో మూడు నెలలు అంటే 2022 మార్చి వరకూ ఆంక్షలు కొనసాగుతాయి.  సంక్షోభంలో ఉన్న పీఎంసీ బ్యాంకును ఢిల్లీకి చెందిన యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (యూఎస్‌బీఐ ) స్వాధీనం చేసుకునేందుకు సంబంధించిన డ్రాఫ్ట్‌ స్కీమ్‌ పక్రియ ఇంకా పూర్తి కానుందున ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. పీఎంసీ బ్యాంక్‌ విలీన పక్రియకు సెంట్రల్‌ బ్యాంక్‌ ముసాయిదా స్కీమ్‌ను సిద్ధం చేసింది. దీనిపై సూచనలను, అభ్యంతరాలను కోరుతూ నవంబర్‌ 22న ప్రజా బాహుళ్యంలో ఉంచింది. దీనికి సంబంధించిన గడువు డిసెంబర్‌10వ తేదీన ముగిసింది. తదుపరి చర్యల ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆర్‌బీఐ తన తాజా ప్రకటనలో పేర్కొంది.

 
ఇప్పటికే పలు సార్లు...
రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ హెచ్‌డీఐఎల్‌కు ఇచ్చిన రుణాలను దాచిపెట్టడం,  తప్పుగా నివేదించడం వంటి కొన్ని ఆర్థిక అవకతవకలను గుర్తించిన నేపథ్యంలో 2019 సెప్టెంబర్‌లో పీఎంసీ బ్యాంక్‌ బోర్డును ఆర్‌బీఐ రద్దు చేసింది.  ఆ బ్యాంక్‌ ఖాతాదారుల ఉపసంహరణలపై పరిమితులుసహా పలు నియంత్రణలు విధించింది. ఆ తర్వాత పలుమార్లు ఆంక్షలు పొడిగించింది.  సంబంధిత ఆదేశాలను చివరిసారిగా ఈ ఏడాది జూన్‌లో పొడిగించడం జరిగింది. డిసెంబర్‌ 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్‌బీఐ తాజా ఆంక్షల పొడిగింపు నిర్ణయం తీసుకుంది. విలీనం ముసాయిదా పథకం ప్రకారం, యూఎస్‌ఎఫ్‌బీ ద్వారా డిపాజిట్లతో సహా పీఎంసీ బ్యాంక్‌ ఆస్తులు, రుణాలు స్వాధీనం అవుతాయి. తద్వారా డిపాజిటర్ల ప్రయోజనాలకు కూడా అధిక రక్షణ కలుగుతుందని గత నెల్లో ఆర్‌బీఐ తెలిపింది. యూఎస్‌ఎఫ్‌బీని ‘జాయింట్‌ ఇన్వెస్టర్‌’గా సెంట్రమ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, రెసైలెంట్‌ ఇన్నోవేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోట్‌ చేస్తున్నాయి. దీనికి 2021 అక్టోబర్‌లో బ్యాంకింగ్‌ లైసెన్స్‌ కూడా లభించింది. నవంబర్‌ 1 నుంచీ యూఎస్‌ఎఫ్‌బీ కార్కకలాపాలు ప్రారంభమయ్యాయి.   

చదవండి: బ్యాంకుల్లో పాలన మెరుగుపడాలి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement