PMC Bank Scam: RBI Announces Relief For PMC Victims - Sakshi
Sakshi News home page

నిలువునా ముంచేసిన బ్యాంకు.. 200 మంది మరణం.. చివరకు స్వల్ప ఊరట

Published Wed, Sep 22 2021 12:16 PM | Last Updated on Wed, Sep 22 2021 3:07 PM

RBI Announces Relief To PMC Victims: The Full Story OF PMC Crisis - Sakshi

PMC Crisis: పంజాబ్‌ మహరాష్ట్ర నేషనల్‌ బ్యాంక్‌ (పీఎంసీ బ్యాంక్‌) కుంభకోణంలో డిపాజిట్‌దారులకు స్వల్ప ఊరట లభించింది. స్వల్ప మొత్తాల డిపాజిట్లకు సంబంధించిన చెల్లింపుల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా తాజాగా జారీ చేసిన ఆదేశాలు బాధితులకు కొంత మేర ఉపశమనం కలిగించాయి. 

90 రోజుల్లో
బ్యాంక్‌ మేనేజర్‌ అడ్డదారులు తొక్కడంతో పీఎంసీ బ్యాంకు నష్టాల ఊబిలో కూరుకుపోయింది. 2019 సెప్టెంబరు నుంచి డిపాజిట్‌దారులు తమ సొమ్ములు వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంపై ఆర్బీఐ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకులో దాచుకున్న సొమ్ము వడ్డీతో కలిపి మొత్తం ఐదు లక్షల రూపాయల లోపు ఉన్న వారు దరఖాస్తు చేసుకున్న తర్వాత 90 రోజుల్లోగా నగదు చెల్లింపులు ఉంటాయని ఆర్బీఐ ప్రకటించింది. డిపాజిట్‌ ఇన్సురెన్స్‌, క్రెడిట్‌ గ్యారంటీ కార్పోరేషన్‌ ద్వారా ఈ చెల్లింపులు చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల లక్ష మంది వరకు బాధితులకు ఊరట లభించనుంది.

మరి వారి సంగతి
ముంబై ప్రధాన కార్యాలయంగా పంజాబ్‌ మహారాష్ట నేషనల్‌ బ్యాంకుకి దాదాపు పది లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. ఆర్బీఐ తాజాగా తీసుకున్న నిర్ణయంతో కేవలం లక్ష మంది వరకు సేఫ్‌ జోన్‌లోకి వెళ్తున్నారు. కానీ మిగిలిన డిపాజిటర్ల పరిస్థితి ఇంకా అగమ్యగోచరంగానే ఉంది. ఇందులో 43,000ల మంది ఖాతాదారులైతే భారీ మొత్తంలో తమ సొమ్మును ఈ బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. 

ఎదిగిన తీరు
పీఎంసీ బ్యాంకుని 1984లో నవీ ముంబైలో ఏర్పాటు చేశారు. ఎక్కువ వడ్డీ ఇస్తుండటంతో ముంబైలో పని చేసే కార్మికులు, ఉద్యోగులు ఈ బ్యాంకును ఆదరించారు. దీంతో అనతి కాంలోనే మహారాష్ట్ర, పంజాబ్‌లతో పాటు దేశమంతటా 130 వరకు బ్రాంచీలకు విస్తరించింది. ఖాతాదారుల సంఖ్య పది లక్షల వరకు చేరుకుంది. దేశంలో ఉన్న సహాకార బ్యాంకుల్లో 11 శాతం డిపాజిట్లతో అగ్రగామి బ్యాంకుగా పీఎంసీ ఎదిగింది. 

కుప్ప కూలిన వైనం
మహారాష్ట్రలోని బందూప్‌ బ్రాంచ్‌లో తొలిసారిగా కుంభకోణానికి బీజం పడింది. ఇక్కడి నుంచి ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి నిబంధనలకు తూట్లు పొడుస్తూ బాం‍్యకు సిబ్బంది రూ. 6500 కోట్ల రూపాయల రుణం మంజూరు చేశారు. అంతేకాకుండా ఊరుపేరు ఖాతాలు సృష్టించి సామాన్యుల నుంచి సేకరించిన సొమ్మును తరించారు. చివరకు 2019 సెప్టెంబరులో ఈ పాపం వెలుగులోకి వచ్చింది. 

కష్టాల్లోకి  ఖాతాదారులు
దీంతో 2019 సెప్టెంబరులో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు లావాదేవీలు నిలిపేసింది. దీంతో కష్టపడి ఈ బ్యాంకులో సొమ్ములు దాచుకున్న ఎందరో ఆందోళన చెందారు. తమ డబ్బులు వెనక్కి తీసుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కుంభ కోణం వెలుగు చూసిన నెల రోజుల వ్యవధిలోనే 20 మందికి పైగా ఖాతాదారులు మరణించారు. కానీ ఏళ్లు గడిచినా సమస్యకు పరిష్కారం లభించలేదు.

కరోనా ఎఫెక్ట్‌తో కూలిన బతుకులు
బ్యాంకు సంక్షోభం రేపోమాపో చక్కబడుతుందనుకులోగా కరోనా వచ్చి పడింది. దాని వెంటే లాక్‌డౌన్‌ రావడంతో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో ఏళ్ల తరబడి ఈ బ్యాంకులో డబ్బులు దాచుకున్న డిపాజిట్లు అష్టకష్టాలు పడ్డారు. పీఎంసీ బ్యాంకు ఫైట్‌ పేరుతో గ్రూపులుగా ఏర్పడి పోరాటం చేస్తున్నారు. వీరు చెప్పిన వివరాల ప్రకారమే కేవలం ఈ బ్యాంకు చేసిన ద్రోహం కారణంగా ఇప్పటి వరకు 200ల మందికి పైగా ఖాతాదారులు మరణించారు. ఇందులో కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడగా మరికొందరు అక్కరలో డబ్బులు అందక మరణించారు. మరెంతో మంది ఆర్థిక ఆధారం లేక దుర్బర జీవితం గడుపుతున్నారు.

అందర్నీ ఆదుకోవాలి
ముంబైలో పని చేసే కార్మికులు, ఉద్యోగస్తులు చిరు వ్యాపారాలు చేయాలని, ఇళ్లు కట్టుకోవాలనే లక్ష్యంతో తమ రెక్కల కష్టాన్ని ఈ బ్యాంకులో దాచుకున్నారు. ఆర్బీఐ తాజా నిర్ణయం కొంత మేరకు ఊరట ఇచ్చినా.. చాలా మంది ఇంకా తమ కష్టాల నుంచి గట్టెక్కలేదు. డిపాజిట్‌ ఇన్సురెన్స్‌, క్రెడిట్‌ గ్యారంటీ కార్పోరేషన్‌ ద్వారా అందరికీ న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
చదవండి : ఆర్బీఐ కీలక నిర్ణయం.. విదేశాల్లోనూ యూపీఐ పేమెంట్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement