పీఎంసీ ఖాతాదారులతో చర్చిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ముంబై: కోపరేటివ్ బ్యాంకుల మెరుగైన నిర్వహణకు అవసరమైతే చట్టంలో సవరణలు తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇటీవలే ఆర్‌బీఐ ఆంక్షల పరిధిలోకి వెళ్లిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) డిపాజిటర్ల ఆగ్రహాన్ని మంత్రి గురువారం ముంబై వచ్చిన సందర్భంగా స్వయంగా చవిచూశారు. దక్షిణ ముంబైలోని బీజేపీ కార్యాలయం వద్దకు పీఎంసీ బ్యాంకు డిపాజిటర్లు చేరుకుని తమ డబ్బులను పూర్తిగా తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు డిపాజిటర్లను మంత్రి లోపలకు తీసుకెళ్లి, స్వయంగా మాట్లాడి వారి ఆందోళనను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కోపరేటివ్ బ్యాంకుల్లో పాలన మెరుగ్గా ఉండేందుకు చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖల కార్యదర్శులు, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌తో ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కోపరేటివ్ బ్యాంకుల చట్టంలో లోపాలు ఉన్నాయని తాను భావించడం లేదన్నారు. కాకపోతే, భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు తిరిగి చోటు చేసుకోకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమని, అందుకే ప్యానెల్ ఏర్పాటు అని చెప్పారు. అవసరమైతే కోపరేటివ్ బ్యాంకుల చట్టాలకు సవరణలను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చేపడతామని తెలిపారు.
ప్రభుత్వ పాత్ర పరిమితమే..
బహుళ రాష్ట్రాల్లో పనిచేసే కోపరేటివ్ బ్యాంకులను ఆర్‌బీఐ నియంత్రిస్తుందని డిపాజిటర్లకు చెప్పినట్టు మంత్రి వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వ పాత్ర పరిమితమేనన్నారు. కాకపోతే డిపాజిటర్ల అత్యవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్‌బీఐ గవర్నర్‌ను కోరతానని ఆమె హామీ ఇచ్చారు. పీఎంసీ బ్యాంకులో రుణాల కుంభకోణం వెలుగు చూడడం, ఎన్‌పీఏల గణాంకాల్లో బ్యాంకు అక్రమాలకు పాల్పడడంతో ఆర్‌బీఐ ఆంక్షలను అమలు చేసిన విషయం గమనార్హం. ఒక్కో ఖాతా (సేవింగ్స్, కరెంటు, డిపాజిట్) నుంచి గరిష్టంగా రూ.10,000 మాత్రమే ఉపసంహరణకు అనుమతించింది. పీఎంసీ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా తన మొత్తం రుణాల్లో (సుమారు రూ.9వేల కోట్లు) 70% మేర హెచ్‌డీఐఎల్ ఖాతా ఒక్కదానికే ఇవ్వడం గమనార్హం.
వృద్ధి కోసం ప్రోత్సాహకాలు
దేశం ఆర్థిక మందగమనం ఎదుర్కొం టోందని ప్రభుత్వం అంగీకరిస్తుందా? అన్న ప్రశ్నకు... మంత్రి నిర్మలా సీతారామన్ సూటి సమాధానం దాటవేశారు. రంగాలవారీగా అవసరమైన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పారు. సాయం అవసరమైన అన్ని రంగాలకు ఉపశమనం కల్పిస్తున్నట్టు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment