amendment the law
-
ఎల్ఐసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఐపీవో దిశగా దూసుకెళ్తున్న బీమా రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(ఎల్ఐసీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఐసీలో ఆటోమేటిక్ రూట్లో 20 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)లకు కేంద్ర మంత్రివర్గం శనివారం ఆమోదం తెలిపిందని సమాచారం. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ బీమా సంస్థలో వాటాను పాక్షికంగా విక్రయించడం, తాజా ఈక్విటీ మూలధనాన్ని పెంచడం ద్వారా ఐపీవోతో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ షేర్లను లిస్టింగ్ చేసేందుకు ప్రభుత్వం ఆమోదించింది. దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఆఫర్‌కు వేదికగా నిలిచిన ఎల్ఐసీ 5 శాతం వాటాను (31.6 కోట్లకుపైగా షేర్లు) రూ.63,000 కోట్లకు విక్రయించేందుకు ఫిబ్రవరి 13న సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవో మార్చిలో ప్రారంభం కానుంది. సంస్థ ఉద్యోగులు, పాలసీదార్లకు ఫ్లోర్ ప్రైస్‌పై తగ్గింపు లభిస్తుంది. భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ అతి పెద్దదిగా నిలవనుంది. లిస్టింగ్ పూర్తి అయితే సంస్థ మార్కెట్ విలువ రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ వంటి అగ్ర శ్రేణి కంపెనీలతో పోల్చవచ్చు. చదవండి: చేతుల్లో డబ్బులు లేవా..? అయితే మీ ఎల్ఐసీ పాలసీ ప్రీమియంను ఇలా చెల్లించండి...! -
కోపరేటివ్ బ్యాంకులకు చికిత్స!
ముంబై: కోపరేటివ్ బ్యాంకుల మెరుగైన నిర్వహణకు అవసరమైతే చట్టంలో సవరణలు తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇటీవలే ఆర్బీఐ ఆంక్షల పరిధిలోకి వెళ్లిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) డిపాజిటర్ల ఆగ్రహాన్ని మంత్రి గురువారం ముంబై వచ్చిన సందర్భంగా స్వయంగా చవిచూశారు. దక్షిణ ముంబైలోని బీజేపీ కార్యాలయం వద్దకు పీఎంసీ బ్యాంకు డిపాజిటర్లు చేరుకుని తమ డబ్బులను పూర్తిగా తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు డిపాజిటర్లను మంత్రి లోపలకు తీసుకెళ్లి, స్వయంగా మాట్లాడి వారి ఆందోళనను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కోపరేటివ్ బ్యాంకుల్లో పాలన మెరుగ్గా ఉండేందుకు చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖల కార్యదర్శులు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌తో ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కోపరేటివ్ బ్యాంకుల చట్టంలో లోపాలు ఉన్నాయని తాను భావించడం లేదన్నారు. కాకపోతే, భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు తిరిగి చోటు చేసుకోకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమని, అందుకే ప్యానెల్ ఏర్పాటు అని చెప్పారు. అవసరమైతే కోపరేటివ్ బ్యాంకుల చట్టాలకు సవరణలను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చేపడతామని తెలిపారు. ప్రభుత్వ పాత్ర పరిమితమే.. బహుళ రాష్ట్రాల్లో పనిచేసే కోపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ నియంత్రిస్తుందని డిపాజిటర్లకు చెప్పినట్టు మంత్రి వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వ పాత్ర పరిమితమేనన్నారు. కాకపోతే డిపాజిటర్ల అత్యవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్బీఐ గవర్నర్‌ను కోరతానని ఆమె హామీ ఇచ్చారు. పీఎంసీ బ్యాంకులో రుణాల కుంభకోణం వెలుగు చూడడం, ఎన్పీఏల గణాంకాల్లో బ్యాంకు అక్రమాలకు పాల్పడడంతో ఆర్బీఐ ఆంక్షలను అమలు చేసిన విషయం గమనార్హం. ఒక్కో ఖాతా (సేవింగ్స్, కరెంటు, డిపాజిట్) నుంచి గరిష్టంగా రూ.10,000 మాత్రమే ఉపసంహరణకు అనుమతించింది. పీఎంసీ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా తన మొత్తం రుణాల్లో (సుమారు రూ.9వేల కోట్లు) 70% మేర హెచ్‌డీఐఎల్ ఖాతా ఒక్కదానికే ఇవ్వడం గమనార్హం. వృద్ధి కోసం ప్రోత్సాహకాలు దేశం ఆర్థిక మందగమనం ఎదుర్కొం టోందని ప్రభుత్వం అంగీకరిస్తుందా? అన్న ప్రశ్నకు... మంత్రి నిర్మలా సీతారామన్ సూటి సమాధానం దాటవేశారు. రంగాలవారీగా అవసరమైన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పారు. సాయం అవసరమైన అన్ని రంగాలకు ఉపశమనం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. -
దుర్వినియోగానికి తావీయొద్దు
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు మరిన్ని అధికారాలు కట్టబెట్టే సవరణ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం(యూఏపీఏ) సవరణ బిల్లును సభ ఇంకా ఆమోదించాల్సి ఉంది. ముంబైపై 2008లో ఉగ్రదాడి జరిగాక ఈ తరహా నేరాలను సమర్థవంతంగా అణచడం కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ అవసరమన్న అభిప్రాయం వ్యక్తమైంది. నిజమే, ఉగ్రవాదం మూలాలు వెదికి పట్టుకోవడం అంత సులభం కాదు. ఒక రాష్ట్రానికి చెందిన ఉగ్రవాదులు మరో రాష్ట్రంలోకి ప్రవేశించి భయోత్పాత ఘటనలకు పాల్పడి పరారు కావడం లేదా సరిహద్దు ఆవలినుంచి వచ్చి అలజడులు సృష్టించి తప్పించుకోవడం వంటి ఉదంతాలను సాధారణ పోలీసు దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయడం అసాధ్యం. ఇతరత్రా కేసుల ఒత్తిడి ఉండే సీబీఐకి కూడా అది కుదరని పని. ఇవన్నీ చూశాకే అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దశాబ్దకాలం ఆచరణ గమనించాక ఆ సంస్థకు మరిన్ని అధికారాలు అవసరమని భావించినట్టు కేంద్రం చెబుతుండగా...దేశంలో పోలీసు రాజ్యం స్థాపించడమే దీని ఆంతర్యమని కాంగ్రెస్, ఎంఐఎం, ఇతర విపక్షాలు ఆరోపించాయి. ఇలాంటి విమర్శలే గతవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన యూఏపీఏ సవరణ బిల్లుపై కూడా వ్యక్తమయ్యాయి. విదేశాల్లో ఉండే మన పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు చేసేవారిని, విదేశాల్లో మన ప్రయోజనాలను దెబ్బతీసేవారిని గుర్తించి వారిపై ఉగ్రవాద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ సవరణ బిల్లు అవకాశమిస్తోంది. అలాగే ఈ సంస్థ ఇకపై సైబర్ నేరాలను, మనుషుల అక్రమ రవాణాకు సంబంధించిన నేరాలను, నకిలీ కరెన్సీ బెడదను దర్యాప్తు చేయడం ఈ సవరణల వల్ల వీలవుతుంది. వీటితోపాటు జిల్లా సెషన్స్ కోర్టులను అవసరాన్నిబట్టి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులుగా పరిగణించి ఉగ్రవాద కేసుల్ని అక్కడ విచారించేందుకు వీలు కల్పించడం కూడా ఈ సవరణల ఉద్దేశం. యూఏపీఏ సవరణ బిల్లు ఏ వ్యక్తినైనా ఉగ్రవాదిగా పరిగణించడానికి ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. వారి ఆస్తుల్ని స్వాధీనం లేదా జప్తు చేసేందుకు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్‌కు అధికారమిస్తుంది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఏదైనా సంస్థను ఉగ్రవాద సంస్థగా పరిగణించడానికి మాత్రమే వీలుంది. పాకిస్తాన్లో ఉంటున్న ఉగ్రవాద కార్యకలాపాలు సాగించే మసూద్ అజర్ వంటివారిని ఉగ్రవాదిగా పరిగణిస్తే ఆ దేశంపై అది ఒత్తిడి కలిగిస్తుందన్నది ప్రభుత్వం భావన. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించాలన్నదే తమ ఏకైక ఉద్దేశమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చ సందర్భంగా వివరించారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయబోమని కూడా హామీ ఇచ్చారు. కొత్త కొత్త రూపాల్లో సవాళ్లు ఎదురైనప్పుడు, ఉన్న చట్టాలు చాలనప్పుడు కొత్త చట్టాల ఆలోచన వస్తుంది. సమస్యను ఎదుర్కొనడానికి అవసరమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకు అన్ని పక్షాలూ సహకరిస్తాయి. కానీ ఇలాంటి చట్టాలతో చిక్కేమిటంటే వాటిల్లో ఏదీ స్పష్టంగా ఉండదు. 1967లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం మొదటిసారి చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం–యూఏపీఏను చేసినప్పుడు ఆనాటి విపక్ష నేతలు వాజపేయి, పీలూ మోడీ దాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దేశ ప్రజల్లో నమ్మకం కోల్పోయిన పర్యవసానంగానే పాలకులు ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తున్నారని నిశితంగా విమర్శించారు. ఆ చట్టానికే యూపీఏ హయాంలో 2004, 2008 సంవత్సరాల్లో సవరణలు తీసుకొచ్చారు. అప్పుడు కూడా వామపక్షాలు, కొన్ని ఇతర పార్టీలు అభ్యంతరం చెప్పాయి. ఉగ్రవాద చర్యకు ఈ సవరణలు విస్తృతార్థం ఇవ్వడం వల్ల చట్టబద్ధ నిరసనలు సైతం నేరంగా మారతాయని, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం లేని సాధారణ సంస్థలపై కేసులు బనాయించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని ఆరోపించాయి. ఈ చట్టం కింద నిందితులైనవారికి సుదీర్ఘ కాలం నిర్బంధంలో ఉండక తప్పని స్థితి ఏర్పడుతుం దన్నాయి. విషాదమేమంటే అవన్నీ కేవల భయాలు కావని ఆ చట్టం అమలు చాటింది. ఉదాహ రణకు మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితులైనవారు పదేళ్లపాటు జైల్లో ఉన్నారు. తీరా వారంతా నిర్దోషులుగా తేలారు. బహిరంగంగా పనిచేసే సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్, విప్లవకవి వరవరరావు తదితరులు గత కొన్ని నెలలుగా జైళ్లలో మగ్గుతున్నారు. పైగా యూఏపీఏ చట్టం కింద నమోదైన కేసుల్లో అత్యధికం న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయి. జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం 2016లో 67 శాతం కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటి కొచ్చారు. అంతకుముందు సంవత్సరం 85 శాతం కేసుల పరిస్థితి కూడా ఇంతే. ఒక నేరం చేసిన వారిని శిక్షించడం కోసం కాక, ఇష్టం లేని, ఇబ్బందికరంగా మారిన వ్యక్తులను దీర్ఘకాలం నిర్బం ధించడానికి మాత్రమే ఇది వినియోగపడుతోంది. జిల్లా సెషన్స్ కోర్టులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులుగా పరిగణించి ఆ సంస్థ దర్యాప్తు చేసిన కేసు లపై విచారణ జరిపేందుకు అవకాశమివ్వడం కూడా అంత సబబైన నిర్ణయం అనిపించదు. మన న్యాయస్థానాలు ఇప్పటికే పెండింగ్ కేసుల భారంతో ఇబ్బందులు పడుతున్నాయి. సామా న్యులకు సకాలంలో న్యాయం లభించడం అసాధ్యమవుతోంది. ఇప్పుడు వాటిని ఎన్ఐఏ కోర్టులుగా పరిగ ణించడం వల్ల ఆ కేసుల విచారణ భారం కూడా తోడవుతుంది. రోజువారీ కేసుల విచారణతోపాటు ఉగ్రవాద కేసుల్ని కూడా చూడాల్సిరావడం వల్ల వాటి పని మందగిస్తుంది. మరోపక్క ఉగ్రవాద నిందితులను త్వరితగతిన విచారించి శిక్షించడం అసాధ్యమవుతుంది. కఠినమైన చట్టాలు తీసుకొచ్చినప్పుడు అమాయకులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చట్ట నిబంధనల్లో అస్పష్టతను పరిహరించడం ద్వారా, ఆ చట్టాలు దుర్వినియోగం కాకుండా తగిన రక్షణలు కల్పించడం ద్వారా మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాలి. -
కట్నం వేధింపులపై సుప్రీం తీర్పు సవరణ
న్యూఢిల్లీ: వరకట్నం వేధింపుల కేసులో భర్త, అతని కుటుంబ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా సవరించింది. తాము గతంలో ఇచ్చి తీర్పు చట్టాలకు లోబడి లేదని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. క్రిమినల్ కేసుల్లో ఇరుపక్షాలు రాజీకి వచ్చినా కేసును కొట్టేసే అధికారం కేవలం హైకోర్టులకు మాత్రమే ఉంటుందని తేల్చిచెప్పింది. మరోవైపు కుష్టు వ్యాధిగ్రస్తులు రిజర్వేషన్, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేలా దివ్యాంగుల చట్టం–2016లో నిబంధనలు సవరించే అంశాన్ని పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. -
‘జల్లికట్టుపై మాట్లాడను..ఆర్డినెన్స్ తెలియదు’
న్యూఢిల్లీ: తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం జల్లికట్టు అనేది ఓ సంప్రదాయ కళ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇది తమిళనాడులో ఒక సంప్రదాయబద్ధమైన క్రీడ అని చెప్పారు. దీంతో ఎవరికీ సమస్య ఉంటుందని అనుకోవడం లేదన్నారు. మరో రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ రానుండగా జల్లికట్టు వివాదంపై స్పందించేందుకు వెంకయ్యనాయుడు నిరాకరించారు. అయితే, జల్లికట్టు క్రీడకు అడ్డుగా ఉన్న చట్టాన్ని సవరించాలంటూ ఇప్పటికే పలు విజ్ఞప్తులు వస్తున్నట్లు వివరించారు. ‘జల్లికట్టు క్రీడకు సంబంధించి సలహాలు తీసుకుంటున్నాం. విజ్ఞప్తులు వింటున్నాం. షాబానో కేసులో ఇదే చేశాం. అయితే, ఈ విషయాన్ని ఇంకా పరిశీలించాల్సి ఉంది. చర్చించాల్సి ఉంది. కోర్టులు ఏం ఆలోచిస్తున్నాయనే విషయం తెలుసుకోవాలి. వ్యక్తిగతంగా నా దృష్టిలో జల్లికట్టు తమిళనాడులోని తరతరాలుగా వస్తున్న సంప్రదాయ కళ, క్రీడ’ అని వెంకయ్య అన్నారు. జనవరి 14 లోపు ఏవైనా ఆర్డినెన్స్ తీసుకొస్తారా లేదా అనే విషయం కూడా తనకు తెలియదని చెప్పారు.