దుర్వినియోగానికి తావీయొద్దు | Loksabha Passed NIA Amendment Bill | Sakshi
Sakshi News home page

దుర్వినియోగానికి తావీయొద్దు

Published Wed, Jul 17 2019 12:30 AM | Last Updated on Wed, Jul 17 2019 12:30 AM

Loksabha Passed NIA Amendment Bill - Sakshi

జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు మరిన్ని అధికారాలు కట్టబెట్టే సవరణ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం(యూఏపీఏ) సవరణ బిల్లును సభ ఇంకా ఆమోదించాల్సి ఉంది. ముంబైపై 2008లో ఉగ్రదాడి జరిగాక ఈ తరహా నేరాలను సమర్థవంతంగా అణచడం కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ అవసరమన్న అభిప్రాయం వ్యక్తమైంది. నిజమే, ఉగ్రవాదం మూలాలు వెదికి పట్టుకోవడం అంత సులభం కాదు. ఒక రాష్ట్రానికి చెందిన ఉగ్రవాదులు మరో రాష్ట్రంలోకి ప్రవేశించి భయోత్పాత ఘటనలకు పాల్పడి పరారు కావడం లేదా సరిహద్దు ఆవలినుంచి వచ్చి అలజడులు సృష్టించి తప్పించుకోవడం వంటి ఉదంతాలను సాధారణ పోలీసు దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయడం అసాధ్యం.

ఇతరత్రా కేసుల ఒత్తిడి ఉండే సీబీఐకి కూడా అది కుదరని పని. ఇవన్నీ చూశాకే అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దశాబ్దకాలం ఆచరణ గమనించాక ఆ సంస్థకు మరిన్ని అధికారాలు అవసరమని భావించినట్టు  కేంద్రం చెబుతుండగా...దేశంలో పోలీసు రాజ్యం స్థాపించడమే దీని ఆంతర్యమని కాంగ్రెస్, ఎంఐఎం, ఇతర విపక్షాలు ఆరోపించాయి. ఇలాంటి విమర్శలే గతవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన యూఏపీఏ సవరణ బిల్లుపై కూడా వ్యక్తమయ్యాయి. విదేశాల్లో ఉండే మన పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు చేసేవారిని, విదేశాల్లో మన ప్రయోజనాలను దెబ్బతీసేవారిని గుర్తించి వారిపై ఉగ్రవాద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఐఏ సవరణ బిల్లు అవకాశమిస్తోంది. అలాగే ఈ సంస్థ ఇకపై సైబర్‌ నేరాలను, మనుషుల అక్రమ రవాణాకు సంబంధించిన నేరాలను, నకిలీ కరెన్సీ బెడదను దర్యాప్తు చేయడం ఈ సవరణల వల్ల వీలవుతుంది.

వీటితోపాటు జిల్లా సెషన్స్‌ కోర్టులను అవసరాన్నిబట్టి ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులుగా పరిగణించి ఉగ్రవాద కేసుల్ని అక్కడ విచారించేందుకు వీలు కల్పించడం కూడా ఈ సవరణల ఉద్దేశం. యూఏపీఏ సవరణ బిల్లు ఏ వ్యక్తినైనా ఉగ్రవాదిగా పరిగణించడానికి ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. వారి ఆస్తుల్ని స్వాధీనం లేదా జప్తు చేసేందుకు ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌కు అధికారమిస్తుంది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఏదైనా సంస్థను ఉగ్రవాద సంస్థగా పరిగణించడానికి మాత్రమే వీలుంది.  పాకిస్తాన్‌లో ఉంటున్న ఉగ్రవాద కార్యకలాపాలు సాగించే మసూద్‌ అజర్‌ వంటివారిని ఉగ్రవాదిగా పరిగణిస్తే ఆ దేశంపై అది ఒత్తిడి కలిగిస్తుందన్నది ప్రభుత్వం భావన. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించాలన్నదే తమ ఏకైక ఉద్దేశమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చర్చ సందర్భంగా వివరించారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయబోమని కూడా హామీ ఇచ్చారు.

కొత్త కొత్త రూపాల్లో సవాళ్లు ఎదురైనప్పుడు, ఉన్న చట్టాలు చాలనప్పుడు కొత్త చట్టాల ఆలోచన వస్తుంది. సమస్యను ఎదుర్కొనడానికి అవసరమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకు అన్ని పక్షాలూ సహకరిస్తాయి. కానీ ఇలాంటి చట్టాలతో చిక్కేమిటంటే వాటిల్లో ఏదీ స్పష్టంగా ఉండదు. 1967లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం మొదటిసారి చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం–యూఏపీఏను చేసినప్పుడు ఆనాటి విపక్ష నేతలు వాజపేయి, పీలూ మోడీ దాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దేశ ప్రజల్లో నమ్మకం కోల్పోయిన పర్యవసానంగానే పాలకులు ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తున్నారని నిశితంగా విమర్శించారు. ఆ చట్టానికే యూపీఏ హయాంలో 2004, 2008 సంవత్సరాల్లో సవరణలు తీసుకొచ్చారు. అప్పుడు కూడా వామపక్షాలు, కొన్ని ఇతర పార్టీలు అభ్యంతరం చెప్పాయి. ఉగ్రవాద చర్యకు ఈ సవరణలు విస్తృతార్థం ఇవ్వడం వల్ల చట్టబద్ధ నిరసనలు సైతం నేరంగా మారతాయని, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం లేని సాధారణ సంస్థలపై కేసులు బనాయించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని ఆరోపించాయి.

ఈ చట్టం కింద నిందితులైనవారికి సుదీర్ఘ కాలం నిర్బంధంలో ఉండక తప్పని స్థితి ఏర్పడుతుం దన్నాయి. విషాదమేమంటే అవన్నీ కేవల భయాలు కావని ఆ చట్టం అమలు చాటింది. ఉదాహ రణకు మాలెగావ్‌ పేలుళ్ల కేసులో నిందితులైనవారు పదేళ్లపాటు జైల్లో ఉన్నారు. తీరా వారంతా నిర్దోషులుగా తేలారు. బహిరంగంగా పనిచేసే సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్, విప్లవకవి వరవరరావు తదితరులు గత కొన్ని నెలలుగా జైళ్లలో మగ్గుతున్నారు. పైగా యూఏపీఏ చట్టం కింద నమోదైన కేసుల్లో అత్యధికం న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయి. జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం 2016లో 67 శాతం కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటి కొచ్చారు. అంతకుముందు సంవత్సరం 85 శాతం కేసుల పరిస్థితి కూడా ఇంతే. ఒక నేరం చేసిన వారిని శిక్షించడం కోసం కాక, ఇష్టం లేని, ఇబ్బందికరంగా మారిన వ్యక్తులను దీర్ఘకాలం నిర్బం ధించడానికి మాత్రమే ఇది వినియోగపడుతోంది.  

జిల్లా సెషన్స్‌ కోర్టులను ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులుగా పరిగణించి ఆ సంస్థ దర్యాప్తు చేసిన కేసు లపై విచారణ జరిపేందుకు అవకాశమివ్వడం కూడా అంత సబబైన నిర్ణయం అనిపించదు. మన న్యాయస్థానాలు ఇప్పటికే పెండింగ్‌ కేసుల భారంతో ఇబ్బందులు పడుతున్నాయి. సామా న్యులకు సకాలంలో న్యాయం లభించడం అసాధ్యమవుతోంది. ఇప్పుడు వాటిని ఎన్‌ఐఏ కోర్టులుగా పరిగ ణించడం వల్ల ఆ కేసుల విచారణ భారం కూడా తోడవుతుంది. రోజువారీ కేసుల విచారణతోపాటు ఉగ్రవాద కేసుల్ని కూడా చూడాల్సిరావడం వల్ల వాటి పని మందగిస్తుంది. మరోపక్క ఉగ్రవాద నిందితులను త్వరితగతిన విచారించి శిక్షించడం అసాధ్యమవుతుంది. కఠినమైన చట్టాలు తీసుకొచ్చినప్పుడు అమాయకులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చట్ట నిబంధనల్లో అస్పష్టతను పరిహరించడం ద్వారా, ఆ చట్టాలు దుర్వినియోగం కాకుండా తగిన రక్షణలు కల్పించడం ద్వారా మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement