‘జల్లికట్టుపై మాట్లాడను..ఆర్డినెన్స్ తెలియదు’
న్యూఢిల్లీ: తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం జల్లికట్టు అనేది ఓ సంప్రదాయ కళ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇది తమిళనాడులో ఒక సంప్రదాయబద్ధమైన క్రీడ అని చెప్పారు. దీంతో ఎవరికీ సమస్య ఉంటుందని అనుకోవడం లేదన్నారు. మరో రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ రానుండగా జల్లికట్టు వివాదంపై స్పందించేందుకు వెంకయ్యనాయుడు నిరాకరించారు. అయితే, జల్లికట్టు క్రీడకు అడ్డుగా ఉన్న చట్టాన్ని సవరించాలంటూ ఇప్పటికే పలు విజ్ఞప్తులు వస్తున్నట్లు వివరించారు.
‘జల్లికట్టు క్రీడకు సంబంధించి సలహాలు తీసుకుంటున్నాం. విజ్ఞప్తులు వింటున్నాం. షాబానో కేసులో ఇదే చేశాం. అయితే, ఈ విషయాన్ని ఇంకా పరిశీలించాల్సి ఉంది. చర్చించాల్సి ఉంది. కోర్టులు ఏం ఆలోచిస్తున్నాయనే విషయం తెలుసుకోవాలి. వ్యక్తిగతంగా నా దృష్టిలో జల్లికట్టు తమిళనాడులోని తరతరాలుగా వస్తున్న సంప్రదాయ కళ, క్రీడ’ అని వెంకయ్య అన్నారు. జనవరి 14 లోపు ఏవైనా ఆర్డినెన్స్ తీసుకొస్తారా లేదా అనే విషయం కూడా తనకు తెలియదని చెప్పారు.