
న్యూఢిల్లీ: ఆడిటింగ్‌లో మరింత పటిష్టమైన, శాస్త్రీయమైన పద్ధతులను పాటించాలని ఆడిటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సమస్యలను గుర్తించడంలోనూ, పరిష్కారాలను కనుగొనడంలోనూ ఆడిటింగ్ కీలక సాధనమని ఆయన పేర్కొన్నారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్వహించిన తొలి ఆడిట్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ విషయాలు తెలిపారు. ఒకప్పుడు దేశీయంగా ఆడిట్ అంటే ఒకింత అనుమానంగా, భయంగాను చూసేవారని, కాగ్.. ప్రభుత్వం ఒకదానితో మరొకటి తలపడినట్లుగా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు.
కానీ ప్రస్తుతం మైండ్‌సెట్ మారిందన్నారు. విలువ జోడింపులో ఆడిట్ కీలక పాత్ర పోషిస్తుందన్న భావన నెలకొందని మోదీ చెప్పారు. గత ప్రభుత్వం పాటించిన తప్పుడు విధానాలు, పారదర్శకత లేకపోవడం వల్లే బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీలు పెరిగిపోయాయని ఆయన తెలిపారు. ‘గతంలో ఎన్‌పీఏలను ఎలా దాచిపెట్టేవారో మీకు తెలుసు.
గత ప్రభుత్వాలు చేసిన పనులను మేం పూర్తి నిజాయితీతో దేశ ప్రజల ముందు ఉంచాము. సమస్యలను గుర్తించినప్పుడే వాటికి పరిష్కార మార్గాలను కనుగొనగలము. వ్యవస్థలో పారదర్శకత తెచ్చిన తర్వాత ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి‘ అని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
డేటా కీలకం..
గతంలో సమాచారాన్ని కథల రూపంలో చెప్పేవారని, చరిత్రను కూడా కథల రూపంలోనే రాశారని మోదీ చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయని, సమాచారం అంటే డేటాయేనని ఆయన పేర్కొన్నారు. ‘21వ శతాబ్దంలో సమాచారం అంటే డేటా. భావి తరాల్లో మన చరిత్రను డేటా ద్వారానే చూస్తారు. దాని కోణంలోనే అర్థం చేసుకుంటారు. భవిష్యత్తులో చరిత్రను డేటానే నిర్దేశిస్తుంది‘ అని మోదీ తెలిపారు. కాగ్ అడిగే డేటా, ఫైళ్లను ప్రభుత్వ విభాగాలు విధిగా అందజేయాలని ఆయన సూచించారు.
క్షేత్ర స్థాయి ఆడిట్‌లు నిర్వహించడానికి ముందు ప్రాథమికంగా బైటపడిన అంశాల గురించి ఆయా ప్రభుత్వ విభాగాలకు తెలియజేసేలా కాగ్ కొత్త విధానాన్ని అమల్లోకి తేవడం మెరుగైన ఫలితాలు ఇవ్వగలదని మోదీ చెప్పారు. మరోవైపు, తొలి ఆడిటర్ జనరల్ 1860 నవంబర్ 16న బాధ్యతలు చేపట్టారని, అందుకే ఆ రోజును ఆడిట్ దివస్‌గా నిర్వహించాలని భావించినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము తెలిపారు. కొత్త ఆడిట్ ప్రక్రియ మేనేజ్‌మెంట్ అప్లికేషన్‌ను కాగ్ అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment