నియామకం
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్‌గా ఏజే జైన్ నియమితులయ్యారు.
భారత్ రేటింగ్ యథాతథం
అమెరికాలో వడ్డీ రేట్ల పెరుగుదల, డాలర్ బలపడటం, కమోడిటీల రేట్లు తగ్గడం తదితర పరిణామాలతో ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాల వృద్ధి ఒక మోస్తరుగానే ఉన్నా.. భారత అధిక వృద్ధి మాత్రం కొనసాగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్‌కి ప్రస్తుతం స్థిరమైన అవుట్‌లుక్‌తో ఇచ్చిన బీబీబీ మైనస్ రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఇది పెట్టుబడులకు అత్యంత కనిష్ట స్థాయిని సూచిస్తుంది.
టీమ్‌లీజ్ ఐపీఓకు సెబీ ఆమోదం
వివిధ కంపెనీలకు అవసరమయ్యే ఉద్యోగులను అందించే సంస్థ టీమ్‌లీజ్ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓ ద్వారా టీమ్‌లీజ్ సంస్థ రూ.450-500 కోట్ల వరకూ సమీకరిస్తుందని అంచనా.
ద్రవ్యోల్బణం పైపైకి..
పప్పులు, పండ్లు, కూరగాయలు తదితర ఆహార పదార్ధాల ధరలు ఎగియడంతో నవంబర్‌లో రిటైల్, టోకు రేట్ల ఆధారిత ద్రవ్యోల్బణాలు పెరిగాయి. అక్టోబర్‌లో 5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం రేటు గత నెలలో 5.41 శాతం మేర పెరిగింది. ఇది 14 నెలల గరిష్టం.
ఆర్థిక అక్షరాస్యతలో అట్టడుగున
దాదాపు 76 శాతం మంది భారతీయులకు ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు వంటి కీలకమైన ఆర్థిక అంశాలపై అవగాహన లేదని రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ పేర్కొంది. వయోజనుల్లో ఆర్థిక అక్షరాస్యత అత్యధిక శాతం ఉన్న దేశాల్లో సింగపూర్ (59%) అగ్రస్థానంలో ఉండగా, హాంకాంగ్.. జపాన్‌లు (రెండూ 43 శాతం), తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
అదానీ ఆస్ట్రేలియా ప్రాజెక్ట్‌కు ఊరట
భారత మైనింగ్ దిగ్గజం అదానీ గ్రూప్‌కు ఊరటనిచ్చే నిర్ణయాన్ని ఆస్ట్రేలియా కోర్టు తీసుకుంది. అదానీ గ్రూప్ ఆస్ట్రేలియాలో చేపట్టిన 1,650 కోట్ల డాలర్ల ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఒక పర్యావరణ సంస్థ దాఖలు చేసిన కేసును ఆస్ట్రేలియా కోర్ట్ కొట్టివేసింది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కొన్ని షరతులతో అదానీ గ్రూప్‌కు మైనింగ్ లీజులను మంజూరు చేయాలని పేర్కొంది.
పెరుగుతున్న మహిళా సంపన్నులు
మహిళా బిలియనీర్ల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. వీరి సంఖ్య 20 ఏళ్లలో ఏడు రెట్లు పెరిగిందని యూబీఎస్-పీడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆసియాలోనే మహిళా సంపన్నుల సంఖ్య వేగంగా వృద్ధి సాధిస్తోందని తెలిపింది. అలాగే ఆసియాలో పురుష సంపన్నుల కంటే మహిళ సంపన్నుల సంఖ్య వేగంగా పెరుగుతోందని వెల్లడించింది. గత 20 ఏళ్లలో పురుష సంపన్నుల సంఖ్య 5 రెట్లు పెరగ్గా, మహిళ సంపన్నుల సంఖ్య 7 రెట్లు పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది.
కార్పొరేట్ లిటిగేషన్ కేసులు ఏపీలో అధికం
దాదాపు 685 కార్పొరేట్ లిటిగేషన్ పెండింగ్ కేసులతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటే, దీని తర్వాతి స్థానంలో గుజరాత్ (545), పశ్చిమ బెంగాల్ (441) ఉన్నాయి. ఇక దేశంలో దాదాపు 3,507 కార్పొరేట్ లిటిగేషన్ కేసులు కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి. కంపెనీ లా బోర్డు (సీఎల్‌బీ), బోర్డు ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ (బీఐఎఫ్‌ఆర్), అఫిషియల్ లిక్విడేటార్ సంబంధిత కేసులతో సహా కోర్టులలో 3,507 కార్పొరేట్ లిటిగేషన్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.
బిల్లు రూ.50,000 దాటితే పాన్ తప్పనిసరి
నల్లధనం చలామణీని కట్టడి చేసే దిశగా కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది. హోటల్ బిల్లులు, విదేశీ ప్రయాణ టికెట్లు మొదలైన వాటి కి రూ. 50,000కు మించి నగదు రూపంలో జరిపే చెల్లింపులకు పాన్ తప్పనిసరి చేసింది. లగ్జరీయేతర సంబంధిత నగదు లావాదేవీలు రూ. 2 లక్షలు దాటితేనే పాన్ నంబరు తప్పక ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇక చిన్న ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చేలా రూ. 50,000 పైచిలుకు పోస్టాఫీస్ డిపాజిట్లకు పాన్ తప్పనిసరి నిబంధనను కేంద్రం తొలగించింది.
జోరుగా ముందస్తు పన్ను వసూళ్లు
ముందస్తు పన్ను వసూళ్లు డిసెంబర్ క్వార్టర్లో జోరుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని 45 కంపెనీల నుంచి అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు ముందస్తు పన్ను వసూళ్లు 12 శాతం వృద్ధితో రూ.24,279 కోట్లకు చేరాయని ఆదాయపు పన్ను అధికారులు వెల్లడించారు.
పన్నెండో నెలా.. ఎగుమతులు డీలా..
అంతర్జాతీయంగా మందగమనం, క్రూడాయిల్ ధరల పతనం తదితర పరిణామాల నేపథ్యంలో వరుసగా పన్నెండో నెలా ఎగుమతులు క్షీణించాయి. నవంబర్‌లో పావు వంతు పడిపోయి 20.01 బిలియన్ డాలర్లకు తగ్గాయి. మరోవైపు. గతేడాది నవంబర్‌లో దిగుమతుల విలువ 42.72 బిలియన్ డాలర్లు కాగా తాజాగా గత నెలలో ఇవి 30 శాతం క్షీణించి 29.79 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
రిలయన్స్‌పై తాజా విచారణకు శాట్ ఆదేశం
రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ విధించిన రూ.13 కోట్ల జరిమానాను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యూనల్(శాట్) రద్దు చేసింది. ఈ అంశంపై తాజాగా విచారణ జరిపించాలని సెబీని శాట్ ఆదేశించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిస్టింగ్ నిబంధనలను ఉల్లంఘించిందంటూ సెబీ గత ఏడాది ఆ కంపెనీపై రూ.13 కోట్ల జరిమానాను విధించింది.
హెదరాబాద్‌లో గూగుల్ క్యాంపస్...
భారత్‌లో గూగుల్ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా హైదరాబాద్‌లో భారీ స్థాయిలో మరో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ముఖ్యంగా ఇంజినీరింగ్, బిజినెస్ డెవలప్‌మెంట్ రంగాల్లో పెట్టుబడులు పెడతామని చెప్పారు. వచ్చే ఏడాది(2016) చివరినాటికి దేశవ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నామని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజలకు ఇంటర్నెట్‌ను చౌకగా అందించేందుకు గూగుల్ తలపెట్టిన ‘ప్రాజెక్ట్ లూన్’ను భారత్‌లోనూ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
ఎన్‌ఎస్‌ఈ గ్రూప్ ఇండెక్స్‌లు
ఎన్‌ఎస్‌ఈకి చెందిన ఇండియా ఇండెక్స్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్(ఐఐఎస్‌ఎల్) సంస్థ మూడు గ్రూప్ ఇండెక్స్‌లను ప్రారంభించింది. భారత్‌లో దిగ్గజ గ్రూప్‌లు అయిన టాటా, ఆదిత్య బిర్లా, మహీంద్రా గ్రూప్ కంపెనీల పనితీరును ట్రాక్ చేయడానికి ఈ మూడు గ్రూప్ సూచీలను అందుబాటులోకి తెస్తున్నామని ఐఐఎస్‌ఎల్ పేర్కొంది. నిఫ్టీ టాటా గ్రూప్ ఇండెక్స్, నిఫ్టీ ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండెక్స్, నిఫ్టీ మహీంద్రా గ్రూప్ ఇండెక్స్‌లను పూర్తి మార్కెట్ క్యాపిటలైజేషన్ విధానం ఆధారంగా రూపొందించామని పేర్కొంది.
ఫెడ్ రేటు పావు శాతం పెంపు
అంతా ఊహించినట్లే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత పెంచింది. ఫెడ్ ఫండ్స్ రేటును పావు శాతం మేర పెంచుతున్నట్లు బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటించింది. దీంతో వడ్డీ రేట్లు 0.25 - 0.50 శాతం శ్రేణికి పెరిగినట్లయింది. 2006 జూన్ తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇదే ప్రథమం.
డీల్స్..
* పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్... ఇటలీకి చెందిన ఆటోమోటివ్ డిజైనింగ్ సంస్థ పినిన్‌ఫారినాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ 50 మిలియన్ యూరోల పైగా (సుమారు రూ. 370 కోట్లు) ఉండనుంది.
* హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటిగ్రేటెడ్ క్లీన్‌రూమ్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లో ( ఐక్లీన్) 26 శాతం వాటాను జపాన్‌కు చెందిన టకసాగో థర్మల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (టీటీఈ) కొనుగోలు చేసింది.
* రైల్వే ప్రయాణికులు ఈ-కేటరింగ్ ద్వారా ఆర్డర్ చేసిన ఆహార పదార్ధాలకు ఇక నుంచి పేటీఎం ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఈ మేరకు పేటీఎంతో రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
గతవారం బిజినెస్
Published Mon, Dec 21 2015 3:22 AM | Last Updated on Sun, Sep 3 2017 2:18 PM
Advertisement