నూతన విధానమే ఎంపిక | 66Percent taxpayers opted for new ITR filing in current season says CBDT Chairman Ravi Agrawal | Sakshi
Sakshi News home page

నూతన విధానమే ఎంపిక

Published Thu, Jul 25 2024 4:41 AM | Last Updated on Thu, Jul 25 2024 8:52 AM

66Percent taxpayers opted for new ITR filing in current season says CBDT Chairman Ravi Agrawal

పన్ను విధానాలను సులభతరం చేస్తాం 

సీబీడీటీ చైర్మన్‌ రవి అగర్వాల్‌ 

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయగా, 66 శాతం మంది నూతన విధానాన్ని ఎంపిక చేసుకున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్‌ రవి అగర్వాల్‌ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది నూతన విధానాన్నే ఎంపిక చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పన్నుల ప్రక్రియను సులభతరం చేయడంపై ప్రభుత్వం, సీబీడీటీ దృష్టి సారించినట్టు చెప్పారు. 

ఎంత సులభంగా పన్ను విధానం మారితే, అంత ఎక్కువ మంది పన్ను నిబంధనలు పాటించేందుకు ముందుకు వస్తార న్నది ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ఇందుకు నిదర్శనం గతేడాది ఇదే సమయానికి దాఖలైన రిటర్నులతో పోలిస్తే, ఈ ఏడాది మరింత పెరిగినట్టు చెప్పారు. గతేడాది జూలై 25 నాటికి 4 కోట్ల రిటర్నులు దాఖ లు కాగా, ఈ ఏడాది జూలై 22కే దీన్ని అధిగమించినట్టు తెలిపారు. గతేడాది జూలై 31 నాటికి మొత్తం 7.5 కోట్ల రిటర్నులు నమోదైనట్టు వెల్లడించారు.  

పాత పన్ను విధానం రద్దు ఎప్పుడు? 
మెజారిటీ పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్నే ఎంపిక చేసుకున్నందున పాత విధానాన్ని ఎప్పుడు రద్దు చేస్తారంటూ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు రవి అగర్వాల్‌ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ఇది మార్పు దశలో ఉంది. పన్ను చెల్లింపుదారుల నుంచి ఏ విధానానికి మెరుగైన ఆమోదం లభిస్తుందో చూసిన తర్వాత దీనిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటాం’’అని చెప్పారు.  

ఇండెక్సేషన్‌ తొలగింపు రియలీ్టకి మంచిదే
రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలకు ఇండెక్సేషన్‌ ప్రయోజనాలను తొలగించడమనేది మంచిదేనని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్‌ రవి అగ్రవాల్‌ తెలిపారు. కేవలం లెక్కల కోణంలో చూడకుండా వాస్తవ మార్కెట్‌ పరిస్థితులను బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. గత పదేళ్లుగా పెరిగిన రియల్టీ ధరలు, ఇండెక్సేషన్‌ సంబంధ ప్రయోజనాలను పరిశీలిస్తే సరళతరమైన కొత్త విధానంలో పన్నులపరమైన బాదరబందీ తక్కువగా ఉంటుందని అగ్రవాల్‌ చెప్పారు. 

తాజా బడ్జెట్‌లో రియల్టీ రంగంలో ఇండెక్సేషన్‌ ప్రయోజనాలను తొలగిస్తూ దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టీసీజీ) పన్నులను 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రాపర్టీ కొనుగోలు విలువను ఏటా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెంచుకుంటూ, అంతిమంగా విక్రయించినప్పుడు వచ్చే లాభాలపై పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఇండెక్సేషన్‌ ఉపయోగపడుతోంది. కొత్త మార్పులతో గృహాలను విక్రయించినప్పుడు వచ్చే రాబడిపై పన్ను భారం పెరిగిపోతుందనే ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రవి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.      

అంతరాయాల్లేకుండా చర్యలు
ఇన్ఫోసిస్, ఐబీఎం, హిటాచీ సంస్థలతో కలసి ఐటీ పోర్టల్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రవి అగర్వాల్‌ తెలిపారు. వెబ్‌సైట్‌ చక్కగా పనిచేస్తుందన్న భరోసా ఇచ్చారు. బడ్జెట్‌ రోజునే (23న) 22 లక్షల రిటర్నులు దాఖలైనట్టు తెలిపారు. పన్ను వివాదాల పరిష్కారానికి సంబంధించి బడ్జెట్‌లో ప్రకటించిన ‘వివాద్‌ సే విశ్వాస్‌’ పథకం డిసెంబర్‌ 31 నుంచి అమల్లోకి రావచ్చని రవి అగర్వాల్‌ ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement