గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Mar 14 2016 2:15 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

Last week Business

రూ.17 వేల కోట్లతో విశాఖ రిఫైనరీ విస్తరణ
విశాఖపట్టణంలోని రిఫైనరీ విస్తరణ కోసం 2020 కల్లా రూ.17,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని హెచ్‌పీసీఎల్ పేర్కొంది. విశాఖ రిఫైనరీ వార్షిక ఉత్పాదక సామర్థ్యాన్ని 8.3 మిలియన్ టన్నుల నుంచి 15  మిలియన్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా తెలంగాణలోని కరీంనగర్‌లో కొత్తగాఎల్‌పీజీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది. రిఫైనరీల విస్తరణ, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు, ఇతర అంశాల కోసం 2020 కల్లా మొత్తం రూ.45,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని వివరించింది.
 
మాల్యాకు ఈడీ సమన్లు
చడీ చప్పుడు లేకుండా దేశం విడిచిపోయిన మాల్యాపై.. ఐడీబీఐ బ్యాంకుకు రూ. 900 కోట్ల రుణాల ఎగవేత ఆరోపణలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) మనీ ల్యాండరింగ్ కేసు దాఖలు చేసి సమన్లు జారీ చేసింది. ఈ నెల 18న హాజరు కావాలంటూ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
‘ఐసీఐసీఐ’ మహిళా దినోత్సవం
ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్.. మహిళలు ఏడాదిపాటు ఇంటి వద్ద నుంచే పనిచేసే వె సులుబాటు కల్పిస్తూ ‘ఐవర్క్-హోమ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అలాగే మూడేళ్లలోపు పిల్లలను కలిగిన మహిళా ఉద్యోగులు పని నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్లాల్సి వస్తే వారు వారి పిల్లలను కూడా తమతోపాటు తీసుకెళ్లే వెసులుబాటు కల్పించింది.
 
భారత్‌లోకి శాంసంగ్ తాజా స్మార్ట్‌ఫోన్స్
దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్స్‌ను మంగళవారం భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 32 జీబీ, 64 జీబీ అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నాయి. ఇవి ఓపెన్ మార్కెట్‌లో మార్చి 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
 
దేశీయంగా హయబుసా అసెంబ్లింగ
సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తన ప్రీమియం బైక్ ‘హయబుసా’ అసెంబ్లింగ్‌ను హరియాణాలోని గుర్గావ్ ప్లాంటులో ప్రారంభించింది. దీంతో ఇప్పుడు బైక్ రూ.13.57 లక్షలకే వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దిగుమతుల కారణంగా బైక్ ధర ఇదివరకు రూ.15.95 లక్షలుగా ఉండేది. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీవి.
 
డీమ్యాట్ ఖాతాలు-2.5 కోట్లు
ఎన్‌ఎస్‌డీఎల్, సీడీఎస్‌ఎల్ డిపాజిటరీల్లోని మొత్తం ఇన్వెస్టర్ ఖాతాలు ఫిబ్రవరి నెల చివరి నాటికి 2.5 కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరి చివరికి మొత్తం ఇన్వెస్టర్ ఖాతాల సంఖ్య 2.33 కోట్లుగా ఉంది. గతనెల చివరి నాటికి ఎన్‌ఎస్‌డీఎల్ వద్ద 1.45 కోట్ల ఖాతాలు (గతేడాది ఖాతాలు 1.38 కోట్లు), సీడీఎస్‌ఎల్ వద్ద 1.06 కోట్ల ఖాతాలు (గతేడాది ఖాతాలు 95.2 లక్షలు) ఉన్నాయి.
 
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో ఐపీసీఎల్‌కు ఊరట
ఐపీసీఎల్(ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొ) కేసులో ముకేశ్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ పెట్రోఇన్వెస్ట్‌మెంట్స్(ఆర్‌పీఐఎల్)కు ఊరట లభించింది. 9 ఏళ్ల ఈ ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో ఆర్‌పీఐఎల్ ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలు ఉల్లంఘించిందనడానికి తగిన ఆధారాల్లేవంటూ  మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కేసును కొట్టివేసింది.  
 
వడ్డీ రేట్లు తగ్గించిన ఈసీబీ
యూరోజోన్ ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాటలో నడిపించడానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల వడ్డీ రేట్లనూ తగ్గించింది. తాను బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీరేటును (రిఫీ రేటు- రీఫైనాన్షింగ్ రేటు) ప్రస్తుత 0.05 శాతం నుంచి జీరో స్థాయికి తగ్గించింది. ఇక బ్యాంకులు తన వద్ద డిపాజిట్ చేసుకుంటే చెల్లించాల్సిన వడ్డీ రేటు (డిపాజిట్)ను కూడా మైనస్ - 0.3 శాతం నుంచి మైనస్ -0.4 శాతానికి తగ్గించింది.
 
చమురు, గ్యాస్ రంగంలో సంస్కరణలు
కఠిన ప్రాంతాల్లో అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయిన క్షేత్రాల్లో గ్యాస్ వెలికితీతను ప్రోత్సహించేలా కొన్ని పరిమితులతో కొత్త ధరల విధానానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే మైనింగ్ సంస్థలు మరిన్ని అసెట్స్‌ను సులువుగా విక్రయించుకునే వెసులుబాటు కల్పిస్తూ సంబంధిత చట్టాలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్‌లో నిర్వహించే చమురు, గ్యాస్ బ్లాకుల వేలానికి సంబంధించి వివాదాస్పదమైన ఉత్పత్తి పంపక ఒప్పందం (పీఎస్‌సీ)స్థానంలో ఆదాయ పంపక ఒప్పందాన్ని కూడా ఓకే చేసింది.
 
మన దగ్గరే కాల్ డ్రాప్స్ ఎక్కువ
కాల్ డ్రాప్స్ భారత్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. భారత్‌లో కాల్ డ్రాప్స్ సగటు రేటు 4.73 శాతంగా ఉంది. ఇది అంతర్జాతీయ స్టాండర్డ్ 3 శాతం కన్నా అధికం. రెడ్‌మ్యాంగో అనలిటిక్స్ ప్రకారం.. కవరేజ్ లోపాల వ ల్ల 4 శాతం కాల్ డ్రాప్స్ ఏర్పడుతుంటే.. నాణ్యత లేమి వల్ల 59.1 శాతం కాల్ డ్రాప్స్, నెట్‌వర్క్ సమస్యల వల్ల 36.9 శాతం కాల్‌డ్రాప్స్ ఉత్పన్నమౌతున్నాయి. కాల్ డ్రాప్‌కు ట్రాయ్ బెంచ్‌మార్క్ 2 శాతంగా ఉంది.
 
డివిడెండ్‌ల జోరు

తాజా బడ్జెట్‌లోని ప్రతిపాదిత రూ.10 లక్షలకు మించిన కంపెనీ డివిడెండ్‌లపై 10 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీటీటీ) వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తున్నందున.. ఆ పన్ను పోటును తప్పించుకోవడానికి కంపెనీలు ఇప్పటి నుంచే డివిడెండ్‌ల మీద డివిడెండ్‌లు ప్రకటిస్తున్నాయి. ఒక్క గురువారం రోజే 47 కంపెనీలు డివిడెండ్‌లు ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో మోటొకార్ప్, శ్రీ సిమెంట్, టొరంట్ తదితర కంపెనీలు ఉన్నాయి.  
 
ఈపీఎఫ్‌ఓ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్లకు నష్టం
ఈపీఎఫ్‌ఓ(ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్) పెట్టుబడులకు స్టాక్ మార్కెట్లో10 శాతం(రూ.565 కోట్లు) వరకూ నష్టాలు వచ్చాయి. గత ఏడాది ఆగస్టు నుంచి  ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్)ల్లో ఈపీఎఫ్‌ఓ రూ.5,920 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ విలువ గత నెల 29 నాటికి రూ  9.54 శాతం క్షీణించి రూ.5,355 కోట్లకు తగ్గింది.
 
రెండో నెలా కార్ల విక్రయాలు దిగువకే
కార్ల అమ్మకాలు 14 నెలల వరుస పెరుగుదల తర్వాత జనవరిలో తొలిసారి తగ్గితే.. అదే పరిస్థితి తర్వాతి నెలలోనూ కొనసాగింది. దేశీ కార్ల విక్రయాలు ఫిబ్రవరిలో 4.21 శాతంమేర క్షీణించాయి. బడ్జెట్ తర్వాత ధరల తగ్గుతాయనే అంచనాలతో కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం, జాట్ రిజర్వేషన్ల గొడవ, డీలర్లు కూడా బడ్జెట్‌లో ఎకై ్సజ్ సుంకం తగ్గింపు ఉంటుందని భావించి స్టాక్ పెంపునకు దూరంగా ఉండటం వంటి తదితర అంశాలు కార్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించాయని సియామ్ పేర్కొంది.
 
మూడవ నెలా పరిశ్రమల్లో నిరాశే!
పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2016 జనవరిలో 2015 ఇదే నెలతో పోల్చిచూస్తే అసలు వృద్ధి లేకపోగా 1.5 శాతం (మైనస్) క్షీణించింది. ఇలాంటి ధోరణి ఇది వరుసగా మూడవ నెల. ఈ సూచీ నవంబర్‌లో - 3.4 శాతం, డిసెంబర్‌లో - 1.2 శాతం క్షీణించింది. తయారీ రంగం పేలవ పనితీరు, డిమాండ్‌కు ప్రతిబింబమైన భారీ పరికరాల ఉత్పత్తుల క్యాపిటల్ గూడ్స్ విభాగం మందగమన ధోరణి తాజా నిరుత్సాహ ఫలితానికి కారణమని కేంద్ర గణాంకాల కార్యాలయం పేర్కొంది.  2015 జనవరిలో ఐఐపీ వృద్ధి రేటు 2.8 శాతం.
 
ఎకోస్పోర్ట్ ధర తగ్గించిన ఫోర్డ్
ప్రముఖ వాహన తయారీ కంపెనీ ఫోర్డ్ ఇండియా తాజాగా ‘ఎకోస్పోర్ట్’ ధరను రూ.1.12 లక్షల వరకు తగ్గించింది. ధరల తగ్గింపు నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఎకోస్పోర్ట్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.53,000- రూ.87,000 శ్రేణిలోనూ, డీజిల్ వేరియంట్ ధర రూ.1.12 లక్షలమేర తగ్గింది. దీంతో ఇప్పటి నుంచి పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.68 లక్షలుగా, డీజిల్ వేరియంట్  ప్రారంభ ధర రూ.7.28 లక్షలుగా ఉండనున్నది. ధరలన్నీ ఎక్స్ షోరూమ్ ఢిల్లీవి.
 
25 డాలర్లకు తగ్గనున్న చమురు!
అంతర్జాతీయంగా ముడిచమురు, గ్యాస్ ధరలు పలు సంవత్సరాలపాటు ప్రస్తుత కనిష్ట స్థాయిల్లోనే కొనసాగవచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తెలిపింది. ఇతర ప్రాంతాల నుంచి సరఫరా తగ్గినా.. ఒకవేళ ఇరాన్ నుంచి ఉత్పత్తి మెరుగ్గా ఉంటే బ్యారెల్ ధర 25 డాలర్లకు కూడా పతనం కావొచ్చని వివరించింది. 2014 జూన్‌లో చమురు ధరల పతనం ప్రారంభమై ఇటీవలే దశాబ్దపు కనిష్ట స్థాయికి పడిపోయింది. 2016లో చమురు ధరలు బ్యారెల్‌కు 33 డాలర్ల స్థాయిలోనే ఉండొచ్చని, వచ్చే ఏడాది 38 డాలర్లకు, అటుపైన 2018లో 43 డాలర్లకు చేరొచ్చని అంచనా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement