16 పీఎస్‌యూల్లో డిజిన్వెస్ట్‌మెంట్!
ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల్లో వాటా విక్రయాల(డిజిన్వెస్ట్‌మెంట్)కు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం 16 కంపెనీల జాబితాను రూపొందించింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో వీటి షేర్ల విలువ ఆధారంగా ఈ వాటా అమ్మకాల ద్వారా రూ. 40 వేల కోట్లు వస్తుందని అంచనా. లిస్టులో ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా, ఎన్‌ఎండీసీ, ఎంఓఐఎల్, ఎంఎంటీసీ, నేషనల్ ఫెర్టిలైజర్స్, ఎన్‌హెచ్‌పీసీ, నాల్కో, భారత్ ఎలక్ట్రానిక్స్ తదితర కంపెనీలు ఉన్నట్లు సమాచారం.
రెపో రేటు తగ్గించిన ఆర్‌బీఐ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2016-17)లో చేపట్టిన తొలి ద్రవ్య, పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ).. కీలకమైన పాలసీ వడ్డీరేటు రెపోను పావు శాతం తగ్గించి 6.5 శాతానికి చేర్చింది. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)ని యథాతథంగా 4 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు(ఎంసీఎల్‌ఆర్) వ్యవస్థను ఆర్‌బీఐ ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో తాజా రెపో కోత ప్రయోజనాన్ని బ్యాంకులు తప్పనిసరిగా రుణ గ్రహీతలకు బదలాయించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఫైజర్-అలెర్గాన్ డీల్ రద్దు!
ఇరు కంపెనీల విలీనానికి సంబంధించి అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్- ఐర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న అలెర్గాన్ కుదుర్చుకున్న ఒప్పందం రద్దయింది. 160 బిలియన్ డాలర్ల విలువైన ఈ డీల్‌ను అంతర్జాతీయ ఫార్మా రంగంలో అతిపెద్ద డీల్‌గా పేర్కొనటం తెలిసిందే. ప్రధానంగా అమెరికాలోని పన్నుల్ని తప్పించుకోవటానికి ఫైజర్ తన కేంద్రాన్ని ఐర్లాండ్‌కు తరలించడానికి ఈ డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ ద్వారా పన్నుల రూపంలో ఏటా బిలియన్ డాలర్లకుపైగా మిగులుతాయని ఫైజర్ భావించింది. అయితే ఇలాంటి డీల్స్‌ను అడ్డుకునేలా ఒబామా యంత్రాంగం ఇన్వర్షన్స్ పేరిట కొత్త పన్ను నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.
ఐపీఓకు హిందూస్తాన్ ఏరోనాటిక్స్!
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) ఈ ఏడాది చివరికల్లా ఐపీఓకు రానున్నది. అంతేకాకుండా ఈ కంపెనీలో ప్రభుత్వానికున్న వాటాలో 10 శాతాన్ని విక్రయించనున్నది. ఈ సంస్థ ఇటీవలనే రూ.4,300 కోట్ల షేర్లను(ప్రభుత్వానికి చెందిన 25 శాతం వాటాను) బై బ్యాక్ చేసింది. షేర్ల బై బ్యాక్ వల్ల తమ బ్యాలెన్స్ షీట్ పటిష్టంగా తయారైందని, ప్రస్తుతం ఐపీఓ ముసాయిదా పత్రాలను రూపొందిస్తున్నామని కంపెనీ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఈ ఐపీఓ ముసాయిదా పత్రాలను సెప్టెంబర్‌కల్లా సెబీకి సమర్పిస్తామని, అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌లో ఐపీఓకు వస్తామని వివరించారు.
టాటా ‘టియాగో’ వచ్చేసింది
దేశీ వాహన దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ తాజాగా కొత్త హ్యాచ్‌బాక్ ‘టియాగో’ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.3.20 లక్షలు- రూ.5.54 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ న్యూఢిల్లీ) ఉంది. టియాగో ప్రధానంగా ఎక్స్‌బీ, ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎం, ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్ అనే ఐదు వేరియంట్లలో లభ్యంకానున్నది. ఇది 1.2 లీటర్ రెవొట్రాన్ పెట్రోల్, 1.05 లీటర్ రెవొటార్క్ డీజిల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులోకి ఉండనున్నది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 23.84 కిలోమీటర్లు, డీజిల్ వేరియంట్ లీటరుకు 27.28 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ తెలిపింది.
ముడి చమురు దిగుమతుల్లో స్వేచ్ఛ
భూగర్భ జల వనరుల్ని మదించటం నుంచి రిజర్వాయర్లు, వరద సమస్య దాకా అన్నిటికీ పరిష్కారంగా జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టుకు (ఎన్‌హెచ్‌పీ) కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.3,680 కోట్లు. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్... దీంతో పాటు పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. వీటిలో రైల్వేల్లో విదేశీ (స్వీడన్) సాంకేతిక సహకారం, ముడి చమురును కంపెనీలు స్వేచ్ఛగా దిగుమతి చేసుకోవటం, టెలికం టవర్ సంస్థ వినోమ్‌లో వాటా విక్రయం వంటి కీలకాంశాలున్నాయి.
భెల్ నష్టాలు రూ.877 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో భెల్‌కు రూ.877 కోట్ల నష్టాలు వచ్చాయి. కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ సమావేశంలో గత ఆర్థిక సంవత్సరపు తాత్కాలిక ఆర్థిక ఫలితాలను ఆమోదించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.30,947 కోట్లుగా ఉన్న టర్నోవర్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.26,702 కోట్లకు తగ్గిందని భెల్ పేర్కొంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,419 కోట్ల నికర లాభం (ఆడిటెడ్ ఫలితాలు) వచ్చిందని, 2015-16 ఆర్థిక సంవత్సరంలో మాత్రం రూ.877 కోట్లు(తాత్కాలిక అంచనాలు) నష్టాలు వచ్చాయని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.43,727 కోట్ల కొత్త ఆర్డర్లు వస్తే.. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో ఆర్డర్లు రూ.30,814 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది.
ఏపీ, తెలంగాణల్లో వసూళ్లు పెరిగాయ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో నిర్దేశిత పన్ను వసూళ్ల లక్ష్యాలను అధిగమించినట్లు ఆదాయపన్ను శాఖ తెలిపింది. 2015-16 సంవత్సరంలో రూ.36,251 కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకోగా... దానికన్నా అధికంగా రూ.36,663 కోట్లను వసూలు చేసినట్లు ఈ రెండు రాష్ట్రాల ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఇండ్ల సురేశ్ బాబు తెలిపారు. ఈ మొత్తంలో కార్పొరేట్ ట్యాక్స్ వాటా రూ. 21,382 కోట్లు కాగా, ఆదాయ పన్ను మొదలైనవి రూ.15,281 కోట్లు.
ఆస్తుల లెక్క.. మాల్యాకు సుప్రీం ఆదేశం
తన, తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఈ నెల 21లోపు వెల్లడించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. విజయ్ మాల్యాను ఆదేశించింది. దేశ, విదేశాల్లోని ఆస్తుల వివరాల న్నింటినీ తెలియజేయాలని స్పష్టం చేసింది. తన ముందు ఎప్పుడు హాజరవుతారో తెలియజేయాలని కూడా సుప్రీం పేర్కొ ంది. కేసు తదుపరి విచారణను 26వ తేదీకి వాయిదా వేసింది. ఇవ్వాల్సిన మొత్తంలో రూ.4,000 కోట్లు చెల్లించడానికి సిద్ధమని మాల్యా చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని బ్యాంకింగ్ గ్రూప్ విన్నవించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఒరాకిల్ స్టార్టప్ ఇంక్యుబేటర్లు
ఐటీ దిగ్గజం ఒరాకిల్ దేశవ్యాప్తంగా తొమ్మిది స్టార్టప్ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయనున్నది. హైదరాబాద్, విజయవాడలతో పాటు మరో ఆరు నగరాల్లో ఒరాకిల్ స్టార్టప్ క్లౌడ్ యాక్సిలిటరేర్ పేరుతో ఈ స్టార్టప్ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయనున్నామని సంస్థ తెలిపింది. వృద్ధిలోకి వస్తున్న ఎంటర్‌ప్రెన్యూర్లకు తగిన మార్గదర్శకత్వం అందించడం, అభివృద్ధి చెందుతున్న కంపెనీలకు ఉత్తమ టెక్నాలజీని అందించడం లక్ష్యాలుగా ఈ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది.
ఈక్విటాస్ ఐపీఓకు 17 రెట్లు సబ్‌స్క్రిప్షన్
చిన్న ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి లెసైన్సు కలిగిన ఈక్విటాస్ హోల్డింగ్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు భారీ స్పందన లభించింది. రూ. 2,200 కోట్ల సేకరణకు ఈక్విటీస్ జారీచేసిన ఈ ఐపీఓ చివరి రోజైన గురువారం నాటికి 17.21 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఈ ఆఫర్ ద్వారా రూ. 109-10 ప్రై స్‌బ్యాండ్‌తో 13.91 కోట్ల షేర్లను జారీచేస్తుండగా, 239 కోట్ల షేర్లకు రూ. 37,000 కోట్ల విలువైన బిడ్స్ రావడం విశేషం. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 1.31 రెట్లు ఓవర్‌సబ్ స్క్రయిబ్‌కాగా, సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో 14.92 రెట్లు అధికంగా బిడ్స్ వచ్చాయి.
నియామకాలు
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల సమాఖ్య నాస్కామ్ కొత్త చైర్మన్‌గా టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీ నియమితులయ్యారు.
* ఫోర్బ్స్ మార్షల్ సంస్థ కో-చైర్మన్ నౌషద్ ఫోర్బ్స్.. సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.
డీల్స్..
* దేశీ ఐటీ కంపెనీ ఎంఫసిస్‌ను అమెరికాకు చెందిన అసెట్ మేనేజ్‌మెంట్ దిగ్గజం బ్లాక్‌స్టోన్ చేజిక్కించుకోనుంది. ఈ డీల్ విలువ రూ.7,071 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఎంఫసిస్‌లో మెజారిటీ వాటాదారుగా ఉన్న హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రై జ్(హెచ్‌పీఈ) నుంచి 60.5 శాతం పూర్తి వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోమవారం బ్లాక్‌స్టోన్ ప్రకటించింది.
* చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ, టెక్నాలజీ దిగ్గజం షావోమి.. హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌లో 25 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.165 కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది.
* ఒక భారతీయ కంపెనీలో షావోమికి ఇదే తొలి ఇన్వెస్ట్‌మెంట్ కావడం గమనార్హం. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నాగార్జునా గ్రూప్‌నకు చెందిన నాగార్జునా ఆయిల్ కార్పొరేషన్ (ఎన్‌ఓసీఎల్)లో వాటా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
* ఎయిర్‌సెల్ కంపెనీకి 8 టెలికం సర్కిళ్లలో ఉన్న 4జీ స్పెక్ట్రమ్‌ను ఎయిర్‌టెల్ కంపెనీ రూ. 3,438 కోట్లకు కొనుగోలు చేయనున్నది.
గతవారం బిజినెస్
Published Mon, Apr 11 2016 1:21 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM
Advertisement
Advertisement