హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన లోన్ కాలపరిమితి కోసం తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)లో 5 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు తగ్గింపును ప్రకటించింది. జనవరి 7 నుండి అమలులోకి వచ్చిన సవరించిన రేట్లు ఇప్పుడు 9.15 శాతం నుంచి 9.45 శాతం మధ్య ఉంటాయి.
ఎంసీఎల్‌ఆర్ తగ్గింపు ద్వారా రుణగ్రహీతలకు వారి రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఫలితంగా ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానమైన వ్యక్తిగత, వ్యాపార రుణాల వంటి ఫ్లోటింగ్ రేటు రుణాలపై సమానమైన నెలవారీ వాయిదాలు (EMI) కూడా తగ్గుతాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజా ఎంసీఎల్‌ఆర్ రేట్లు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్‌ని 9.20 శాతం నుండి 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.15 శాతానికి సవరించింది. ఇక ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ రేట్లు ఎటువంటి మార్పు లేకుండా వరుసగా 9.20 శాతం, 9.30 శాతంగా ఉన్నాయి.
అదే విధంగా ఆరు నెలలు, ఏడాది, మూడు సంవత్సరాల ఎంసీఎల్‌ఆర్ రేట్లు ఒక్కొక్కటి 5 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గి 9.45 శాతంగా ఉన్నాయి. అయితే రెండు సంవత్సరాల ఎంసీఎల్‌ఆర్ 9.45 శాతం వద్ద యథాతథంగా ఉంది.
ఎంసీఎల్‌ఆర్ అంటే?
"ఎంసీఎల్‌ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణానికి ఆర్థిక సంస్థ విధించే కనీస వడ్డీ రేటు. ఇది రుణంపై వడ్డీ రేటు కనీస పరిమితిని నిర్ణయిస్తుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చెప్తే తప్ప తప్ప ఇందులో మార్పు ఉండదు" అని ఎంసీఎల్‌ఆర్ భావనను వివరిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
పీఎల్‌ఆర్ ఇలా..
ఎంసీఎల్‌ఆర్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (PLR) సంవత్సరానికి 17.95 శాతం ఉంది. ఇది 2024 సెప్టెంబర్ 9 నుండి అమలులోకి వచ్చింది. నిర్దిష్ట రుణాలకు వర్తించే బేస్ రేటును అదే తేదీ నాటికి 9.45 శాతంగా నిర్ణయించారు.
ఈబీఎల్‌ఆర్
గృహ రుణాల కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (EBLR)ని అనుసరిస్తుంది. ఇది పాలసీ రెపో రేటుతో అనుసంధానమై ఉంటుంది. ప్రస్తుత రెపో రేటు 6.50 శాతంగా ఉంది. ఇక అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్స్ (ARHL) వడ్డీ రేట్లు లోన్ వ్యవధిలో మారుతూ ఉంటాయి.
హోమ్ లోన్ రేట్లు
ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే రుణగ్రహీతలు తీసుకునే ప్రత్యేక గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8.75 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉంటాయి. రెపో రేటుతో పాటు 2.25 శాతం నుండి 3.15 శాతం అదనపు మార్జిన్ ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. ఇక ఇదే కేటగిరీకి చెందిన రుణగ్రహీతలకు ప్రామాణిక గృహ రుణ రేట్లు 9.40 శాతం నుండి 9.95 శాతం వరకు ఉంటాయి. వీటిలో రెపో రేటుతో పాటు 2.90 శాతం నుండి 3.45 శాతం మార్జిన్ కలిసి ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment