
దేశంలోని రుణగ్రహీతలకు శుభవార్త. అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) తన ఎంసీఎల్ఆర్ (వడ్డీ రేటు)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. సవరించిన తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 9.10 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉంటుంది. సవరించిన రేట్లు ఏప్రిల్ 7 నుంచి వర్తిస్తాయి.
ఎంసీఎల్ఆర్.. దాని ప్రభావం
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ లేదా ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణం కోసం బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు వసూలు చేయాల్సిన కనీస వడ్డీ రేటు. ఇది రుణానికి వడ్డీ రేటు తక్కువ పరిమితిని నిర్దేశిస్తుంది. ఆర్బీఐ 2016లో ఎంసీఎల్ఆర్‌ను ప్రవేశపెట్టింది.
గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలతో సహా వివిధ ఫ్లోటింగ్-రేట్ రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఉపయోగించే బెంచ్‌మార్క్ రేటును ఎంసీఎల్ఆర్ అంటారు. ఈ ఎంసీఎల్ఆర్ తగ్గడం వల్ల రుణ ఈఎంఐలు లేదా రుణ కాలపరిమితి తగ్గుతుంది. ఇది దీర్ఘకాలికంగా రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే ఈ ప్రయోజనం పరిధి, సమయం రుణ ఒప్పందంలో పేర్కొన్న రీసెట్ క్లాజ్‌పై ఆధారపడి ఉంటుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణ రేట్లు
ఓవర్నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ కాలపరిమితిని 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.20 శాతం నుంచి 9.10 శాతానికి తగ్గించింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్‌ను 9.30 శాతం నుంచి 9.20 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్‌ను 9.40 శాతం నుంచి 9.30 శాతానికి తగ్గించింది. ఏడాది, రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రేటును 9.40 శాతం నుంచి 9.30 శాతానికి తగ్గించింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ను 9.45 శాతం నుంచి 9.35 శాతానికి తగ్గించింది.