![Equity fund inflows stay strong at Rs 39,688 crore in Jan](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/EQUITY-MUTUAL-FUNDS.jpg.webp?itok=Az9XKYeE)
సిప్ రూపంలో రూ.26,400 కోట్లు
డెట్ ఫండ్స్‌లోకి రూ.1.28 లక్షల కోట్లు
జనవరి గణాంకాలు విడుదల చేసిన యాంఫి
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలతో కొన్ని నెలలుగా ఈక్విటీలు బేలచూపులు చూస్తుంటే.. దేశీ రిటైల్ ఇన్వెస్టర్లు ‘తగ్గేదేలే’ అంటూ కొత్త పెట్టుబడులతో పరిణతి చూపుతున్నారు. ఇన్వెస్టర్ల క్రమశిక్షణకు నిదర్శనంగా ‘సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్’ (సిప్) రూపంలో జనవరిలోనూ ఈక్విటీ పథకాల్లోకి రూ.26,400 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు డిసెంబర్ నెలలో వచ్చిన రూ.26,459 కోట్లతో పోలి్చతే కేవలం రూ.59 కోట్లే తగ్గాయి. ఇక జనవరి నెలలో అన్ని రకాల ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.39,688 కోట్లుగా ఉన్నాయి.
2024 డిసెంబర్ నెలలో వచ్చిన రూ.41,156 కోట్లతో పోల్చి చూస్తే 3.56% తగ్గినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) జనవరి నెల గణాంకాల ను తాజాగా విడుదల చేసింది. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఈక్విటీ పెట్టుబడుల విలువ డిసెంబర్‌తో చూస్తే 4% తగ్గి రూ.30.57 లక్షల కోట్లకు పరిమితమైంది. ఈక్విటీ, డెట్ ఇలా అన్ని రకాల నిర్వహణ ఆస్తుల విలువ జనవరి చివ రికి రూ.67.25 లక్షల కోట్లకు చేరింది. డిసెంబర్ చి వరికి ఈ విలువ రూ.66.93 లక్షల కోట్లుగా ఉంది.
దీర్ఘకాల దృక్పథం..
‘‘మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్నప్పటికీ సిప్ రూపంలో రూ.26,400 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అస్థిరతల్లోనూ పెట్టుబడులు కొనసాగించేందుకు, సంపద సృష్టికి కమ్రశిక్షణతో కూడిన దీర్ఘకాల విధానం అనుసరించే దిశగా ఇన్వెస్టర్లలో అవగాహనకు ఇక ముందూ మా ప్రయత్నాలు కొనసాగుతాయి’’అని యాంఫి సీఈవో వెంకట్ చలసాని తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం సిప్ ఆస్తుల విలువ రూ.13.12 లక్షల కోట్లుగా ఉంది.
మొత్తం ఈక్విటీ నిర్వహణ ఆస్తుల్లో సిప్‌కు సంబంధించే 40 శాతానికి పైగా ఉండడం గమనార్హం. జనవరిలో కొత్తగా 30.7 లక్షల ఫోలియోలు (ఒక పథకంలో పెట్టుబడికి గుర్తింపు సంఖ్య) నమోదయ్యాయని, మార్కెట్ దిద్దుబాటు నేపథ్యంలో పెట్టుబడుల అవకాశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. ఈక్విటీ నిర్వహణ ఆస్తుల విలువ 4 శాతం తగ్గడానికి మార్కెట్లలో ఆటుపోట్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూనియన్ బడ్జెట్ ముందు అప్రమత్తతను కారణాలుగా ఐటీఐ మ్యూచువల్ ఫండ్ సీఈవో జతిందర్ పాల్ సింగ్ పేర్కొన్నారు.
విభాగాల వారీగా..
→ సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.9,016 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. డిసెంబర్‌లో ఇదే విభాగంలోకి రూ.15,331 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం.
→ మిడ్‌క్యాప్ విభాగంలోకి రూ.5,148 కోట్లు వచ్చాయి. డిసెంబర్‌లో ఇదే విభాగం రూ.5,721 కోట్లను ఆకర్షించింది.
→ అస్థిరతలు కాస్త తక్కువగా ఉండే లార్జ్‌క్యాప్ విభాగంలోకి పెట్టుబడులు పెరిగాయి. డిసెంబర్‌లో రూ.2,010 కోట్లు రాగా, జనవరిలో రూ.3,063 కోట్లకు చేరాయి.
→ ఫ్లెక్సిక్యాప్ ఫండ్స్ సైతం అంత క్రితం నెలతో పోలి్చతే జనవరిలో 20 %అధికంగా రూ.5,697 కోట్లను ఆకర్షించాయి.
→ డెట్ ఫండ్స్‌లోకి నికరంగా రూ.1.28 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్‌లో ఈ విభాగం నుంచి రూ.1.27 కోట్లను ఉపసంహరించుకున్న ఇన్వెస్టర్లు జనవరిలో మళ్లీ అంతే మేర తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది.
→ గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) ఇటీవలి కాలంలో ఎన్నడూలేనంత గరిష్ట స్థాయిలో రూ.3,751 కోట్లను ఆకర్షించాయి. ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించినట్టు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment