ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు నవంబర్ నెలలో రూ.35,943 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అక్టోబర్ నెల పెట్టుబడులతో పోల్చి చూస్తే 14 శాతం తగ్గాయి. అయినప్పటికీ వరుసగా 45వ నెలలోనూ ఈక్విటీ ఫండ్స్‌లో సానుకూల పెట్టుబడులు నమోదయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) నవంబర్ నెల గణాంకాలను విడుదల చేసింది.
స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఎన్నికలు తదితర పరిణామాలతో ఈక్విటీ మార్కెట్లు గత రెండు నెలల కాలంలో ఎన్నో అస్థిరతలు ఎదుర్కోవడం తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అనుసరించి ఉండొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ సీబీవో అఖిల్ చతుర్వేది తెలిపారు. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి నవంబర్‌లో నికరంగా రూ.60,295 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో పెట్టుబడుల రాక రూ.2.4 లక్షల కోట్లతో పోల్చి చూస్తే గణనీయంగా తగ్గడం గమనార్హం. ప్రధానంగా డెట్ ఫండ్స్ అక్టోబర్‌లో రూ.1.57 లక్షల కోట్లను ఆకర్షించగా, నవంబర్‌లో ఇవి కేవలం రూ.12,915 కోట్లకు పరిమితమయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) అక్టోబర్ చివరికి ఉన్న రూ.67.25 లక్షల కోట్ల నుంచి నవంబర్ చివరికి రూ.68.08 లక్షల కోట్లకు పెరిగింది.
లక్ష్యాలకు కట్టుబాటు..
నెలవారీ సిప్ పెట్టుబడులు రూ.25,000 కోట్లకు పైనే ఉండడం అన్నది దీర్ఘకాల లక్ష్యాలు, ప్రణాళిక పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న అంకిత భావానికి నిదర్శనమని యాంఫి సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. సిప్ పెట్టుబడులను స్థిరంగా ఉండడం దీర్ఘకాలంలో ఫండ్స్ విలువను సమకూర్చుతాయన్న విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు.
విభాగాల వారీగా..
లార్జ్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,548 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో వచ్చిన రూ.3,452 కోట్లతో పోల్చితే 26 శాతం తగ్గాయి.
సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.7,658 కోట్లను రాబట్టాయి. అక్టోబర్‌లో ఇవే పథకాల్లోకి రూ.12,279 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.13,255 కోట్ల చొప్పున రావడం గమనార్హం.
ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి రూ.5,084 కోట్లు వచ్చాయి.
ఇక స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల దూకుడు కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ నెలతో పోల్చితే నవంబర్‌లో స్మాల్ క్యాప్ ఫండ్స్ 9 శాతం అధికంగా రూ.4,112 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్ 4.3 శాతం అధికంగా రూ.4,883 కోట్ల చొప్పున ఆకర్షించాయి. రిస్క్ ఉన్నా కానీ ఇన్వెస్టర్లు అధిక రాబడులు కోరుకుంటున్నారనే దానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తాయి.
లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.4,680 కోట్లు, వ్యాల్యూ ఫండ్స్ రూ.2,088 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ రూ.430 కోట్లు, ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్ రూ.619 కోట్ల చొప్పున ఆకర్షించాయి.
18 కొత్త పథకాలు (ఎన్‌ఎఫ్‌వోలు) నవంబర్ లో మార్కెట్లోకి వచ్చి రూ.4,052 కోట్లను సమీకరించాయి. అక్టోబర్లో 29ఎన్‌ఎఫ్‌వోలు రూ.6,078 కోట్లు సమీకరించడం గమనార్హం.
డెట్ విభాగంలో 16 విభాగాలకు గాను 9 విభాగాల్లోకి పెట్టుబడులు రాగా, మిగిలినవి పెట్టుబడులు కోల్పోయాయి.
ఓవర్‌నైట్ ఫండ్స్‌లోకి రూ.2,109 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోకి రూ.2,962 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్ రూ.4,374 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ.2,426 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌లోకి రూ.2,138 కోట్ల చొప్పున వచ్చాయి.
డెట్‌లో లిక్విడ్ ఫండ్స్ రూ.1,779 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.454 కోట్లు, మీడియం డ్యురేషన్ ఫండ్స్ రూ.201 కోట్ల చొప్పున కోల్పోయాయి.
ఇదీ చదవండి: ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు
సిప్ పెట్టుబడులు ఫ్లాట్
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో నవంబర్‌లో ఈక్విటీ పథకాల్లోకి రూ.25,320 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్ సిప్ పెట్టుబడులు రూ.25,323 కోట్లతో పోల్చి చూస్తే ఫ్లాట్‌గా నమోదయ్యాయి. కొత్తగా 49.46 లక్షల సిప్ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అక్టోబర్‌లో ఇవి 63.70 లక్షలుగా ఉన్నాయి. మొత్తం సిప్ ఖాతాలు 10.12 కోట్ల నుంచి 10.23 కోట్లకు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment