చట్టంలో పలు వెసులుబాట్లు
వీటిని అనుసరిస్తే పన్ను భారం పడదు
పన్ను తగ్గించుకునే మార్గాలూ ఉన్నాయ్
తద్వారా దీర్ఘకాలంలో అదనపు రాబడి
ఏడాదికి మించిన పెట్టుబడుల పైనే ప్రయోజనం
కొన్నేళ్ల క్రితం విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు మొదలు పెడితే మన ఈక్విటీలు బేల చూపు చూసేవి. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్మిన మేర ఇనిస్టిట్యూషన్స్, రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. మన దేశ ఈక్విటీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం గతంతో పోలి్చతే గణనీయంగా పెరిగిందని చెప్పడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు.
నేరుగా స్టాక్స్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాతి నుంచి ఈక్విటీ మార్కెట్ మంచి బుల్ ర్యాలీ చేయడం.. ఎంతో మంది ఇన్వెస్టర్లు అటు వైపు అడుగులు వేసేలా చేసింది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమానుగత పెట్టుబడుల (సిప్) ప్రాధాన్యాన్ని ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటున్నారు.
తమ భవిష్యత్ ఆరి్థక లక్ష్యాల్లో ఈక్విటీలకు చోటు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈక్విటీ రాబడులపై పన్ను బాధ్యతను ప్రతి ఇన్వెస్టర్ తప్పకుండా అర్థం చేసుకోవాలి. 2024–25 బడ్జెట్‌లో ఈక్విటీ లాభాలపై స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాల పన్నును కేంద్ర సర్కారు పెంచేసింది. ఈ భారం సాధ్యమైన మేర తగ్గించుకునేందుకు ఇన్వెస్టర్ల ముందు పలు మార్గాలున్నాయి. వాటి గురించి వివరించే కథనమే ఇది.
ఆదాయపన్ను చట్టంలో ఇటీవలి మార్పుల అనంతరం స్వల్పకాల లాభాలపై 20 శాతం, దీర్ఘకాల లాభాలపై 12.5 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన తేదీ నుంచి ఏడాది నిండకుండా విక్రయించిన స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై వచ్చే లాభం స్వల్పకాల మూలధన లాభం (ఎస్‌టీసీజీ) అవుతుంది. దీనిపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఏడాది పూర్తయిన అనంతరం విక్రయించినప్పుడు వచి్చన లాభం దీర్ఘకాల మూలధన లాభం (ఎల్‌టీసీజీ) కిందకు వస్తుంది. ఎల్‌టీసీజీ ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించకపోతే ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.1.25 లక్షలకు మించిన లాభంపై 12.5 శాతం ఎల్‌టీసీజీ చెల్లించాల్సి ఉంటుంది.
పన్ను తగ్గించుకునే మార్గాలు..
ఈక్విటీల్లో స్వల్పకాల మూలధన లాభాలపై (ఎస్‌టీసీజీ) 20 శాతం పన్ను చెల్లించాల్సిందే. పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి వెసులుబాట్లు లేవు. ఏడాదికి మించి పెట్టుబడులు కొనసాగించడం ద్వారానే మూలధన లాభాలపై పన్ను భారం లేకుండా చూసుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు మార్గాలున్నాయి.
ముఖ్యంగా ఈక్విటీలు మూడేళ్లు అంతకుమించిన కాలానికే అనుకూలం. మూడేళ్లలోపు పెట్టుబడులకు ఈక్విటీలు సూచనీయం కాదు. ఎందుకంటే స్వల్పకాలంలో ఈక్విటీలు స్థూల ఆరి్థక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విధాన నిర్ణయాలు తదితర ఎన్నో అంశాల ఆధారంగా అస్థిరతలకు లోనవుతూ ఉంటాయి.
మూడు నుంచి ఐదేళ్లు అంతకుమించిన కాలంలో ఈ అస్థిరతలను అధిగమించి స్టాక్స్ ర్యాలీ చేస్తుంటాయి. కనుక స్వల్పకాలంలో ఆటుపోట్లు ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు భరోసా ఉంటుంది. కనుక రిటైల్ ఇన్వెస్టర్లు తమ మధ్య, దీర్ఘకాల లక్ష్యాల కోసమే ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. తద్వారా అధిక రాబడులకు తోడు, ఆ మొత్తంపై పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి అవకాశాలుంటాయి.
ట్యాక్స్ హార్వెస్టింగ్
ఒక ఆరి్థక సంవత్సరంలో ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షల వరకు పన్ను లేదు కనుక, ఏటా తమ పెట్టుబడులపై ఈ మేరకు లాభాలను స్వీకరించడం ట్యాక్స్ హార్వెస్టింగ్ అవుతుంది. తిరిగి అంతే మొత్తాన్ని మళ్లీ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు 2023 సెపె్టంబర్ 1న స్టాక్స్ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో రూ.6 లక్షలు ఇన్వెస్ట్ చేశారు.
2024 సెపె్టంబర్ 1 నాటికి ఈ విలువ 12 శాతం రాబడి అంచనా ప్రకారం రూ.6,75,305 అవుతుంది. ఇందులో లాభం రూ.75,305. రూ.1.25లక్షల వరకు లాభం ఉన్నా పన్ను లేదు కనుక, ఈ మొత్తాన్ని విక్రయించి తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఎలాంటి పన్ను భారం పడదు. ఇలా ఏటా రూ.1.25లక్షల మేరకు దీర్ఘకాలిక మూలధన లాభాన్ని స్వీకరిస్తూ.. తిరిగి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం ఒక మార్గం.
ఇల్లు కొనడం..
ఈక్విటీ దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను లేకుండా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఎఫ్ మార్గం చూపిస్తోంది. ఈ సెక్షన్ కింద గరిష్ట ప్రయోజనం రూ.10 కోట్లు. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించినప్పుడు వచి్చన మొత్తం రూ.10 కోట్ల వరకు ఉంటే, దీనిపై భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు ఆ మొత్తంతో ఒక నివాస గృహం కొనుగోలు చేస్తే సరి.
ఇలా చేయడం వల్ల ఎలాంటి పన్ను లేకుండా సెక్షన్ 54ఎఫ్ కింద పూర్తి ప్రయోజనం పొందొచ్చు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలే (హెచ్‌యూఎఫ్) ఈ ప్రయోజనానికి అర్హులు. దీర్ఘకాలిక ఈక్విటీ పెట్టుబడులే అని కాదు, ప్లాట్, వాణిజ్య భవనం, బంగారం, ట్రేడ్ మార్క్‌లు, పేటెంట్లు, మెషినరీ సైతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ అస్సెట్ కిందకు వస్తాయి. వీటిపైనా ఇదే ప్రయోజనం పొందొచ్చు.
బాండ్లు
సెక్షన్ 80ఈసీ కింద ఈక్విటీ దీర్ఘకాల మూలధన లాభాలను క్యాపిటల్ గెయిన్స్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసినా పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. ఆర్‌ఈసీ, ఎన్‌హెచ్‌ఏఐ తదితర ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసే బాండ్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వీటిలో పెట్టుబడులపై రాబడి 6 శాతం వరకు ఉంటుంది. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించిన తేదీ నుంచి ఆరు నెలలు దాటకుండా ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తేనే ప్రయోజనం లభిస్తుంది.
గరిష్టంగా రూ.50 లక్షల పెట్టుబడులకే ఈ ప్రయోజనం పరిమితం. ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించినప్పుడు వచ్చిన మొత్తం రూ.50 లక్షలకు మించి ఉంటే, అదనపు మొత్తంపై నిబంధనల మేరకు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఐదేళ్లలోపు వాటిని విక్రయిస్తే.. గతంలో పొందిన పన్ను ప్రయోజనం కోల్పోతారు. అంటే ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు ఈ బాండ్లపై ఐదేళ్లలోపు రుణం పొందినా ఈ ప్రయోజనం కోల్పోతారు.
షరతులు ఉన్నాయ్...
దీర్ఘకాల ఈక్విటీ మూలధన లాభాలపై సెక్షన్ 54ఎఫ్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించే తేదీకి ఏడాది ముందు కాలంలో లేదా విక్రయించిన తేదీ నుంచి తర్వాతి రెండేళ్లలోపు నివాస అవసరాలకు వినియోగించే ఇల్లు (పాతది లేదా కొత్తది) కొనుగోలు చేయాలి. ఇల్లు నిరి్మంచుకునేట్టు అయితే దీర్ఘకాల క్యాపిటల్ అసెట్స్ విక్రయించిన నాటి నుంచి మూడేళ్ల వరకు వ్యవధి ఉంటుంది.
మూలధన లాభాలే కాకుండా, విక్రయించినప్పుడు వచ్చిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కొంత మొత్తంతోనే ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణంపై వెచి్చస్తే, అప్పుడు మిగిలిన మూలధన లాభాలపై నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఇంటి కొనుగోలుకే ఈ ప్రయోజనం పరిమితం. ఈక్విటీ ధీర్ఘకాల పెట్టుబడులు విక్రయించగా వచ్చిన మొత్తం రెండిళ్ల కొనుగోలుపై వెచ్చిస్తే.. ఒక ఇంటిపై చేసిన వ్యయాన్నే సెక్షన్54ఎఫ్ కింద పరిగణనలోకి తీసుకుంటారు.
సెక్షన్ 54ఎఫ్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే, ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించే నాటికి ఒక ఇంటిని మించి కలిగి ఉండకూడదు. రెండో ఇంటిని జాయింట్‌లో కలిగి ఉన్నా అర్హత కోల్పోయినట్టే. ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులను విక్రయించినప్పుడు పన్ను మినహాయింపు కోసం ఇంటిపై వెచ్చించాలని చెప్పుకున్నాం. అయితే, విక్రయించిన ఆర్థిక సంవత్సరం రిటర్నులు దాఖలు చేసే నాటికి ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణంపై వెచి్చంచడం సాధ్యపడలేదు అనుకుందాం.
అలాంటప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ కింద ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాత దీని నుంచి ఉపసంహరించుకుని నిబంధనలకు అనుగుణంగా నిరీ్ణత కాలం లోపు ఇంటి కోసం వెచి్చంచి, పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ నిరీ్ణత కాలంలోపు ఇంటి కొనుగోలు లేదా నిర్మాణంపై వెచి్చంచలేకపోయారని అనుకుందాం. అటువంటప్పుడు ఆ మొత్తాన్ని క్రితం ఆరి్థక సంవత్సరానికి సంబంధించి ఎల్‌టీసీజీగా చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
సరైన నిర్ణయమేనా?
మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లాభాలపై పన్ను తప్పించుకునేందుకు సెక్షన్ 54ఎఫ్‌ను వినియోగించుకుని ఇంటిపై ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా..? అంటే, అందరికీ కాకపోవచ్చన్నదే సమాధానం. పిల్లల ఉన్నత విద్య, వారి వివాహం, రిటైర్మెంట్ తదితర లక్ష్యాల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన వారు, పన్ను మినహాయింపు కోసం తీసుకెళ్లి ఇంటిపై వెచి్చంచడం సరైనది అనిపించుకోదు. కనుక ఈ విషయంలో ఇన్వెస్టర్లు అందరికీ ఒక్కటే సలహా నప్పదు. సొంతిల్లు సమకూర్చుకోవాలని కోరుకునే వారికి సెక్షన్ 54ఎఫ్ మంచి ఆప్షన్ అవుతుంది. అలాగే, పన్ను మినహాయింపు కోసం ఇంటిపై ఇన్వెస్ట్ చేసి వృద్ధాప్యంలో ఆ ఇంటిని రివర్స్ మార్ట్‌గేజ్ కోసం వినియోగించుకునే ఆలోచన ఉన్న వారికి కూడా 54ఎఫ్ ప్రయోజనం అనుకూలమే.
నష్టాలతో భర్తీ..
ఈక్విటీల్లో మూలధన లాభాలపై పన్ను తగ్గించుకునేందుకు.. మూలధన నష్టాలతో భర్తీ చేసుకోవడం మరో ఆప్షన్. ఏడాదికి మించని ఈక్విటీ పెట్టుబడులు విక్రయించగా వచ్చిన స్వల్పకాల మూలధన నష్టాన్ని.. తిరిగి స్వల్పకాల మూలధన లాభం లేదా దీర్ఘకాల మూలధన లాభంలో సర్దుబాటు చేసుకోవచ్చు. ఇలా సర్దుబాటు చేయగా మిగిలిన మొత్తంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇలా సర్దుబాటు చేసుకున్న తర్వాత కూడా నష్టం మిగిలి ఉంటే దాన్ని అప్పటి నుంచి తదుపరి ఎనిమిదేళ్లపాటు లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు. పన్ను రిటర్నులు దాఖలు చేయడం ద్వారానే ఇందుకు అవకాశం ఉంటుంది. కానీ, దీర్ఘకాల మూలధన నష్టాన్ని.. కేవలం దీర్ఘకాల మూలధన లాభంతోనే సర్దుబాటు చేసుకోగలరు.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment