
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల (Credit Card) వినియోగం పెరిగిపోయింది. చాలా మంది దగ్గర ఒకటికి మించి క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయి. వీటితో ఖర్చు చేసేటప్పుడు సులువుగా ఉన్నా వాటి బిల్లుల చెల్లింపులో చిక్కులు ఎదురవుతుంటాయి.
వేరువేరు గడువు తేదీలు, అధిక వడ్డీ రేట్లు, సంక్లిష్ట స్టేట్‌మెంట్, సాంకేతిక సమస్యల కారణంగా క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించడం సవాలుగా ఉంటుంది. ఈ తలనొప్పులేవీ లేకుండా ఎస్‌బీఐ (SBI) క్రెడిట్ కార్డు బిల్లులను యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లించే అవకాశం ఉందని మీకు తెలుసా?
దేశంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో యూపీఐ భారీ మార్పులను తీసుకువచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ ఇది. దీని ద్వారా వినియోగదారులు సెకన్లలో డబ్బు పంపవచ్చు. అలాగే స్వీకరించవచ్చు. యూపీఐ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలో ఏ యూపీఐ యాప్ (UPI App) ద్వారా అయినా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ బిల్లును సులువుగా చెల్లించవచ్చు.
నేడు మార్కెట్లో పేటీఎం, క్రెడ్, మొబిక్విక్, ఫోన్‌పే, అమెజాన్ పే వంటి అనేక ప్రసిద్ధ థర్డ్ పార్టీ మొబైల్ యాప్స్ ఉన్నాయి. వీటి ద్వారా క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించవచ్చు. అయితే, ఈ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు సెటిల్మెంట్‌లో జాప్యం జరగవచ్చు. మరోవైపు యూపీఐ ద్వారా చెల్లింపు చేసినప్పుడు అది వెంటనే మీ క్రెడిట్ కార్డు ఖాతాలో ప్రతిబింబిస్తుంది. యూపీఐ ద్వారా చేసిన చెల్లింపులు తక్షణమే ప్రాసెస్ అవుతాయి. మీ క్రెడిట్ కార్డ్ బిల్లు సకాలంలో చెల్లింపు అవుతుంది.
యూపీఐ యాప్ ద్వారా చెల్లించండిలా..
» మీ స్మార్ట్ ఫోన్ లో మీకు ఇష్టమైన యూపీఐ యాప్‌ను తెరవండి
» పేమెంట్ సెక్షన్‌కు వెళ్లి 'పే' లేదా 'సెండ్ మనీ' ఎంచుకోండి
» మీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుకు లింక్ చేసిన వర్చువల్ పేమెంట్ అడ్రస్ (వీపీఏ) ఎంటర్ చేయండి.
» మీ క్రెడిట్ కార్డ్ బిల్లు కోసం మీరు చెల్లించాలనుకుంటున్న మొత్తాన్ని పేర్కొనండి.
» వివరాలను సరిచూసుకుని పేమెంట్‌ను కన్ఫమ్ చేయండి.
» ఈ మొత్తం మీ బ్యాంక్ ఖాతా నుండి డెబిట్ అయి మీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఖాతాకు క్రెడిట్ అవుతుంది.
క్యూఆర్ కోడ్ ద్వారా అయితే ఇలా..
» మీ యూపీఐ యాప్‌ను తెరిచి 'స్కాన్ క్యూఆర్ కోడ్' ఆప్షన్ ఎంచుకోండి.
» క్రెడిట్ కార్డు చెల్లింపుల కోసం ఎస్‌బీఐ అందించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి.
» మీరు చెల్లించాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి.
» వివరాలను సరిచూసుకుని పేమెంట్‌ను కన్ఫమ్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment