
బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రత్యేక 400 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇందులో 7.30% వరకు వడ్డీ రేటు లభిస్తుంది. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వచ్చే వివిధ ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలపరిమితులపై బ్యాంక్ వడ్డీ రేట్లను విస్తృతంగా సర్దుబాటు చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
సవరించిన రేట్ల ప్రకారం 91 నుండి 179 రోజుల మధ్య మెచ్యూరిటీ డిపాజిట్లకు 4.25 శాతం, 180 రోజుల నుండి ఒక సంవత్సరం కంటే తక్కువ మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లకు 5.75 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక ఏడాది మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై 7.05 శాతం, ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీ అందిస్తుంది.
రూ .3 కోట్ల నుండి రూ .10 కోట్ల లోపు డిపాజిట్లకు సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.. 91 నుండి 179 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్‌లకు 5.75%, 180 నుండి 210 రోజులకు 6.25%, 211 రోజుల నుండి ఒక సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితికి 6.50%. ఏడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటు 7.05 శాతంగా, ఏడాది కంటే ఎక్కువ కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 6.70 శాతంగా ఉంది. ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ మెచ్యూరిటీ వ్యవధితో రూ .3 కోట్ల లోపు డిపాజిట్లపై సూపర్ సీనియర్ సిటిజన్లకు 0.65 శాతం, సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనపు వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తుంది.
మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా అమృత్ కలష్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద అందించే వడ్డీ రేటుకు సంబంధించిన వివరాలను ప్రకటనలో వెల్లడించలేదు. అయితే ఫిక్స్‌డ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్స్ కోరుకునే కస్టమర్లకు బ్యాంక్ ప్రత్యామ్నాయ మార్గాలను అందిస్తూనే ఉంది. దేశంలోని రెండు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ అధిక వడ్డీ పథకాలను ఉపసంహరించుకోవడం మారుతున్న మార్కెట్ పరిస్థితులు, నియంత్రణ మార్గదర్శకాలకు ప్రతిస్పందనగా వ్యూహాత్మక మార్పును సూచిస్తుంది