ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే రాబడులు ఏ రేంజ్‌లో వస్తాయి? –హిమబిందు, విజయవాడ
దీర్ఘకాలం పాటు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులే పొందవచ్చు. అయితే ఏ శాతం రేంజ్‌లో రాబడులు వస్తాయో అంచనా వేయడం కష్టం. మన ఇన్వెస్ట్‌మెంట్స్ మీద ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను పొందాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే మంచి మార్గం. గతంలో మన దేశంలో వడ్డీరేట్లు 9–13 శాతం రేంజ్‌లో ఉండేవి. అప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రాబడులు 18–20 శాతం రేంజ్‌లో ఉండేవి. ఇప్పుడు ఈ రాబడులు కనిష్టంగా 7–8 శాతానికి తగ్గాయి.
ఇప్పుడు ఇండెక్స్ ఫండ్ రాబడులు 8–9.50 శాతం రేంజ్‌లో ఉన్నాయి. ఫండ్ పోర్ట్‌ఫోలియో డైవర్సిఫైడ్‌గా ఉన్నప్పటికీ, ఈ ఫండ్ నిర్వహణ చాలా సులభం. దీంతో పోల్చితే ఈక్విటీ ఫండ్స్ నిర్వహణ కొంచెం క్లిష్టమైనది. కాబట్టి వీటికి వ్యయాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. వ్యయాలు ఎక్కువగా ఉన్నా, ఇండెక్స్ ఫండ్స్‌తో పోల్చితే ఈక్విటీ ఫండ్స్ అధిక రాబడులనే ఇస్తాయి. ద్రవ్యోల్బణం 4 శాతం రేంజ్‌లో ఉన్నప్పుడు ఈక్విటీ రాబడులు 12 శాతం మేర ఉంటాయని చెప్పవచ్చు. పిల్లల పై చదువులు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ అవసరాల కోసం నిధి ఏర్పాటు తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే మంచి మదుపు మార్గమని చెప్పవచ్చు.
నాకు ఇటీవలనే ఒక పాప పుట్టింది. ఆమెను డాక్టర్ చేయాలన్నది నా కల. ఇప్పటి నుంచి నెలకు రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేయగలను. ఈ మొత్తాన్ని స్మాల్‌క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ? లేకుంటే వేరే ఇతర ఫండ్స్‌లో మదుపు చేయమంటారా ? –ఆనంద్, కర్నూలు
మీరు తీసుకున్నది మంచి నిర్ణయమేనని చెప్పవచ్చు. మీరు 18–20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలరు. ఇంత దీర్ఘకాలం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే, కనీసం రెండు మూడేళ్లకొకసారైనా మీరు ఈ ఫండ్ పనితీరును మదింపు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు, లేదా మూడేళ్ల కాలంలో ఈ ఫండ్ పనితీరు ఎలా ఉంది ? ఫండ్ మేనేజర్ మారారా ?ఇతర ఫండ్స్ దీనికి మించిన రాబడులను ఇస్తున్నాయా?తదితర అంశాలను మీరు మదింపు చేయాల్సి ఉంటుంది. స్మాల్ క్యాప్ ఫండ్స్ విషయంలో అత్యంత కీలకమైనది ఫండ్ మేనేజర్ నిర్వహణ. స్మాల్ క్యాప్ ఫండ్స్ పనితీరు దాదాపు 80 శాతం ఫండ్ మేనేజర్ తీరుపైననే అధారపడి ఉంటుంది.
అదే లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో అయితే ఆ ఫండ్ పనితీరుపై ఫండ్ మేనేజర్ ప్రభావం 40 శాతమే ఉంటుంది. లార్జ్ క్యాప్ కంపెనీలు వందలోపే ఉంటాయి. ఈ ఫండ్ మేనేజర్ ఈ వంద కంపెనీలను గమనిస్తే సరిపోతుంది. కానీ స్మాల్ క్యాప్ కంపెనీలు వందలాదిగా ఉంటాయి. ఒక స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజర్ కనీసం 2,000 కంపెనీలను గమనించాల్సి ఉంటుంది. ఏతావాతా లార్జ్ క్యాప్ ఫండ్ మేనేజర్ కంటే స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజర్‌కు అధిక బాధ్యత ఉంటుంది. అందుకని స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ విషయాలన్నీ కూలంకషంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోండి.
నేను ఇటీవలనే ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైరయ్యాను. నాకు ఎలాంటి అప్పులు లేవు. పిల్లల బాధ్యతలన్నీ తీరిపోయాయి. నాకు వచ్చే పెన్షన్ నా ఖర్చులన్నింటికీ సరిపోతుంది. ఇప్పటికే రూ.3 లక్షల మేర అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకున్నాను. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ఎలా ఇన్వెస్ట్ చేయాలి ? ఎంత మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి? పుత్తడిలో ఎంత పెట్టాలి ? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు ఎంత కేటాయించాలి? –వెంకటాచలం, హైదరాబాద్
నా దృష్టిలో మ్యూచువల్ ఫండ్స్ ఆస్తి కాదు. ఇతర ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ ఒక మార్గమని నా అభిప్రాయం. కొంత మొత్తాన్ని ఈక్విటీ, మరికొంత మొత్తాన్ని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఇదే మొదటిసారైతే, ముందుగా బ్యాలన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఇక పుత్తడి విషయానికొస్తే, ఇది దీర్ఘకాల ఆస్తి కాదు. దీంట్లో పెట్టుబడులు పెట్టాల్సిన పని లేదు. కాదూ, కూడదు బంగారంలో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాల్సిందేనని మీరు అనుకుంటే, సావరిన్ గోల్డ్ బాండ్స్(ఎస్‌జీబీ)లో ఇన్వెస్ట్ చేయండి.
భారత్‌లో పుత్తడిలో ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న అత్యుత్తమ మార్గం ఇదే. ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే, మీకు వార్షికంగా 2.5 శాతం వడ్డీ గ్యారంటీగా వస్తుంది. ధరలు పెరిగితే ఆ వృద్ధి అదనం. ఈ బాండ్ రిడంప్షన్ సమయంలో మీరు పొందే మూలధన లాభాలపై పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 10–20 శాతం మించకుండా పుత్తడి పెట్టుడులు ఉండేలా చూసుకోండి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో కూడా కొంత డిపాజిట్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment