న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు మే నెలలో ఈక్విటీల్లో కొనుగోళ్ల బాట పట్టాయి. ఏప్రిల్ నెలలో నికరంగా రూ.4,553 కోట్లను ఈక్విటీల నుంచి మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) వెనక్కి తీసుకోగా, మే నెలలో రూ.2,446 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావడం, జీడీపీ వృద్ధి బలంగా ఉండడం ఇందుకు మద్దతుగా నిలిచినట్టు నిపుణులు చెబుతున్నారు. మే నెలలో ఈక్విటీ పెట్టుబడుల విషయంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు), దేశీ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల మధ్య చాలా అంతరం నెలకొంది.
ఎఫ్‌పీఐలు ఏకంగా రూ.43,838 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, మ్యూచువల్ ఫండ్స్ రూ.2,446 కోట్ల పెట్టుబడులకే పరిమితమైనట్టు సెబీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఏప్రిల్‌లోనూ ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల్లో రూ.11,631 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఈ తాత్కాలిక మార్పు ఈక్విటీలకు మద్దతుగా నిలిచినట్టు నిపుణులు భావిస్తున్నారు. ‘‘స్థిరమైన జీడీపీ వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం, ఇన్వెస్టర్‌కు అనుకూలమైన విధానాలు మ్యూచువల్ ఫండ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు తోడ్పడ్డాయి.
ఎఫ్‌పీఐలు, మ్యూచువల్ ఫండ్స్ ఒకరికొకరు సమతుల్యంగా వ్యవహరించారు. ఎఫ్‌పీఐలు విక్రయించినప్పుడు దేశీ ఇనిస్టిట్యూషన్స్ (మ్యూచువల్ ఫండ్స్ సహా) కొనుగోళ్లకు ముందుకు వచ్చాయి’’అని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది తెలిపారు. ఎఫ్‌పీఐలు, దేశీ ఇనిస్టిట్యూషన్స్ మధ్య వైరుధ్యం ఉన్నప్పటికీ గడిచిన 11 నెలలుగా మార్కెట్లు మొత్తం మీద సానుకూలంగా ట్రేడ్ అవుతుండడం గమనార్హం. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి మందగమనంపై ఆందోళనలు నెలకొనగా, దీర్ఘకాలంలో భారత్‌కు మెరుగైన వృద్ధి అవకాశాలు ఉన్న విషయాన్ని ఎప్సిలాన్ మనీ మార్ట్ ప్రొడక్ట్స్ హెడ్ నితిన్‌రావు గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment