- అవగాహనతో కూడిన అధ్యయనంతో ఉన్నత స్థానం
- సమయ సద్వినియోగమే విజయరహస్యం
- విద్యార్థులతో హైకోర్టు జడ్జి చంద్రయ్య
చోడవరం: ఉద్యోగ సాధనే చదువు లక్ష్యం కాకూడదని, సమాజ హితానికి ఏ విధంగా సేవ చేయగలమో, దేశానికి ఏవిధంగా ఖ్యాతి తేగలమో అన్న లక్ష్యంతోనే విద్యార్థులు నిరంతరం ఆలోచించాలని హైకోర్టు జడ్జి జి. చం ద్రయ్య అన్నారు. స్థానిక కోర్టుల సముదా యం ఆవరణలో విద్య, వైద్యం అనే అంశంపై ఆదివారం ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సద స్సులో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థి దశలో ప్రతి క్షణం విలువైనదని, ప్రతిరోజూ గొప్ప అవకాశంగా భావించాలని సూచించారు. అవగాహనతో కూడిన అధ్యయనం, క్రమశిక్షణతో కూడిన జీవనం, విలువల ఆచరణ వల్ల మాత్రమే ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతారన్నారు.
ఎలాంటి సదుపాయాలూ లేని రోజుల్లో విద్యాభాస్యం చేసిన ఎందరో పేదలు ఉన్నత విద్యాధికులై సమాజానికి సేవ చేశారని, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తదితరులు అలాంటివారేనని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అధ్యాపకులు కూడా తమ సొంత పిల్లలు ఏ విధంగా విద్యలో రాణించాలని అనుకుంటారో అదే భావన విద్యార్థుల పట్ల కూడా కలిగి ఉండాలన్నారు. ఆరోగ్య వంతమైన జీవితమే ఉన్నతికి తోడ్పడుతుందన్న విషయం విద్యార్థులు గుర్తెరగాలని, వ్యాయామం, సమతుల్య ఆహారం, మంచి ఆహారపు అలవాట్లు తప్పనిసరి అని సూచించారు.
సాధారణ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అన్యాయాలపై పోలీసులకు నిర్భయంగా సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. అనంతరం కొంతమంది విద్యార్థులను వేదికపైకి పిలిచి వారి లక్ష్యాలను, లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతం కోర్టు సముదాయం భవనాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులకు విద్య, వైద్యం అనే అంశాలపై లీగల్ అథారిటీ నిర్వహించిన వ్యాస రచన పోటీల విజేతలకు బహుమతులను హైకోర్టు జడ్జి చంద్రయ్య అందజేశారు.
కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, లీగల్ అథారిటీ సర్వీస్ ఇన్‌చార్జ్ వి. జయసూర్య, న్యాయమూర్తులు మానవేంద్రరావు, ఆనందరావు, రవీంద్రబాబు, వేణుగోపాలరావు, ఏఎస్పీ బాపూజీ, విశాఖ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, స్థానిక సివిల్ జడ్జి సుధామణి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి శివకుమార్, చోడవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మందా గౌరీశంకర్, తహశీల్దార్ శేషశైలజ తదితరులు పాల్గొన్నారు.