candrayya
-
సాహితీ ‘చంద్రుడు’
కథకుడిగా, కవిగా, రచయితగా, అనువాదకుడిగా సాహిత్యరంగానికి నాలుగున్నర దశాబ్దాలుగా సేవ చేస్తున్నారు ఐతా చంద్రయ్య. ఈయన రచనలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. సిద్దిపేట కీర్తిని సాహిత్య రంగంలో తనవంతుగా ఇనుమడింపజేసేందుకు కృషి చేస్తున్న చంద్రయ్య ఇప్పటి వరకు 500కు పైగా రచనలు చేశారు. బహుముఖ పాత్రలు పోషిస్తూ వైవిధ్య భరితమైన రచనలు చేస్తున్నారు. - నాలుగున్నర దశాబ్దాలుగా సాహితీలోకంలో చంద్రయ్య - బహుముఖ రంగాల్లో అనుభవం - ఇప్పటికి 500 పైగా రచనలు సిద్దిపేట మండలం చింతమడక గ్రామానికి చెందిన లింగయ్య,లక్ష్మి దంపతులకు జన్మించిన చంద్రయ్య విద్యాభ్యాసం కోసం సిద్దిపేటకు బాల్యంలోనే రావాల్సి వచ్చింది. పట్టణానికి చెందిన ప్రముఖ కవి కోకిల వేముగంటి నర్సింహ్మాచారి స్ఫూర్తితో తన 20వ యేట కలం నుంచి జాలువారిన అక్షరాల సమాహారమే రోజులు మారాలి అనే నాటిక. అప్పట్లో ఈ నాటిక పలువురి మన్ననలను అందుకొంది. అలా మొదలైన చంద్రయ్య సాహిత్య ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ అవార్డులు, రివార్డులతో ముందుకు సాగింది. ఇప్పటి వరకు సుమారు 400 కథలతో పాటు పలు కవితా సంపుటాలు, అనువాద పుస్తకాలు, శతకాలు, రేడియో నాటికలు తదితర 500 రచనలు చేశారు. ఆయన మేదస్సు నుంచి వెలువడిన 19 కథాసంపుటాలు, 14 కవితా కావ్యాలు, 9 నవలలు, 11 రేడియో నాటికలు, 18 హిందీ, ఇంగ్లీష్‌కు చెందిన రచనల అనువాదాలు ఐతా చంద్రయ్య కవితా ఆసక్తికి అద్దం పడతాయి. మరోవైపు చంద్రయ్య రాసిన స్వేచ్ఛా జీవులు కథాసంపుటి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పరిశోధన అంశంగా గుర్తింపు పొందింది. ఆయన రాసిన నవలలు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థుల పరిశోధనకు ఎంతో దోహదపడుతున్నాయి. తన రచన ప్రస్థానాన్ని ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అనేక రివార్డులు , అవార్డులు పొందారు. ఈయన పొందిన పురస్కారాలు వేముగంటి సాహితి పురస్కారం, పొట్టిశ్రీరాములు ప్రతిభా పురస్కారం, సోమేశ్వర సాహితీ పురస్కారం, ఆంధ్రాసారస్వత సమితి పురస్కారం, విశాల సాహిత్య అకాడమీ జీవిత కాల పురస్కారం, అచ్యుత రామశాస్త్రి పురస్కారం, శాతవాహన విశ్వవిద్యాలయ పురస్కారంతో పాటు ఇటీవల తెలంగాణ వార్షికోత్సవాల్లో భాగంగా జిల్లాస్థాయి ఉత్తమ సాహితీవేత్త పురస్కారం లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, సినారె, రాష్ట్ర మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా అనేక బహుమతుకు అందుకున్నారు. సంతృప్తిగా ఉంది మధ్యతరగతిలో జన్మించి సాహిత్య లోకానికి సేవ చేస్తున్నాననే సంతృప్తి ఉంది. సాహిత్యంలో ఎం.ఏ పూర్తిచేసి అటు పోస్టల్ శాఖా ఉద్యోగిగా పనిచేస్తూనే రచనలు, కవితలు, పుస్తకాలు రాశాను. ఈశేష జీవితాన్ని సాహిత్య రంగానికి అంకితం చేస్తా. -ఐతా చంద్రయ్య -
పాము కోసం కొంపను కూల్చేసుకున్నారు
పాము కోసం ఇంటినే కూలగొట్టారు ఓ దంపతులు. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం ముల్కపల్లికి చెందిన గుండెబోయిన చంద్రయ్య, మంజుల దంపతులది పెంకుటిల్లు. ఇంట్లోకి కొంతకాలం క్రితం నాగుపాము వచ్చి చేరింది. ఇంటి చూరులోని ఎలుకలను తింటూ అక్కడే తిష్టవేసింది. అప్పుడప్పుడు దూలాల మీద తిరుగుతూ కనపడటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చిన్న అలికిడి అయితే చాలు ప్రాణభయంతో వణికిపోయేవారు. ఆ పాముతో విసిగిపోయిన దంపతులు తమ ఇంటిని కూల్చివేశారు. పై కప్పు దూలాలన్నీ తీసివేయడంతో నాగుపాముకు ఆహారం లేకుండా పోయింది. రాత్రి గోడమీద నుంచి పాము కింద పడడంతో వెంటనే దానిని చంపేశారు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. ఇలా ఓ పాము కోసం ఇల్లు మొత్తాన్ని కూల్చుకోవాల్సి వచ్చింది. -
సమాజహితమే చదువు లక్ష్యం కావాలి
అవగాహనతో కూడిన అధ్యయనంతో ఉన్నత స్థానం సమయ సద్వినియోగమే విజయరహస్యం విద్యార్థులతో హైకోర్టు జడ్జి చంద్రయ్య చోడవరం: ఉద్యోగ సాధనే చదువు లక్ష్యం కాకూడదని, సమాజ హితానికి ఏ విధంగా సేవ చేయగలమో, దేశానికి ఏవిధంగా ఖ్యాతి తేగలమో అన్న లక్ష్యంతోనే విద్యార్థులు నిరంతరం ఆలోచించాలని హైకోర్టు జడ్జి జి. చం ద్రయ్య అన్నారు. స్థానిక కోర్టుల సముదా యం ఆవరణలో విద్య, వైద్యం అనే అంశంపై ఆదివారం ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సద స్సులో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థి దశలో ప్రతి క్షణం విలువైనదని, ప్రతిరోజూ గొప్ప అవకాశంగా భావించాలని సూచించారు. అవగాహనతో కూడిన అధ్యయనం, క్రమశిక్షణతో కూడిన జీవనం, విలువల ఆచరణ వల్ల మాత్రమే ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతారన్నారు. ఎలాంటి సదుపాయాలూ లేని రోజుల్లో విద్యాభాస్యం చేసిన ఎందరో పేదలు ఉన్నత విద్యాధికులై సమాజానికి సేవ చేశారని, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తదితరులు అలాంటివారేనని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అధ్యాపకులు కూడా తమ సొంత పిల్లలు ఏ విధంగా విద్యలో రాణించాలని అనుకుంటారో అదే భావన విద్యార్థుల పట్ల కూడా కలిగి ఉండాలన్నారు. ఆరోగ్య వంతమైన జీవితమే ఉన్నతికి తోడ్పడుతుందన్న విషయం విద్యార్థులు గుర్తెరగాలని, వ్యాయామం, సమతుల్య ఆహారం, మంచి ఆహారపు అలవాట్లు తప్పనిసరి అని సూచించారు. సాధారణ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అన్యాయాలపై పోలీసులకు నిర్భయంగా సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. అనంతరం కొంతమంది విద్యార్థులను వేదికపైకి పిలిచి వారి లక్ష్యాలను, లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతం కోర్టు సముదాయం భవనాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులకు విద్య, వైద్యం అనే అంశాలపై లీగల్ అథారిటీ నిర్వహించిన వ్యాస రచన పోటీల విజేతలకు బహుమతులను హైకోర్టు జడ్జి చంద్రయ్య అందజేశారు. కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, లీగల్ అథారిటీ సర్వీస్ ఇన్చార్జ్ వి. జయసూర్య, న్యాయమూర్తులు మానవేంద్రరావు, ఆనందరావు, రవీంద్రబాబు, వేణుగోపాలరావు, ఏఎస్పీ బాపూజీ, విశాఖ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, స్థానిక సివిల్ జడ్జి సుధామణి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి శివకుమార్, చోడవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మందా గౌరీశంకర్, తహశీల్దార్ శేషశైలజ తదితరులు పాల్గొన్నారు.