అక్కడ సమయానికి వడ్డీ కూడా ఇస్తారు.. ఎలాగంటే! | Switzerland Old People Time Bank Policy Special Story | Sakshi
Sakshi News home page

అక్కడ సమయానికి వడ్డీ కూడా ఇస్తారు.. ఎలాగంటే!

Published Tue, Feb 23 2021 8:41 AM | Last Updated on Tue, Feb 23 2021 1:19 PM

Switzerland Old People Time Bank Policy Special Story - Sakshi

స్విట్జర్లాండ్‌కి ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇటీవలి కరోనా కాలంలో కూడా ఆ దేశంలో ఒక్క కేసు కూడా రాకుండా జాగ్రత్తపడ్డారు. అన్ని విషయాలలోనూ కొత్తగా ఆలోచిస్తారు ఆ దేశీయులు. ఏ ఆసరా లేని వృద్ధుల గురించి ఒక కొత్త పథకం ప్రవేశపెట్టారు. అదే ‘టైమ్‌ బ్యాంక్‌ ’ స్కీమ్‌. ఒంటరిగా, కుటుంబ సభ్యుల సహకారం లేకుండా నివసిస్తున్న సీనియర్‌ సిటిజెన్లకు అండగా నిలబడటానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 

స్విట్జర్లాండ్‌లో ఒక పాఠశాల దగ్గర 67 సంవత్సరాల ఒంటరి మహిళ ఉండేవారు. ఆవిడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసి రిటైరయ్యారు. తనకొచ్చే పెన్షన్‌తో ఆవిడ హాయిగా కాలం గడపవచ్చు. కాని ఆమె ఖాళీగా కూర్చోవటానికి ఇష్టపడలేదు. తనకంటె 20 సంవత్సరాలు ఎక్కువ వయసున్న ఒక వృద్ధురాలికి సేవ చేసే పనిలో కుదిరారు. డబ్బు కోసం పనిచేయవలసిన అవసరం లేదు ఆమెకకు. తన సమయాన్ని టైమ్‌ బ్యాంకులో దాచుకోవటానికి పనిచేశారు.

అక్కడే మొదలు..
టైమ్‌ బ్యాంక్‌ను స్విట్జర్లాండ్‌లోని ప్రభుత్వ సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది. అక్కడి ప్రజలు యవ్వనంలో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు... నిస్సహాయులైన వృద్ధులకు సేవలందిస్తూ, సమయాన్ని దాచుకొని, తిరిగి వారికి అవసరంలో ఉన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు, ఇందుకోసం వారు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. చక్కగా మాట్లాడే సంభాషణ నైపుణ్యం ఉండాలి. ప్రతిరోజు వారి సేవలను కోరుకునే వారికి కావలసిన సేవలు అందించగలిగే స్థితిలో ఉండాలి. వారి సేవాకాలాన్ని వారి వ్యక్తిగత ఖాతాలో ‘సామాజిక భద్రత మంత్రిత్వశాఖ’ జమ చేస్తుంది. అలా ఆ 67 సంవత్సరాల మహిళ వారానికి రెండు రోజులు రెండు గంటల చొప్పున వృద్ధులకు సేవలు అందించటానికి వెళ్లేవారు.

వారి గదుల్ని శుభ్రం చేయటం, వారికి కావలసిన సరుకులు తేవటం, వారికి ఎండలో స్నానం చేయటానికి సహకరించటం వంటి పనులకు సహాయపడేవారు.. కొద్దిసేపు వారితో సరదాగా ముచ్చటించటానికి సమయం కేటాయించేవారు. వారు దరఖాస్తులో చేసుకున్న ఒప్పందం ప్రకారం. సంవత్సరం తర్వాత ‘టైమ్‌ బ్యాంక్‌’ వారు ఆమె సేవాకాలాన్ని లెక్కించి, ‘టైమ్‌ బ్యాంక్‌ కార్డు’ జారీ చేసింది. ఆమెకు ఇతరుల సహాయం అవసరం ఉన్నపుడు తన కార్డును ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఉంది. బ్యాంకులో డబ్బులు దాచుకుంటే వడ్డీ వచ్చినట్లుగానే, ఖాతాలో ఉన్న సమయాన్ని వడ్డీతో సహా తిరిగి వాడుకోవచ్చు. దరఖాస్తును పరిశీలించి, టైమ్‌ బ్యాంక్‌ ఒక వాలంటీర్‌ను ఆమె ఇంటికి గానీ, ఆస్పత్రికి గానీ పంపుతారు.

ఒక టీచర్‌ తన అనుభవాన్ని, ‘‘ఒకరోజు నేను స్కూల్లో ఉన్నపుడు నాకు పిలుపు వచ్చింది. నేను అక్కడకు వెళ్లాను. ఆవిడ... తాను కిటికీ శుభ్రం చేస్తుంటే స్టూల్‌ మీద నుంచి జారిపడ్డానని చెప్పింది. నేను వెంటనే స్కూల్‌కి సెలవు పెట్టి, ఆవిడను ఆసుపత్రికి తీసుకువెళ్లాను. ఆవిడకు మడమ దగ్గర ఫ్రాక్చర్‌ అయ్యిందనీ, కొంతకాలం పాటు బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాలనీ చెప్పారు డాక్టర్‌. నేను కొన్ని రోజుల పాటు ఆవిడ ఇంటి దగ్గర ఉండటానికి సిద్ధపడ్డాను. అయితే ఆవిడ నన్ను దిగులుపడద్దని, అప్పటికే తాను టైమ్‌ బ్యాంక్‌కి దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. ఆసుపత్రిలో చేరిన రెండు గంటలకే, ఆవిడకు సేవలందించడానికి టైమ్‌ బ్యాంక్‌ వారు వాలంటీర్లను పంపారు. నెల రోజుల పాటు ఆ వాలంటీర్‌ ఆమె యోగక్షేమాలు చూసుకున్నారు. ఆమెకు ఇష్టమైన వంటకాలు తయారు చేసి పెట్టారు. మనసుకు ఉల్లాసం కలిగించేలా కబుర్లు చెప్పారు. సకాలంలో మంచి సేవలు అందటం వల్ల, త్వరగా కోలుకుని, తిరిగి తన పనులు తాను చేసుకోవటం మొదలుపెట్టారామె. తాను ఇంత ఆరోగ్యంగా ఉండటానికి టైమ్‌ బ్యాంక్‌లో మరింత కాలాన్ని నమోదు చేసుకుంటానంది ఆవిడ’’ అని చెప్పారు.

రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన టైమ్‌ బ్యాంకు సేవలను ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో అందరూ ఆనందంగా వినియోగించుకోవటం సర్వసాధారణమైపోయింది. ఈ పద్ధతి వల్ల ఆ దేశంలో బీమా ఖర్చులు బాగా తగ్గాయి. అనేక సామాజిక సమస్యలు కూడా పరిష్కారమవుతున్నాయి. ఆ దేశప్రజలు ఈ విధానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించారు. అక్కడ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఆ దేశ పౌరులలో సగం మంది పౌరులు టైమ్‌ బ్యాంకు విధులలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రభుత్వం ఈ విధానాన్ని చట్టబద్ధం చేసింది. ప్రస్తుతం ఆసియా దేశాల్లో ఒంటరి గూటి వృద్ధ పక్షుల సంఖ్య బాగా పెరిగిపోతుండటం వల్ల వారి సంక్షేమం ఒక సామాజిక సమస్యగా మారుతోంది. అన్ని దేశాల వారు స్విట్జర్లాండ్‌ ‘టైమ్‌ బ్యాంక్‌ ‘ విధానం గురించి ఆలోచన చేసి, టైమ్‌ బ్యాంకు విధానాన్ని ప్రవేశపెట్టి, చట్టబద్ధం చేస్తే మంచిదేమో. ఆలోచించాల్సిన విషయమే.

టైమ్‌ బ్యాంకు... ఈ పేరు వినగానే ఇది ఏమిటి అనిపిస్తుంది. మన దగ్గరున్న డబ్బులు మనీ బ్యాంకులో వేస్తాం. ఆ బ్యాంకుల గురించి అందరికీ తెలుసు. అలాగే మనం చేసిన పని సమయాన్ని టైమ్‌ బ్యాంకులో వేస్తాం. అదే టైమ్‌బ్యాంక్‌. ఆ టైమ్‌ను, తను కదలలేని పరిస్థితుల్లో వినియోగించుకోవచ్చు. వినటానికి ఈ మాట కొత్తగా అనిపిస్తోందా. ఇది నిజం. స్విట్జర్లాండ్‌లో ఇప్పుడు అందరూ బాగా వినియోగించుకుంటున్న ఏకైక బ్యాంకు టైమ్‌ బ్యాంక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement