మన చుట్టూ మనకు తెలియకుండానే ఎంతో మంది రకరకాల బాధలకు లోనవుతుంటారు. వారిలో ముఖ్యంగా వృద్ధులు, వికలాంగుల సమస్యలకు సరైన పరిష్కారం తెలియక ఇబ్బందులు పడుతుంటారు. వారి మానాన వారిని అలాగే వదిలేయడం కన్నా పరిష్కారాన్ని కనుగొంటాను అనుకున్నాడు. తనదైన మార్గంలో ప్రయత్నించాడు. విజయం సాధించాడు. సత్కారాలను పొందుతున్నాడు హైదరాబాద్ వాసి హేమేష్ చదలవాడ.
దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో సేవలు అందించిన 21 ఏళ్ల లోపు 20 మంది యువ సాధకులను ఢిల్లీలో మొన్న జరిగిన ‘అన్‌స్టాపబుల్ 21’ వేదికగా సత్కరించారు. హ్యూమన్ స్టడీస్, సైన్స్, క్రీడలు, ఫైన్ ఆర్ట్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్, సోషల్ ఇంపాక్ట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే ఏడు రంగాలలో ప్రతిభావంతులైన యువతకు ఈ సత్కారాన్ని అందజేశారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన 16 ఏళ్ల హేమేష్ చదలవాడ ఎలక్ట్రానిక్స్ రంగంలో కనబరిచిన ప్రతిభకు గుర్తింపు పొందాడు.
వృద్ధులకు సహాయం..
హేమేష్ పన్నెండేళ్ల వయసు నుంచి ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ రంగంలో గణనీయమైన ప్రతిభను చూపుతున్నాడు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న అమ్మమ్మను చూసి ఆమెకు ఏదైనా సాయం చేయాలనుకున్నాడు. తన ఆలోచనల గురించి హేమేష్ చెబుతూ ‘నడిచేటప్పుడు అమ్మమ్మ అడుగులు తడబడుతుండేవి. మతిమరపు ఉండేది. ఆమెకు తన మీద తనకు కంట్రోల్ ఉండేది కాదు. కొన్నిసార్లు అర్థరాత్రి మంచంపై నుంచి లేచి ఎటో వెళ్లిపోయేది. దీంతో ఆమెను కనిపెట్టి ఉండటం కష్టమయ్యేది.
అమ్మమ్మకు, ఆమెను చూసుకునే మాకూ ఇదో సవాల్‌గా ఉండేది. కొన్ని అందుబాటులో ఉన్న డివైజ్‌లను ప్రయత్నించి చూశాం. కానీ, ఏ మాత్రం సంతృప్తిగా అనిపించలేదు. అమ్మమ్మకు సాయపడే డివైజ్‌ను నేనే సొంతంగా తయారుచేయాలనుకున్నాను’ అని తనలో రూపుదిద్దుకున్న ఆలోచనను వివరిస్తాడు. హేమేష్ కృషి, పట్టుదల, అంకితభావానికి అతని తల్లిదండ్రులు కిశోర్, సంధ్యలు ప్రోత్సాహం అందించారు.
పరికరం ఎలా పనిచేస్తుందంటే..
ఈ పరికరం వాచ్‌లాగా మణికట్టుకూ కట్టుకోవచ్చు. బ్యాడ్జ్‌గానూ ధరించవచ్చు. రోగి నడక, భంగిమ, శరీర ఉష్ణోగ్రత, నాడిని పర్యవేక్షిస్తుంది. నీళ్లు జారిపడుతుండే శబ్దాన్ని కూడా గుర్తించగలదు. మనిషి దూరంగా తిరుగుతున్నప్పుడు లేదా పడిపోవడం వంటి ప్రమాదంలో ఉన్నప్పుడు వెంటనే తెలియజేస్తుంది. ఇంకా అలారంలో ‘పిల్‌బాక్స్’ ఫీచర్ కూడా ఉంటుంది. ఇది రోగులు వారి మందులు తీసుకునే సమయం వచ్చినప్పుడు హెచ్చరికలను పంపుతుంది.
‘ఈ డివైజ్ మా అమ్మమ్మ కోసం తయారు చేసినప్పుడు ఇంటర్నెట్ సరైన మార్గం చూపింది. అయితే, ఈ పరికరం పూర్తయ్యేసరికి అమ్మమ్మ చనిపోయారు’ అని హేమేష్ తెలిపాడు. ఇప్పుడీ అబ్బాయి 12వ తరగతి చదువుతున్నాడు.
తన తదుపరి ప్రాజెక్ట్స్‌తో ఎలక్ట్రానిక్స్, రోబోటిక్ రంగంలో మరిన్ని అడుగులు వేస్తున్నట్టుగా వివరించాడు. 2021లో ప్రధానమంత్రి చేతుల మీదుగా రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందుకున్నాడు. పేరున్న కంపెనీల నుంచి గ్రాంట్‌లను పొందాడు.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment