Old peoples
-
అమ్మమ్మలకు అండగా.. మతిమరుపుతో బాధపడేవాళ్లకు ఇది బెస్ట్ సొల్యూషన్
మన చుట్టూ మనకు తెలియకుండానే ఎంతో మంది రకరకాల బాధలకు లోనవుతుంటారు. వారిలో ముఖ్యంగా వృద్ధులు, వికలాంగుల సమస్యలకు సరైన పరిష్కారం తెలియక ఇబ్బందులు పడుతుంటారు. వారి మానాన వారిని అలాగే వదిలేయడం కన్నా పరిష్కారాన్ని కనుగొంటాను అనుకున్నాడు. తనదైన మార్గంలో ప్రయత్నించాడు. విజయం సాధించాడు. సత్కారాలను పొందుతున్నాడు హైదరాబాద్ వాసి హేమేష్ చదలవాడ. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో సేవలు అందించిన 21 ఏళ్ల లోపు 20 మంది యువ సాధకులను ఢిల్లీలో మొన్న జరిగిన ‘అన్‌స్టాపబుల్ 21’ వేదికగా సత్కరించారు. హ్యూమన్ స్టడీస్, సైన్స్, క్రీడలు, ఫైన్ ఆర్ట్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్, సోషల్ ఇంపాక్ట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే ఏడు రంగాలలో ప్రతిభావంతులైన యువతకు ఈ సత్కారాన్ని అందజేశారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన 16 ఏళ్ల హేమేష్ చదలవాడ ఎలక్ట్రానిక్స్ రంగంలో కనబరిచిన ప్రతిభకు గుర్తింపు పొందాడు. వృద్ధులకు సహాయం.. హేమేష్ పన్నెండేళ్ల వయసు నుంచి ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ రంగంలో గణనీయమైన ప్రతిభను చూపుతున్నాడు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న అమ్మమ్మను చూసి ఆమెకు ఏదైనా సాయం చేయాలనుకున్నాడు. తన ఆలోచనల గురించి హేమేష్ చెబుతూ ‘నడిచేటప్పుడు అమ్మమ్మ అడుగులు తడబడుతుండేవి. మతిమరపు ఉండేది. ఆమెకు తన మీద తనకు కంట్రోల్ ఉండేది కాదు. కొన్నిసార్లు అర్థరాత్రి మంచంపై నుంచి లేచి ఎటో వెళ్లిపోయేది. దీంతో ఆమెను కనిపెట్టి ఉండటం కష్టమయ్యేది. అమ్మమ్మకు, ఆమెను చూసుకునే మాకూ ఇదో సవాల్‌గా ఉండేది. కొన్ని అందుబాటులో ఉన్న డివైజ్‌లను ప్రయత్నించి చూశాం. కానీ, ఏ మాత్రం సంతృప్తిగా అనిపించలేదు. అమ్మమ్మకు సాయపడే డివైజ్‌ను నేనే సొంతంగా తయారుచేయాలనుకున్నాను’ అని తనలో రూపుదిద్దుకున్న ఆలోచనను వివరిస్తాడు. హేమేష్ కృషి, పట్టుదల, అంకితభావానికి అతని తల్లిదండ్రులు కిశోర్, సంధ్యలు ప్రోత్సాహం అందించారు. పరికరం ఎలా పనిచేస్తుందంటే.. ఈ పరికరం వాచ్‌లాగా మణికట్టుకూ కట్టుకోవచ్చు. బ్యాడ్జ్గానూ ధరించవచ్చు. రోగి నడక, భంగిమ, శరీర ఉష్ణోగ్రత, నాడిని పర్యవేక్షిస్తుంది. నీళ్లు జారిపడుతుండే శబ్దాన్ని కూడా గుర్తించగలదు. మనిషి దూరంగా తిరుగుతున్నప్పుడు లేదా పడిపోవడం వంటి ప్రమాదంలో ఉన్నప్పుడు వెంటనే తెలియజేస్తుంది. ఇంకా అలారంలో ‘పిల్‌బాక్స్’ ఫీచర్ కూడా ఉంటుంది. ఇది రోగులు వారి మందులు తీసుకునే సమయం వచ్చినప్పుడు హెచ్చరికలను పంపుతుంది. ‘ఈ డివైజ్ మా అమ్మమ్మ కోసం తయారు చేసినప్పుడు ఇంటర్నెట్ సరైన మార్గం చూపింది. అయితే, ఈ పరికరం పూర్తయ్యేసరికి అమ్మమ్మ చనిపోయారు’ అని హేమేష్ తెలిపాడు. ఇప్పుడీ అబ్బాయి 12వ తరగతి చదువుతున్నాడు. తన తదుపరి ప్రాజెక్ట్స్‌తో ఎలక్ట్రానిక్స్, రోబోటిక్ రంగంలో మరిన్ని అడుగులు వేస్తున్నట్టుగా వివరించాడు. 2021లో ప్రధానమంత్రి చేతుల మీదుగా రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందుకున్నాడు. పేరున్న కంపెనీల నుంచి గ్రాంట్లను పొందాడు. – నిర్మలారెడ్డి -
నమ్మలేని నిజం..'లైఫ్' అంటే చివరికి ఓ పడకమంచం మాత్రమేనా!…
ఆమె వయస్సు 85 ఏళ్లు… ముంబై నుంచి పూణెకు వెళ్లిపోతోంది… పూణెలో ఓ సీనియర్ సిటిజెన్స్ హోమ్‌కు… అనగా ఓ ప్రత్యేక వృద్ధాశ్రమానికి… ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు… ఆమె చదువుకున్నదే… ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు చేసింది. వాళ్లందరూ అమెరికా పౌరులు. అందరికీ ఇద్దరేసి పిల్లలు… వాళ్లంతా హైస్కూల్, కాలేజీ చదువుల్లో ఉన్నారు… ఈమె అమెరికాకు బోలెడుసార్లు వెళ్లింది… కాన్పులు చేసింది… వెళ్లిన ప్రతిసారీ ఆరు నెలలపాటు ఉండేది… ఇక చాలు అనుకుంది… ఇక తన అవసరం ఎవరికీ ఏమీ లేదు. అమెరికాకు వెళ్లాలని లేదు, రానని చెప్పేసింది… ఆరోగ్యంగా మిగిలిన జీవితం గడపాలి చాలు… అందుకే ఆమె సీనియర్ సిటిజెన్స్ హోంకు వెళ్లిపోతోంది… వాటినే రిటైర్మెంట్ హోమ్స్ అనండి… అమెరికాలో వాటినే నర్సింగ్ హోమ్స్ అంటారుట. ఇక ఆమె కొనసాగిస్తూ.. ‘‘వెళ్తున్నాను… ఇక తిరిగి ఎక్కడికీ రాను… నా విశ్రాంత, చివరి కాలం గడపటానికి ఓ స్థలం వెతుక్కున్నాను… వెళ్లకతప్పదు… తమ పిల్లల బాగోగుల గురించి నా పిల్లలు బిజీ… ఎప్పుడో గానీ నేను వారి మాటల్లోకి రాను… నేనిప్పుడు ఎవరికీ ఏమీ కాను… ఎవరికీ అక్కరలేదు… ఆశ్రమం అంటే ఆశ్రమం ఏమీ కాదు… అది రిటైర్మెంట్ హోం… బాగానే ఉంది… ఒక్కొక్కరికీ ఒక సింగిల్ రూం… మరీ అవసరమైన ఎలక్ట్రికల్ పరికరాలు… టీవీ… అటాచ్డ్ బాత్రూం… బెడ్డు… ఏసీ కూడా ఉంది… కిటికీ తెరిస్తే బయటి గాలి… ఫుడ్డు కూడా బాగుంది… సర్వీస్ బాగుంది… కానీ ఇవేమీ చవుక కాదు… ప్రియమైనవే… నాకొచ్చే పెన్షన్ బొటాబొటీగా ఈ అవసరాలకు సరిపోతుంది… సరిపోదంటే నాకున్న సొంత ఇంటిని అమ్మేయాల్సిందే… అమ్మేస్తే ఇక చివరి రోజులకు సరిపడా డబ్బుకు ఢోకాలేదు… నా తరువాత ఏమైనా మిగిలితే నా కొడుక్కి వెళ్లిపోతుంది… సో, ఆ చీకూచింత ఏమీ లేదు… ‘నీ ఇష్టం అమ్మా, నీ ఆస్తిని నీ అవసరాలకే వాడుకో…’’ అన్నాడు నా వారసుడు… వెళ్లిపోవడానికి సిద్ధమైపోతున్నాను… అకస్మాత్తుగా..అవి నావి ఎలా అవుతాయ్?.. ఓ ఇంటిని వదిలేయడం అంటే అంత సులభమా..? కాదుగా… బాక్సులు, బ్యాగులు, అల్మారాలు, ఫర్నీచర్, రోజువారీ మన జీవితంతో పెనవేసుకున్న బోలెడు పాత్రలు… అన్ని కాలాల్లోనూ మనల్ని కాపాడిన బట్టలు… సేకరణ అంటే నాకిష్టం… లెక్కలేనన్ని స్టాంపులు ఉన్నయ్… చాయ్ కప్పులున్నయ్… అత్యంత విలువైన పెండెంట్లు, బోలెడు పుస్తకాలు… అల్మారాల నిండా అవే… డజన్లకొద్దీ విదేశీ మద్యం సీసాలున్నయ్… బోలెడంత వంట సామగ్రి ఉంది… అరుదైన మసాలాలు… ఇవే కాదు, అనేక ఫోటో అల్బమ్స్… ఇవన్నీ ఏం చేయాలి..? నేను ఉండబోయే ఆ ఇరుకైన గదిలో వాటికి చోటు లేదు… నా జ్ఞాపకాల్ని అది మోయలేదు… అది భద్రపరచదు కూడా… ఏముంది ఆ గదిలో…? మహా అయితే ఓ చిన్న కేబినెట్, ఓ టేబుల్, ఓ బెడ్, ఓ సోఫా ఓ చిన్న ఫ్రిజ్, ఓ చిన్న వాషింగ్ మెషిన్, ఓ టీవీ, ఓ ఇండక్షన్ కుక్కర్, ఓ మైక్రోవేవ్ ఓవెన్… అన్నీ అవసరాలే… కానీ నా జ్ఞాపకాల్ని కొనసాగించే సౌకర్యాలు కావు… నేను నా విలువైన సంపద అనుకున్న ఏ సేకరణనూ నాతో ఉంచుకోలేను… అకస్మాత్తుగా అవన్నీ నిరుపయోగం అనీ, అవి నావి కావనీ అనిపిస్తోంది… అన్నీ నేను వాడుకున్నాను, అంతే… అవి ప్రపంచానికి సంబంధించినవి మాత్రమే… నావి ఎలా అవుతాయి..? నా తరువాత ఎవరివో… రాజులు తమ కోటల్ని, తమ నగరాల్ని, తమ రాజ్యాల్ని తమవే అనుకుంటారు… కానీ వాళ్ల తరువాత అవి ఎవరివో… నిజానికి ప్రపంచ సంపద కదా… మనతోపాటు వచ్చేదేముంది..? వెళ్లిపోయేది ఒక్క దేహమే కదా… అందుకని నా ఇంట్లోని ప్రతిదీ దానం చేయాలని నిర్ణయించాను… అన్నింటితో బంధం తెంచేసుకున్నా.. కానీ అవన్నీ కొన్నవాళ్లు ఏం చేస్తారు..? నేను అపురూపంగా సేకరించుకున్న ప్రతి జ్ఞాపకం వేరేవాళ్లకు దేనికి..? వాటితో వాళ్లకు అనుబంధం ఉండదుగా… బుక్స్ అమ్మేస్తారు… నా గురుతులైన ఫోటోలను స్క్రాప్ చేసేస్తారు… ఫర్నీచర్ ఏదో ఓ ధరకు వదిలించుకుంటారు… బట్టలు, పరుపులు బయటికి విసిరేస్తారు… వాళ్లకేం పని..? మరి నేనేం ఉంచుకోవాలి..? నా బట్టల గుట్ట నుంచి కొన్ని తీసుకున్నాను… అత్యవసర వంట సామగ్రి కొంత… తరచూ పలకరించే నాలుగైదు పుస్తకాలు… ఐడీ కార్డు, సీనియర్ సిటెజెన్ సర్టిఫికెట్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డ్, ఏటీఎం కార్డు, బ్యాంకు పాస్ బుక్కు… చాలు… అన్నీ వదిలేశాను… బంధం తెంచేసుకున్నాను… నా పొరుగువారికి వీడ్కోలు చెప్పాను… డోర్ వేసి, గడపకు మూడుసార్లు వంగి మొక్కుకున్నాను… ఈ ప్రపంచానికి అన్నీ వదిలేశాను… ఎవరో చెప్పినట్టు… ఏముంది..? ఓ దశ దాటాక… కావల్సింది ఒక మంచం… ఓ గది… అత్యవసరాలు… మిగిలినవన్నీ గురుతులు మాత్రమే… ఇప్పుడు అర్థమవుతుంది మనకు… మనకు పెద్దగా ఏమీ అక్కర్లేదు… మనం ఇకపై సంతోషంగా ఉండేందుకు మనకు ఇక ఎటూ పనికిరానివాటిని సంకెళ్లుగా మిగుల్చుకోవద్దు… వదిలేయాలి… వదిలించుకోవడమే… కీర్తి, సంపద, భవిష్యత్తు… అన్నీ ఓ ట్రాష్… లైఫ్ అంటే చివరికి ఓ పడకమంచం మాత్రమే… నిజంగా అంతే… అరవై ఏళ్లు పైబడ్డామంటే ఆలోచన మారాలి… ప్రపంచంతో అనుబంధం ఏమిటో తెలుసుకోవాలి… అంతిమ గమ్యం ఏమిటో, భవబంధాలేమిటో అర్థమవ్వాలి… మన ఫాంటసీలు, మన బ్యాగేజీతో పాటు మనం ఇక తినలేని, అనుభవించలేని, ఉపయోగించలేనివి వదిలేయక తప్పదు… అందుకే బంధం పెంచుకోవడమే వృథా… సో, ఆరోగ్యంగా ఉండండి… ఆనందంగా ఉండండి… ఏదీ మనది కాదు… ఎవరూ మనవాళ్లు కారు… మనిషి ఒంటరి… మహా ఒంటరి… వచ్చేటప్పుడు, పోయేటప్పుడు’’..!! -
పింఛనిప్పించండి సారూ..
ప్రగతినగర్ : పింఛన్ కోసం సోమవారం ప్రజావాణిలో వినతులు వెల్లువెత్తాయి. ఉదయం నుంచి బారులుదీరి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు దరఖాస్తులు చేసుకున్నారు. వివిధ సమస్యలపై 183 ఫిర్యాదులు రాగా కేవలం పింఛన్ కోసం 476 ఫిర్యాదులు అం దాయి. అదనపుజేసీ శేషాద్రి, డీఆర్ఓ మనోహర్, పీడీ వెంకటేశం ఫిర్యాదులు స్వీకరించారు. ఆసరాను అందించండి... అర్హులైన వికలాంగులందరికీ ఆసరాను అందించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యం లో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో వికలాంగులు ధర్నకు దిగారు. ఈ సంధర్బంగా బీహెచ్పీఎస్ నాయకులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అర్హులైన వికలాంగులకు ప్రభుత్వం ఆసరా కల్పించాలన్నారు.ఎంతో మంది వికలాంగులు అర్హులుగా ఉన్నా సదరం నిర్వాహకుల వల్ల వికలాంగులకు పింఛన్ అందకుం డా పోతుందన్నారు.నిజమైన వికలాంగులు పింఛన్‌రాక తిప్పలు పడుతున్నారన్నారు. ‘ఉగాదే’ కొత్త సంవత్సరం తెలుగునామ సంవత్సర ఉగాదే మన కొత్త సంవత్సరమని హిందూ జన జాగృతి ఆధ్వర్యంలో ఏజేసీని కలి సి వినతి పత్రాన్ని సమర్పించారు.అంతకుముందు స్థానిక శివాజీనగర్‌లోని శివాజీ చౌక్ నుంచి ర్యాలీ చేపట్టారు. హిందూవులకు ఉగాదే ఉత్తమమైన పండుగని, జనవరి ఒకటి మన నూతన సంవత్సర పండుగ కాదని జాగృతి ప్రతినిధులు పేర్కొన్నారు. అందువల్న జనవరి ఒకటిన నూతన సంవత్సర వేడుకలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఉగాదిని పండుగను ప్రభుత్వం నూతన సంవత్సరంగా ప్రకటించాలన్నారు. సర్పంచ్‌పై ఫిర్యాదు నిజమాబాద్ మండలం మల్కాపూర్ గ్రామ సర్పంచ్, కార్యాదర్శి కలిసి ఆసరా పథకంలో మంజూరు అయి న పింఛన్ ఇవ్వకుండా ఇంటి ట్యాక్సును వసూలు చేస్తున్నారని గ్రామస్తులు అదనపు జాయింట్ కలెక్టర్ శేషాద్రికి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రైసైకిళ్ల పంపిణీ వికలాంగులకు సోమవారం ప్రజావాణిలో ఏజేసీ శేషాద్రి ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు.వికలాంగులైనా రవి,సాయమ్మ, గౌస్‌లు ట్రైసైకిల్లకోసం దరఖాస్తు చేసుకోగా వారికి అందించారు. ఏజేసీ మాట్లాడుతూ వికలాంగులు ట్రైసైకిళ్లు,వినికిడి యంత్రాలు,చేతి కర్ర లు ఇతర వికలాంగులకు సంబంధించిన పరికరాల కోసం వికలాంగుల సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
ఉన్నోళ్లకే పింఛన్లా?
జోగిపేట: ‘ఉన్నోళ్లకు పింఛన్లు ఇచ్చి మా లాంటి గరీబోళ్లకు ఇవ్వరా’ అంటూ జోగిపేటలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వందల సంఖ్యలో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం రాస్తారోకో చేపట్టారు. ఈ రోజు 3 గంటల తర్వాత పింఛన్లు ఇస్తామని చెప్పి అధికారులు ముఖం చాటేయడంతో వారంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ నగర పంచాయతీ కార్యాలయం నుంచి ఒకేసారి రోడ్డుపైకి చేరుకొని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు 40 నిమిషాలపాటు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎస్ఐ శ్రీనివాస్ తమ సిబ్బందితో రాస్తారోకో స్థలం వద్దకు చేరుకున్నారు. చాలా సేపు మహిళలకు నచ్చజెప్పారు. అయినా వారు అధికారులు ఇక్కడికే రావాలంటూ మొండికేశారు. ఓ వికలాంగ మహిళ ఎస్ఐ కాళ్లు పట్టుకొని ప్రాధేయపడింది. ఈ రోజు పరిష్కారం కాకపోతే మళ్లీ మీరు ఆందోళన చేసుకోవచ్చు, ఇప్పుడైతే కార్యాలయం వద్దకు వెళదామంటూ చెప్పి వార్ని అక్కడకు తీసుకువెళ్లారు. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో మహిళలు, వితంతువులు అసంతృప్తితో వెనుదిరిగి వెళ్లారు. -
రోడ్డెక్కిన పండుటాకులు..
పరిగి: వారం రోజులుగా పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి వేసారిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సోమవారం పరిగిలో వికారాబాద్ రహదారిపై ధర్నాకు దిగారు. పింఛన్ ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ముందు పరిగి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట రాస్తారోకోకు దిగారు. వాహనాల రాకపోకలను అడ్డుకుంటూ సుమారు గంటపాటు ఆందోళన కొనసాగించారు. ఒకేసారి 600 మంది పింఛన్‌దారులు ఆందోళనలో పాల్గొన్నారు. ఎస్ఐ శంషోద్దీన్ ఆందోళన వద్దకు చేరుకుని సముదాయించేందుకు ప్రయత్నించారు. అయినా పింఛన్‌దారులు శాంతించలేదు. ‘సీఎం డౌన్‌డౌన్, అధికారులు డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేశారు. పరిగితోపాటు అనుబంధ గ్రామాలైన కిష్టమ్మగుళ్లతండా, న్యామత్‌నగర్‌తండా, మల్లేమోనిగూడలకు చెందిన పింఛన్‌దారులు రాస్తారోకోలో పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వారం రోజులుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని, సీఏస్పీ సైతం రోజుకోమాట చెబుతూ తిప్పుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ నాయకులు సైతం వారితోపాటు రోడ్డుపై బైఠాయించి సంఘీభావం తెలిపారు. అధికారులు, సీఏస్పీలతో మాట్లాడి పింఛన్లు ఇప్పించేందుకు కృషి చేస్తామని టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. -
పండుటాకుకు ఊరట
వృద్ధులైన పింఛన్‌దారులకు ఊరట కలిగింది. వేలిముద్రలు నమోదు చేసుకుంటేనే పింఛన్ అందుతుందని ఇటీవల కాలంలో నిబంధనలు పెట్టారు. దీంతో చేతిలో గీతలు అరిగిన పోయిన వృద్ధులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కానీ, ఇప్పుడు వారి ఆందోళనకు బ్రేక్ పడింది. వేలిముద్రలు లేకుండానే పింఛన్ డబ్బులు ఇవ్వనున్నారు. పాలమూరు : ఆరు నెలలుగా పింఛన్ అందకపోవడంతో పండుటాకులు విలవిల్లాడుతున్నారు. వృద్ధాప్యంలో ధీమాగా బతికేందుకు ప్రభుత్వం తరఫున అందజేసే 500 కూడా రాక తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. ప్రతినెల మాదిరిగానే పింఛన్ల కోసం సంబంధిత పోస్టల్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిత్యావసరాలు, మందులకు ఉపయోగపడే పింఛన్ డబ్బుల కోసం అధికారులను ప్రాధేయపడుతున్నారు. సాంకేతికం పేరిట బయోమెట్రిక్ విధానంతో సామాజిక పింఛన్లను పంపిణీచేసే విధానం వారికి అవస్థను తెచ్చిపెట్టింది. జిల్లా వ్యాప్తంగా 2,53,904 మంది వృద్ధులకు పింఛన్ రావాల్సి ఉంటుంది. అయితే ఇందులో దాదాపు 35వేల మంది వృద్ధులకు వేలిముద్రలు చెరిగిపోయి బయోమెట్రిక్‌లో వివరాలు నమోదు కాక.. సామాజిక పింఛన్లు పొందలేక పోతున్నారు. ఆరునెలలుగా ఈ విధానాన్ని మార్చాలని, తమ అవస్థను తీర్చాలన్న పండుటాకుల వేదనకు ఎట్టకేలకు ఊరట దక్కింది. గ్రామస్థాయి కమిటీల పర్యవేక్షణలో పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఆరునెలల నిరీక్షణకు తెరపడింది. చేతులు లేక.. చేతి వేలిముద్రలు చెరిగిపోయి బయోమెట్రిక్‌లో వివరాలు నమోదు కాక, సామాజిక పింఛన్లు అందుకోలేక లబ్ధిదారులు పడుతున్న అవస్థలను ప్రభుత్వం ఎట్టకేలకు గుర్తించింది. ఓ కమిటీని ఏర్పాటు చేసి వారి సమక్షంలో ప్రతినెలా పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామ స్థాయిలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఇద్దరు విలేజ్ ఆర్గనైజర్లతో కమిటీ, పట్టణ, నగర స్థాయిల్లో కౌన్సిలర్/కార్పొరేటర్, బిల్ కలెక్టర్, ఐకేపీ అర్బన్ సిబ్బంది ఇద్దరితో కమిటీ ఏర్పాటు చేసి వారి సమక్షంలో లబ్ధిదారుల కుటుంబాలకు పింఛన్లు అందించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా 35వేల మంది వృద్ధులకు ఆరు నెలల పింఛన్లు అందనున్నాయి. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సామాజిక పింఛన్లలో జిల్లాలో 2,53,904 మంది వృద్ధులకు, 1,34,293 మంది వితంతువులు, 47,063 మంది వికలాంగులు, 14,788 మంది చేనేత, 1,441మంది గీత కార్మిక, 20,887 మంది అభయ హస్తం పింఛన్లున్నాయి. జిల్లాలో మొత్తంగా సామాజిక పింఛన్‌దారులు 4,72,376 మంది ఉన్నారు. అభయహస్తం, వికలాంగులకు ప్రతినెలా 500, మిగతావారికి 200 చొప్పున ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. గతంలో కుష్టువ్యాధిగ్రస్తులు, చేతులు లేని వికలాంగులు, వృద్ధాప్యంతో చేతి ముద్రలు చెరిగిపోయిన వారు బయో మెట్రిక్‌లో నమోదు చేయించుకోలేకపోయారు. ఇలాంటివారు 35వేల మంది వరకు ఉన్నారు. వీరికి ఆరు నెలలుగా పింఛన్లు నిలిచిపోయాయి. క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లగా స్పందించిన ప్రభుత్వం గ్రామస్థాయిలో కమిటీలు వేసి సభ్యుల సమక్షంతో పింఛన్లు ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల నుంచి గ్రామసభలు నిర్వహించి అర్హులందరికీ పింఛన్లు అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.