ఉన్నోళ్లకే పింఛన్లా?
జోగిపేట: ‘ఉన్నోళ్లకు పింఛన్లు ఇచ్చి మా లాంటి గరీబోళ్లకు ఇవ్వరా’ అంటూ జోగిపేటలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వందల సంఖ్యలో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం రాస్తారోకో చేపట్టారు. ఈ రోజు 3 గంటల తర్వాత పింఛన్లు ఇస్తామని చెప్పి అధికారులు ముఖం చాటేయడంతో వారంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ నగర పంచాయతీ కార్యాలయం నుంచి ఒకేసారి రోడ్డుపైకి చేరుకొని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు 40 నిమిషాలపాటు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ఎస్‌ఐ శ్రీనివాస్ తమ సిబ్బందితో రాస్తారోకో స్థలం వద్దకు చేరుకున్నారు. చాలా సేపు మహిళలకు నచ్చజెప్పారు. అయినా వారు అధికారులు ఇక్కడికే రావాలంటూ మొండికేశారు. ఓ వికలాంగ మహిళ ఎస్‌ఐ కాళ్లు పట్టుకొని ప్రాధేయపడింది. ఈ రోజు పరిష్కారం కాకపోతే మళ్లీ మీరు ఆందోళన చేసుకోవచ్చు, ఇప్పుడైతే కార్యాలయం వద్దకు వెళదామంటూ చెప్పి వార్ని అక్కడకు తీసుకువెళ్లారు. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో మహిళలు, వితంతువులు అసంతృప్తితో వెనుదిరిగి వెళ్లారు.