పింఛన్లను రూ.200కు పెంచింది వైఎస్, నేనే
తెలంగాణ ప్రజలను వంచిస్తున్న కేసీఆర్..
ఆయన హామీలకు రూ.2,600 లక్షలు కావాలే...
శాసనమండలి విపక్షనేత ధర్మపురి శ్రీనివాస్
నిజామాబాద్: తెలంగాణ రాష్ర్టంలో మొదటి సీఎంగా కేసీఆర్‌కు ప్రజలు పట్టం కడితే, ఆయన అలవి కాని హామీల తో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని శాసనమండలి విపక్షనేత ధర్మపురి శ్రీనివాస్ ఆరోపించారు. ఆయన ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే రూ.2,600 లక్షలు కావాలని, అయితే ప్రజలు మాత్రం మోసాల ను గ్రహిస్తున్నారన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, తాను కలిసి టీడీపీ ప్రభుత్వం అందించిన నెలకు రూ.70 పింఛన్‌ను రూ. 200కు పెంచామన్నారు. నిజామాబాద్‌లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట పింఛన్ల కోసం నిర్వహించిన ధర్నాలో డీఎస్ పాల్గొన్నారు. అర్హులైన వారందరికి ఆసరా అందించాలని కోరారు.
కేసీఆర్ నోట్లో నుంచి ‘నో’ అనే పదం రాదని, అన్నిం టికి ‘ఎస్’ అంటూ ఆచరణకు నోచుకోని హామీలు ఇస్తూ తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారన్నారు. ఆయన పరిస్థితి చూస్తుంటే ‘అడిగింది కాదనేది లేదు.. చేస్తా అన్నది చేసేది లేదు’ అన్నట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. అర్హులైన పేదలకు చెందిన పింఛన్లను తొలగించడం చాలా అన్యాయమని, గతంలో కంటే వికలాంగులు, వితంతువులు, వృద్ధాప్య ఫించన్లు గణనీయంగా తగ్గాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.