రోడ్డెక్కిన పండుటాకులు..
పరిగి: వారం రోజులుగా పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి వేసారిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సోమవారం పరిగిలో వికారాబాద్ రహదారిపై ధర్నాకు దిగారు. పింఛన్ ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ముందు పరిగి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట రాస్తారోకోకు దిగారు. వాహనాల రాకపోకలను అడ్డుకుంటూ సుమారు గంటపాటు ఆందోళన కొనసాగించారు. ఒకేసారి 600 మంది పింఛన్‌దారులు ఆందోళనలో పాల్గొన్నారు.
ఎస్‌ఐ శంషోద్దీన్ ఆందోళన వద్దకు చేరుకుని సముదాయించేందుకు ప్రయత్నించారు. అయినా పింఛన్‌దారులు శాంతించలేదు. ‘సీఎం డౌన్‌డౌన్, అధికారులు డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేశారు. పరిగితోపాటు అనుబంధ గ్రామాలైన కిష్టమ్మగుళ్లతండా, న్యామత్‌నగర్‌తండా, మల్లేమోనిగూడలకు చెందిన పింఛన్‌దారులు రాస్తారోకోలో పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
వారం రోజులుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని, సీఏస్పీ సైతం రోజుకోమాట చెబుతూ తిప్పుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ నాయకులు సైతం వారితోపాటు రోడ్డుపై బైఠాయించి సంఘీభావం తెలిపారు. అధికారులు, సీఏస్పీలతో మాట్లాడి పింఛన్లు ఇప్పించేందుకు కృషి చేస్తామని టీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.