పండుటాకుకు ఊరట
వృద్ధులైన పింఛన్‌దారులకు ఊరట కలిగింది. వేలిముద్రలు నమోదు చేసుకుంటేనే పింఛన్ అందుతుందని ఇటీవల కాలంలో నిబంధనలు పెట్టారు. దీంతో చేతిలో గీతలు అరిగిన పోయిన వృద్ధులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కానీ, ఇప్పుడు వారి ఆందోళనకు బ్రేక్ పడింది. వేలిముద్రలు లేకుండానే పింఛన్ డబ్బులు ఇవ్వనున్నారు.
పాలమూరు : ఆరు నెలలుగా పింఛన్ అందకపోవడంతో పండుటాకులు విలవిల్లాడుతున్నారు. వృద్ధాప్యంలో ధీమాగా బతికేందుకు ప్రభుత్వం తరఫున అందజేసే 500 కూడా రాక తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. ప్రతినెల మాదిరిగానే పింఛన్ల కోసం సంబంధిత పోస్టల్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిత్యావసరాలు, మందులకు ఉపయోగపడే పింఛన్ డబ్బుల కోసం అధికారులను ప్రాధేయపడుతున్నారు. సాంకేతికం పేరిట బయోమెట్రిక్ విధానంతో సామాజిక పింఛన్‌లను పంపిణీచేసే విధానం వారికి అవస్థను తెచ్చిపెట్టింది. జిల్లా వ్యాప్తంగా 2,53,904 మంది వృద్ధులకు పింఛన్ రావాల్సి ఉంటుంది.
అయితే ఇందులో దాదాపు 35వేల మంది వృద్ధులకు వేలిముద్రలు చెరిగిపోయి బయోమెట్రిక్‌లో వివరాలు నమోదు కాక.. సామాజిక పింఛన్‌లు పొందలేక పోతున్నారు. ఆరునెలలుగా ఈ విధానాన్ని మార్చాలని, తమ అవస్థను తీర్చాలన్న పండుటాకుల వేదనకు ఎట్టకేలకు ఊరట దక్కింది. గ్రామస్థాయి కమిటీల పర్యవేక్షణలో పింఛన్‌ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఆరునెలల నిరీక్షణకు తెరపడింది. చేతులు లేక.. చేతి వేలిముద్రలు చెరిగిపోయి బయోమెట్రిక్‌లో వివరాలు నమోదు కాక, సామాజిక పింఛన్లు అందుకోలేక లబ్ధిదారులు పడుతున్న అవస్థలను ప్రభుత్వం ఎట్టకేలకు గుర్తించింది. ఓ కమిటీని ఏర్పాటు చేసి వారి సమక్షంలో ప్రతినెలా పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది.
గ్రామ స్థాయిలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఇద్దరు విలేజ్ ఆర్గనైజర్లతో కమిటీ, పట్టణ, నగర స్థాయిల్లో కౌన్సిలర్/కార్పొరేటర్, బిల్ కలెక్టర్, ఐకేపీ అర్బన్ సిబ్బంది ఇద్దరితో కమిటీ ఏర్పాటు చేసి వారి సమక్షంలో లబ్ధిదారుల కుటుంబాలకు పింఛన్లు అందించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా 35వేల మంది వృద్ధులకు ఆరు నెలల పింఛన్లు అందనున్నాయి. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సామాజిక పింఛన్‌లలో జిల్లాలో 2,53,904 మంది వృద్ధులకు, 1,34,293 మంది వితంతువులు, 47,063 మంది వికలాంగులు, 14,788 మంది చేనేత, 1,441మంది గీత కార్మిక, 20,887 మంది అభయ హస్తం పింఛన్‌లున్నాయి. జిల్లాలో మొత్తంగా సామాజిక పింఛన్‌దారులు 4,72,376 మంది ఉన్నారు.
అభయహస్తం, వికలాంగులకు ప్రతినెలా 500, మిగతావారికి 200 చొప్పున ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. గతంలో కుష్టువ్యాధిగ్రస్తులు, చేతులు లేని వికలాంగులు, వృద్ధాప్యంతో చేతి ముద్రలు చెరిగిపోయిన వారు బయో మెట్రిక్‌లో నమోదు చేయించుకోలేకపోయారు. ఇలాంటివారు 35వేల మంది వరకు ఉన్నారు. వీరికి ఆరు నెలలుగా పింఛన్లు నిలిచిపోయాయి. క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లగా స్పందించిన ప్రభుత్వం గ్రామస్థాయిలో కమిటీలు వేసి సభ్యుల సమక్షంతో పింఛన్లు ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల నుంచి గ్రామసభలు నిర్వహించి అర్హులందరికీ పింఛన్లు అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.