అభయహస్తం ఏది?
-
ఏడు నెలలుగా అందని పింఛన్
-
ఆందోళనలో లబ్ధిదారులు
కోనరావుపేట : స్వశక్తి మహిళలకు సాధికారత కల్పించాలనే ఉద్దేశ్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ‘అభయహస్తం’ పథకానికి నిధులు కరువయ్యాయి. 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఈ పథకం ద్వారా అందించే పింఛన్లు ఏడు నెలలుగా నిలిచిపోయాయి. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
వైఎస్సార్ అభయహస్తం లబ్ధిదారులు జిల్లాలో 44,219 మంది ఉండగా కోనరావుపేట మండలంలో 5,538 మంది చేరారు. ఇందులో 812 మంది 60 ఏళ్లు పైబడిన పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ.500 ల పింఛన్ అందిస్తున్నారు. ఈ సంవత్సరం జనవరికి సంబంధించిన పింఛన్ మాత్రమే ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛన్ అందలేదు.
రోజుకు రూ.1
స్వయం సహాయక సంఘాల్లోని నిరుపేద మహిళలకు వైఎస్సార్ అభయహస్తం పథకం ద్వారా పలు రకాలుగా లబ్ధి చేకూరుతోంది. 18–59 ఏళ్లలోపు మహిళలు ఈ పథకంలో చేరవచ్చు. వీరి రోజుకు రూ.1 చొప్పున ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే, ప్రభుత్వం నుంచి మరో రూ.365 జమ చేసి జనశ్రీ భీమా యోజన పథకంలో లబ్ధిదారులుగా చేరుస్తారు. 60 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.500 చెల్లిస్తారు. సభ్యురాలి ఇద్దరు పిల్లలకు ఏడాదికి రూ.1200ల చొప్పున ఉపకారవేతనాలు (9 నుంచి 12వ తరగతి వరకు) అందజేస్తారు. దురదృష్టవశాత్తు వారు మృతి చెందితే బీమా కంపెనీ ద్వారా రూ.30వేలు, ప్రమాదవశాత్తు మర ణిస్తే రూ.75 వేలు, అంగవైకల్యం పొందితే రూ.37,500 చొప్పున పరిహారం అందిస్తారు.
ఇబ్బందిగా మారిన ‘ఆసరా’ పింఛన్
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ అభయహస్తం లబ్ధిదారులకు ఇబ్బందికరంగా మారింది. రూ.3,800ల కంట్రిబ్యూషన్ కట్టిన మహిళలకు 60 ఏళ్లు నిండగానే రూ.500 పింఛన్ పొందుతుండగా, 65 ఏళ్లు నిండిన వారు ఎలాంటి డబ్బులు కట్టకుండానే ఆసరా పింఛన్ ద్వారా రూ.వెయ్యి ప్రభుత్వం ఇస్తుండడంతో వీరు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. పైగా ఆసరా పింఛన్ ప్రతి నెలా ఠంచన్‌గా వస్తుండడం, అభయహస్తం పింఛన్ మూడు, ఆరు నెలలకోసారి వస్తుండడం ఇబ్బందిగా మారుతోంది. తమకు అందించే పింఛన్‌ను కూడా రూ.వెయ్యికి పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఏడు నెలలుగా అస్తలేదు
నేను అభయహస్తం పథకంలో లబ్ధిదారురాలిగా చేరాను. మాకెప్పుడు కూడా ప్రతినెలా పింఛన్ రాలేదు. గతంలో మూడు నెలలకోసారి ఇచ్చేవారు. ఇప్పుడు ఆరు నెలలు గడుస్తున్నా పింఛన్ రాలేదు. మాకిచ్చే పింఛన్‌ను కూడా పెంచితే బాగుంటుంది.
– అండెం లచ్చవ్వ, కనగర్తి
ఎదురుచూసుడే
అభయహస్తం ద్వారా మాకు ఇచ్చేదే ఐదొందలు. వృద్ధాప్యంలో అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నం. ఈ డబ్బులు మందులకూ సరిపోతలేవు. ఏడు నెలలుగా రాకపోతే ఎట్లా బతికేది. మా పింఛన్లపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు.
–ధీటి భూదవ్వ, వట్టిమల్ల