పరిగి, న్యూస్‌లైన్: మీ పేరుమీద డబ్బులు రాలేదంటున్నారు.. నెలనెలా పింఛన్ ఇచ్చేటోళ్లు. ఎందుకు రాలేదని అడిగితే.. డేటా ఎంట్రీ చేయలేదని ఒకరు, రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని మరొకరు, మీరు ఫొటోలు దిగాల్సి ఉందని ఇంకొకరు సమాధానం చెబుతున్నారు. ఇన్నాళ్లూ వచ్చిన పింఛన్లు ఇప్పుడే ఎందుకు ఆగిపోయాయో ఏ అధికారీ చెప్పడం లేదు. నెలనెలా వచ్చే కొద్దిపాటి పింఛన్ డబ్బులతోనే వృద్ధులు మందులు కొనుక్కోవడంతోపాటు చిన్నచిన్న అవసరాలు తీర్చుకుంటారు.
అవి రెండు నెలల నుంచి అందకపోవడంతో విలవిల్లాడుతున్నారు. మండల కేంద్రంలో దగ్గర ఉన్న వాళ్లు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వృద్ధులు గ్రామ పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కానీ వారికి సరైన సమాధానం చెప్పేవారే లేరు. వికలాంగులు, వితంతు పింఛన్లు కూడా నిలిచిపోయాయి. నిన్నమొన్నటి వరకు ఎలక్షన్లలో మునిగిపోయిన యంత్రాంగం అవి పూర్తయ్యాక కూడా పింఛన్‌దారులను పట్టించుకోవడం లేదు.
రిజిస్ట్రేషన్ చేయించుకోవాలట..
రెండు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వృద్ధులకు ఏ సమాచారం ఇవ్వని అధికారులు ఇటీవల కొత్త విషయాన్ని చెబుతున్నారు. పింఛన్లు ఆగిపోయిన వారంతా మరోమారు గ్రామంలోనే ఫొటోలు దిగాలని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సెలవిస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని వృద్ధులు, వికలాంగులు, ఇతర పింఛన్‌దారులు గ్రామ పంచాయతీల వద్ద ఫొటోలు దిగేందుకు పడిగాపులు కాస్తున్నారు. కానీ ఏ ఒక్క గ్రామంలో కూడా ఫొటోలు దించేందుకు అధికారులు ఎటువంటి ఏర్పాట్లూ చేయలేదు. సొంతంగా ఫొటోలు దిగి ఇవ్వాలా.. లేక అధికారుల తరఫున ఎవరైనా వచ్చి తీస్తారా.. అనే విషయంపైనా అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక పింఛన్‌దారులు తహశీల్దార్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వచ్చినవారికి వచ్చినట్టు.. ‘మీరు ఫొటోలు దిగితేనే డబ్బులు’ అని చెప్పి పంపిస్తున్నారు అధికారులు. కానీ ఫొటోలు తీసేవారిని మాత్రం ఏర్పాటు చేయడం లేదు.
మూడో నెల పింఛన్ రాకుంటే.. అంతే!
ఇప్పటికే పింఛన్ అందక రెండు నెలలైంది. నిబంధనల ప్రకారం వరుసగా మూడు నెలలు పింఛన్ ఇవ్వకపోయినా, తీసుకోకపోయినా ‘పర్మినెంట్ మైగ్రేటెడ్’గా గుర్తించి పింఛన్ రద్దు చేస్తారు. రద్దయిన వారికి మళ్లీ పింఛన్ రావాలంటే అదో పెద్ద తంతు. ఇప్పటికే పరిగి మండలంలోని ఏ గ్రామంలో కూడా పింఛన్లు 100 శాతం ఇవ్వడం లేదు. పరిగి పట్టణ విషయానికొస్తే 1,600 పింఛన్లు ఉండగా ఇప్పుడు కేవలం 500 మందికి సంబంధించిన వివరాలు రిజిస్ట్రేషన్‌చేసి పింఛన్లు ఇస్తున్నారు. మిగిలిన 1,100 మంది లబ్ధిదారులకు కూడా వచ్చే నెల నుంచి పింఛన్లు ఇవ్వాలంటే మరో రెండు రోజుల్లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఎంత త్వరితంగా వివరాల నమోదు ప్రక్రియను కొనసాగించినా 100 నుంచి 150 మంది పేర్లను ఎంట్రీ చేయగలరు. మిగిలిన వారి పరిస్థితి ఏంటన్నదే ప్రశ్న. వారందరి పింఛన్లు రద్దవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
నిత్యం నిరీక్షణే!
Published Thu, May 22 2014 12:12 AM | Last Updated on Sat, Aug 25 2018 4:08 PM
Advertisement