మంచిమాట
‘‘పండుటాకులము మిగిలితిమి.. ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి’’ అని భర్త పదవీ విరమణ రోజు భార్య పాడుతున్నట్లుగా ఓ సినీ గీతిక సాగుతుంది. పాటలోని భావమూ మనకు భారంగా అనిపిస్తుంది, కానీ ప్రస్తుత ప్రపంచ ధోరణికి ఆ వాక్యాలు సరిపోవని అనిపిస్తుంది. వృద్ధులు పండుటాకులు కాదు.
అనుభవంతో మన ముందు నిలిచే నిండైన అమృత భాండాలు.
ప్రతి మనిషి జీవిత దశని రెండు ప్రధాన అంగాలుగా విభజించుకోవచ్చు. మొదటిది ఉద్యోగబాధ్యతలు నిర్వర్తిస్తూ భార్యాబిడ్డలతో కాలాన్ని గడపడం. రెండోది.. బాధ్యతలను పూర్తిచేసి, ఉద్యోగవిరమణ తర్వాత లేదా ఆరు పదులు నిండాక గడిపే కాలం. వీటిలో మొదటి దశకే ప్రాధాన్యం ఉందని, రెండో దశ పనికిరానిదని భావించడం ఏమాత్రం సమంజసం కాదు.
ప్రతి జీవన దశలోనూ మనిషికి ప్రత్యేకమైన విషయాలపై శ్రద్ధ కనబరచవలసి ఉంటుంది. అదే విధంగా వృద్ధాప్యంలోనూ కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే, మలిసంజెలో వెల్లివిరిసే కాంతులు వారికి మనోహరంగానే అగుపిస్తాయి.
యవ్వనంలో పటుత్వం, బిగువు జీవులకు సహజ గుణం. వయసు పెరుగుతున్న కొద్దీ బిగువు సడలుతూ ఉంటుంది. అది శరీరానికుండే సహజ లక్షణం. గడచిపోయిన కాలం ఒక అనుభవాల సుమహారంలా పరిమళిస్తూ ఉంటుంది. ఎంతో విలువైన అనుభవాలు, అవి నేర్పిన పాఠాలను యువతరానికి నేర్పడాన్ని మించిన ఆనందం ఏముంటుంది? ప్రతి అనుభవం ఎంతో విలువైనది.
ఎన్నో కష్టాలను, దుఃఖాలను దాటుకుని తెచ్చుకున్న విజయాలను పంచుకుని భావితరాలను తీర్చిదిద్దగలిగింది విశ్రాంత జీవనం గడిపి మలి సంజలో కాలం గడిపే అనుభవ సంపన్నులే. వారి అనుభవాల చేవను ఏ వ్యక్తిత్వ వికాస గ్రంథాలూ అందించలేవు. అనుభవైక వేద్యమైన వారి జీవనగమనాన్ని కొడుకులతో, మనవళ్ళతో పంచుకుంటూ గడపడం ఆహ్లాదకరమైన విషయం.
దేశంలోని, ప్రపంచంలోని రకరకాల ప్రదేశాలు చూసే అవకాశం కేవలం విశ్రాంత జీవనంలోనే ఎవరికైనా సాధ్యమవుతుంది. ఉద్యోగంలో లేదా వేరే వ్యాపకంలో ఉండే పని ఒత్తిడివల్ల కొత్త ప్రదేశాలు చూసే సౌలభ్యం తక్కువగానే ఉంటుంది. ఆ విధంగా కొత్త కొత్తవిహారాల్లో సందర్శించే ప్రదేశాలు, అక్కడి వారి ఆహారపు అలవాట్లు, ప్రత్యేకమైన అభిరుచులు తిలకించి ఆనందం పొందడం ద్వారా వృద్ధుల మనసు మరింతగా ఉత్తేజితమవుతుంది. మరింతగా వాళ్ళను చిన్నవాళ్ళను చేసి ఆనంద సంభరితుల్ని చేస్తుందనడం అతిశయోక్తి కాదు.
వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే. మదిలో మెదిలే భావాలకు అనుగుణంగా మన జీవన నావ సాగుతూ ఉంటుంది. నేను ఎన్నటికీ నవ యువకుడినే అన్న భావం మదిలో నింపుకుంటే ఆనందం సముద్ర తరంగాల్లా ఉరకలు వేస్తూనే ఉంటుంది. మనం సాధించిన విజయాలూ మన జ్ఞాపకాల పందిరిలోంచి పరిమళించే మల్లికల్లా తొంగి చూస్తూ ఉత్సాహానికి ఊపిరులూదుతూనే ఉంటాయి.
వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి
వృద్ధాప్యం శాపం కాదు... ఆస్వాదిస్తే అణువణువూ ఆనందమే! ప్రతి జీవీ తమ జీవితంలో వృద్ధాప్యాన్ని ఎదుర్కొనక తప్పదు. అయితే ఈ వృద్ధాప్యాన్ని శాపంగా కాకుండా వరంగా భావించి ఆస్వాదిస్తే వృద్ధాప్యంలో కూడా హాయిగా సమయాన్ని అనుభవించవచ్చు. వృద్ధాప్యాన్ని బాధామయమని భావించకుండా, మన కోసం మనం జీవించే అద్భుత అవకాశంగా భావించిన నాడు వృద్ధాప్యం ఏమాత్రం బాధించదు. పెద్దవయసులో గుర్తుపెట్టుకోవలసింది మన వయసును కాదు.. గడిపే ప్రతి క్షణం తీసుకువచ్చే ఆనందాన్ని మాత్రమే..!!
యవ్వనం కొంగ్రొత్త భోగాల సారం.. వృద్ధాప్యం అనుభవాల మణిహారం..!!
Comments
Please login to add a commentAdd a comment