
ఐటీ కంపెనీలు ఎప్పటికప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నించేవి. అయితే ఇప్పుడు ఐటీ రంగంలో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే.. పలు టెక్ కంపెనీలు బెంచ్ టైమ్, నెంబర్ తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఐటీ కంపెనీలలో ప్రాజెక్టులు కేటాయించని ఉద్యోగులను 'బెంచింగ్' అంటారు. వీరిని సంస్థలు బ్యాకప్ మాదిరిగా ఉపయోగించుకుంటాయి. వీరు ఎక్కువ రోజులు బెంచింగ్ మీద ఉంటే.. వారు లేఆఫ్స్‌కు దగ్గర ఉన్నట్లు. నిజానికి కొత్తగా ఉద్యోగంలో చేరినవారిని కొంతకాలం బెంచ్‌పై కూర్చోబెడతారు. కొన్ని సార్లు అనుభవజ్ఞులైన ఉద్యోగులు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఏడాదిన్నర కాలంగా బెంచ్ సమయం మారుతోంది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో బెంచ్ టైమ్ 45 నుంచి 60 రోజులు ఉండేది. దీనిని ప్రస్తుతం 35 నుంచి 45 రోజులకు తగ్గించారు. దీంతో బెంచ్‌పై ఉన్న ఉద్యోగుల సంఖ్య, సమయం రెండూ తగ్గాయి. ఇది ఐటీ ఉద్యోగులకు పెద్ద ఊరట అనే చెప్పాలి.
భారతదేశంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, అసెంచర్, హెచ్‌సీఎల్ వంటి దిగ్గజ కంపెనీలు.. బెంచ్‌పై ఉన్న ఉద్యోగుల సంఖ్యను, బెంచ్‌పై ఉండే సమయాన్ని తగ్గించాయి. దీనికి కారణం గత కొన్ని రోజులుగా కొత్త ఉద్యోగులను తీసుకోకపోవడమే అని తెలుస్తోంది. కరోనా తరువాత లెక్కకు మించిన ప్రాజెక్టులు లభిస్తున్నాయి. దీంతో ఐటీ కంపెనీలోని ఉద్యోగులకు చేతి నిండా పని దొరుకుతోంది. కొన్ని కంపెనీలు ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టాయి.
ఇదీ చదవండి: మీడియా దిగ్గజం కీలక నిర్ణయం.. 1100 మందిపై వేటు..
రెండేళ్లకు ముందు బెంచ్ ఉద్యోగులు 10 నుంచి 15 శాతం ఉండేది. ఇప్పుడు ఈ శాతం 2 నుంచి 5 శాతానికి చేరింది. ఒకప్పుడు ఫ్రెషర్స్ మాత్రమే బెంచ్‌పై ఉండేవాళ్ళు. ఇప్పుడు కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్‌కి సంబంధించిన ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల.. ప్రస్తుతం, తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగులు కూడా బెంచ్ లేఆఫ్‌ల ప్రమాదంలో ఉన్నారు. వీరందరూ కొత్త టెక్నాలజీలను తప్పకుండా నేర్చుకోవాల్సిందే. లేకుంటే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది.