Google: ఉద్యోగులను వదిలించుకునేందుకు ఇన్ని వేల కోట్లా? | Sakshi
Sakshi News home page

Google: ఉద్యోగులను వదిలించుకునేందుకు ఇన్ని వేల కోట్లా?

Published Wed, Jan 31 2024 4:48 PM

how much money Google has spent on laying off employees - Sakshi

సాధారణంగా ఖర్చును తగ్గించుకునేందుకు కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో ఉద్యోగులను తొలిగిస్తున్నాయి. అయితే ఉద్యోగులను వదిలించుకోవడానికి కంపెనీలు వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నాయని చేస్తున్నాయని మీకు తెలుసా? అవును నిజమే.. లేఆఫ్‌ల కోసం టెక్‌ దిగ్గజం గూగుల్‌ చేసిన ఖర్చు వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఇవి చూస్తే అవాక్కవుతారు..!

రూ.17 వేల కోట్లు
గూగుల్‌ యాజమాన్య సంస్థ ఆల్భాబెట్‌ వెల్లడించిన తాజా త్రైమాసిక ఫలితాల ప్రకారం.. తొలగించిన  ఉద్యోగులకు సీవెరన్స్‌ (తొలగింపు పరిహారం), సంబంధిత ఇతర చెల్లింపుల  కింద గూగుల్‌ చెల్లించిన మొత్తం 2.1 బిలియన్‌ డాలర్లు ( దాదాపు రూ.17 వేల కోట్లు) . ఇది కేవలం 2023 ఒక్క ఏడాదిలో చేపట్టిన లేఆఫ్‌లకు అయిన ఖర్చు మాత్రమే.

గూగుల్‌ 2023 జనవరిలో ప్రకటించిన మొదటి రౌండ్‌  లేఆఫ్‌లలో దాదాపు 12 వేల మందిని అంటే తమ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 6 శాతం మందిని తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భయాలను ఈ తొలగింపులు తెలియజేయడమే కాకుండా టెక్‌ పరిశ్రమను ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేశాయి. తొలగించిన ఉద్యోగులకు చెల్లించేందుకు గూగుల్‌ 2.1 బిలియన్‌ డాలర్లు.. దాని నికర ఆదాయంలో 7 శాతం వరకూ ఖర్చు చేసినట్లు తాజా వెల్లడి ద్వారా తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపులకే ఈ స్థాయిలో ఖర్చయితే ఆ ఉద్యోగులను కొనసాగిస్తే ఎంత ఖర్చయ్యేదో అంచనా వేయొచ్చు.

2024లోనూ..
గూగుల్‌ 2024లోనూ ఇప్పటికే 1000 ఉద్యోగాల తొలగింపును ప్రకటించింది. దీని కోసం 700 మిలియన్‌ డాలర్లు (రూ.5,800 కోట్లు ) ఖర్చు చేసింది. ఈ ఏడాదిలో లేఆఫ్‌లు ఇంకా కొనసాగుతాయని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ఇదివరకే సూచనలు ఇచ్చారు. అయితే గతేడాదిలో ఉన్నంత తొలగింపులయితే ఈ ఏడాదిలో ఉండకపోవచ్చు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement