
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌పై ఆ కంపెనీ ఉద్యోగులు అసంతృప్తి, ఆగ్రహాలతో రగిలిపోతున్నారు. ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ ఇటీవల ప్రకటించిన లేఆఫ్‌ల్లో సుమారు 15,000 మందిని తొలగించింది. ఈ తొలగింపులను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.
ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ జనవరి 18న యునైటెడ్ స్టేట్స్‌లోని ఐదు గూగుల్ క్యాంపస్‌లలో నిరసన ప్రదర్శనలను నిర్వహించింది. తొలగింపులను సమర్థించుకోవడానికి కంపెనీ చెబుతున్న కారణాలను బోగస్‌గా పేర్కొంటూ వాటిని సవాలు చేయడం ఈ నిరసనల లక్ష్యం అని బిజినెస్ ఇన్‌సైడర్ నివేదించింది.
అసంతృప్త ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్.. గత సంవత్సరంలో తొలగింపుల వల్ల దాదాపు 15,000 మంది ఉద్యోగులపై ప్రభావం పడినట్లు వెల్లడించింది. ఇదే జనవరి 18న యూఎస్ అంతటా ఐదు గూగుల్ క్యాంపస్‌లలో నిరసనలు చేపట్టేందుకు యూనియన్‌ను ప్రేరేపించింది.
లేఆఫ్‌ల కారణంగా కొంతమంది జాబ్స్ పోవడమే కాకుండా ఉన్న ఉద్యోగులపై ప్రభావం గురించి సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ కమ్యూనికేషన్‌కు నాయకత్వం వహించే స్టీఫెన్ మెక్‌ముర్ట్రీ ఆందోళన వ్యక్తం చేశారు. లేఆఫ్‌లు ఉద్యోగులపై పనిభారాన్ని పెంచడమే కాకుండా విస్తృతమైన ఆందోళనను కలిగిస్తున్నాయన్నారు.
పెరుగుతున్న విమర్శలకు గూగుల్ ప్రతిస్పందిస్తూ తమ చర్యలు "కంపెనీ అతిపెద్ద ప్రాధాన్యతలు, రాబోయే ముఖ్యమైన అవకాశాలలో బాధ్యతాయుతంగా పెట్టుబడి పెట్టడం"లో భాగమని పేర్కొంది. సంస్థాగత మార్పులలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని తొలగింపులు ఉన్నట్లు చెబుతోంది. కంపెనీ లోపల, వెలుపల కొత్త ఉద్యోగాలు పొందడంలో బాధిత ఉద్యోగులకు సహాయం చేయడానికి నిబద్ధతతో ఉన్నట్లు గూగుల్ పేర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment