కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగులపై లేఆఫ్స్ కత్తి వేలాడుతోంది. 2024లో అడుగుపెట్టామో లేదో తొలి వారంలోనే ఈ ఏడాదీ లేఆఫ్స్ తప్పవనే స్పష్టమైన సంకేతాలు ఇస్తూ గూగుల్, అమెజాన్, మెటా సహా పలు దిగ్గజ కంపెనీలు కొలువుల కోతకు తెగబడ్డాయి. ఈ తరుణంలో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వారం వ్యవధిలో మరోసారి ఉద్యోగులకు భారీ షాకిచ్చింది.
వారం రోజుల క్రితం అమెజాన్ తన పేరెంట్ కంపెనీలు ట్విచ్, ఆడిబుల్‌లో ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వారం తిరిగే లోపే అమెజాన్‌లో ‘బై విత్ ప్రైమ్’ విభాగంలో పనిచేస్తున్న 5 శాతం మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజా తొలగింపుల కారణంగా 30 మంది ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది.
ఓ వైపు తొలగింపులు.. మరోవైపు పెట్టుబడులు
2022లో బై విత్ ప్రైమ్‌ను అమెజాన్ ప్రారంభించింది. అమెజాన్ వ్యాపారులు, రిటైలర్లకు దాని లాజిస్టిక్స్ నెట్వర్క్ ద్వారా డెలివరీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యూనిట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, బై విత్ ప్రైమ్‌లో పెట్టుబడులు పెడుతుంటామని చెబుతూనే లేఆఫ్స్‌పై అమెజాన్ ప్రకటన చేసింది.
సిబ్బందిని ఆదుకుంటాం
తొలగించిన సిబ్బందిని అన్ని విధాల ఆదుకుంటామని అమెజాన్ తెలిపింది. కాగా, అమెజాన్ ఇప్పటికే తన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ట్విచ్‌లో సుమారు 500 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. ఆడియోబుక్ యూనిట్ ఆడిబుల్ కూడా ఈ ఏడాది మొదటి రెండు వారాల్లోనే వందలాది ఉద్యోగాలకు ఉద్వాసన పలికింది. ఈ తొలగింపులు వ్యయ తగ్గింపు చర్యల్లో భాగమా లేక ఏఐ పునర్నిర్మాణం వల్ల జరిగిందా అనేది ఇంకా స్పష్టం కాలేదు.
ఉద్యోగుల్ని నిండా ముంచుతున్న ఏఐ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల 2024 జనవరి మొదటి మూడు వారాల్లోనే బడా టెక్ కంపెనీలు 7500 ఉద్యోగాలను తొలగించాయని లేఆఫ్స్.ఎఫ్వైఐ తాజా నివేదిక వెల్లడించింది.
మరింత మందిని తొలగిస్తూ గూగుల్ ప్రకటన
గూగుల్ తన వాయిస్ అసిస్టెంట్, హార్డ్వేర్ విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించిన వెంటనే సంస్థలో మరో వరుస ఉద్యోగాల కోత ఉంటుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గురువారం ప్రకటించారు. కాగా, గత ఏడాది గూగుల్ పలు విభాగాల్లో 12,000 మందికి పైగా ఉద్యోగాలను తొలగించింది. ఫలితంగా గూగుల్‌లో భారీ మొత్తంలో తొలగించడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment