benches
-
బెంచింగ్ డేటింగ్ గురించి తెలుసా, ఇలా అయితే డేంజరే!
డేటింగ్ అనేది సక్రమ మార్గంలో వాడుకుంటే మంచిదే. ఒకర్నొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరి అభిరుచులు మరొకరికి తెలియడానికి, ఇద్దరి మధ్యా మంచి సాంగత్యానికి ఉపయోపడుతుంది. కానీ ప్రస్తుత సాంకేతిక యుగం, సోషల్ మీడియా విశృంఖలత్వంతోపాటు, డేటింగ్ యాప్‌లు ఈ అర్థాన్ని మార్చి పారేశాయి.హానికరమైన, విషపూరితమైన సంబంధాలకు నాంది పలుకుతూ కొత్త డేటింగ్ ట్రెండ్లు ఉద్భవించాయి. అలాంటి వాటిల్లో ఒకటి బెంచింగ్ డేటింగ్. అసలేంటి బెంచింగ్ డేటింగ్? దీనివలన లాభమా? నష్టమా? తెలుసుకుందాం ఈ కథనంలో.ఆధునిక డేటింగ్ పదం బెంచింగ్ డేటింగ్. అంటే పేరుకు తగ్గట్టే భాగస్వాముల్లో ఒకర్ని హోల్డ్‌లో ఉంచి, మరొకరిపై ఆసక్తిగా ఉండటం. ప్రేమ భాగస్వామిని 'బెంచ్ మీద' ఉంచడం అంటే మరో బెస్ట్ ఆప్షన్ కోసం అన్వేషించడమే. అచ్చం ఒక ఆటగాడిని బెంచి మీద ఉంచడం లాంటిదన్నమాట. అంటే మెయిన్ టీంలో లేకుండా, ఆటలో పాల్గొనకుండా,సందర్భం కోసం వాడుకునేందుకు బెంచ్ మీద ఉండే ప్లేయర్ లాంటి వారు. ఈ డేటింగ్లో బెంచింగ్ చేస్తున్న వారు, తోటి భాగస్వామితో స్నేహం చేస్తారు కానీ మనస్సు పూర్తిగా పూర్తిగా సంబంధానికి కట్టుబడి ఉండరు. అలాగే ఈ డేటింగ్లో బెంచ్‌మార్కింగ్" అంటే ఎవరైనా తమ ప్రస్తుత భాగస్వామితో, గతంలోని వారితో పోల్చపుడు, నెగెటివ్‌గా కమెంట్ చేయడం లాంటివి కూడా ఉంటాయి. అంతిమంగా ఇది రెండో వ్యక్తిలో (బెంచ్‌మీద ఉన్న) గందరగోళానికి మానసిక వేదనకు గురి చేస్తుంది. నిజాయితీ, నిబద్ధత లోపించడంతో అవతలి వారిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఒకరిమీద ఒకరికి విశ్వాసం, నమ్మకం లేనపుడు ఇక ప్రేమకు తావు ఎక్కడ ఉంటుంది. మోసపోయామన్న నిరాశ, నిస్పృహతోపాటు కొన్ని అనారోగ్యకరమైన, పెడధోరణులకు దారి తీయవచ్చు.బెంచ్‌మార్కింగ్ సంకేతాలుప్రస్తుత భాగస్వామిని మాజీలు లేదా గత సంబంధాలతో క్రమం తప్పకుండా పోల్చడం.అవాస్తవిక అంచనాలతో ఉండటం, వాళ్లు చెప్పినట్టే వినాలని అన్యాయంగా పట్టుబట్టటంఎపుడూ అసంతృప్తిగా ఉండటం, మరొకరితో పోల్చి, ఉద్దేశపూర్వకంగా అవమానించడం.నమ్మకం లేకపోవడం, ఎపుడూ విమర్శిస్తూ ఉండటం తమ రిలేషన్‌ను మరింత ఆరోగ్యకరంగా ముందుకు తీసుకెళ్లేందుకు సుతరామూ అంగీకరించకపోవడంఇదీ చదవండి : భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా! జాగ్రత్తలుపైన పేర్కొన్న అనుమానాస్పద లక్షణాలు కనిపించినపుడు అప్రమత్తం కావడం మంచిది. వీటిని గమనించి నపుడు అపార్థాలకు, అపోహలకు తావులేకుండా భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకొని, బంధం ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. లేదా గతాన్ని వదిలేసి, బలమైన, ఆరోగ్యకరమైన సంబంధాలపై దృష్టి పెట్టడం ఉత్తమం. సిమ్మర్ డేటింగ్ఒకపుడు ద్దలు కుదుర్చుకునే పెళ్లిళ్లకే ప్రాధాన్యత ఉండేది. కాల క్రమంలో ప్రేమ వివాహాలపై యువతకు ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సిమ్మర్ డేటింగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రధానంగా జనరేషన్ జెడ్ దీనిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అసలు ఈ సిమ్మర్ డేటింగ్ అంటే ఏమిటి? సుదీర్ఘ సంబంధాలపై దృష్టి పెట్టడమే దీని ప్రత్యేకత. చాలా కాలంపాటు బంధంలో కొనసాగడం వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుందట. ఒకరిపై ఒకరికి అవగాహన, నమ్మకం పెరిగిన తరువాత లైంగిక బంధంలోకి అడుగుపెట్టడం మంచిదని, తద్వారా బంధం బలపడుతుందని నేటియువత భావిస్తోంది. -
ఎవరి ఆలోచనో అది!..'స్నేహితుల బెంచ్'
నిన్న మా మనవడిని పాఠశాలలో దింపడానికి వెళ్ళాను చాలా రోజుల తరువాత. వాడిప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. నాకు ఆ పాఠశాల ఆవరణలో రంగురంగుల బెంచ్ ఒకటి కనిపించింది. నేను మా మనవడిని అడిగాను నవ్వుతూ "ఎరా , మీ స్కూల్లో ఇదొక్కేటేనా బెంచి కూర్చోవడానికి" "కాదు తాతగారు, ఆ బెంచ్ 'స్నేహితుల బెంచి' అన్నాడు నా మనవడు నాతో. నేను ఆశ్చర్యంగా "అంటే ఏమిట్రా ? " నా మనవడు చిరునవ్వుతో అన్నాడు "తాతాగారు, పిల్లలు కొత్తగా చేరినప్పుడు లేదా ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే ఆడుకోవడానికి ఎవరూ లేనప్పుడు ఆ బెంచి మీద కూర్చుంటారు. అలా ఒంటరిగా ఉన్న అబ్బాయిని చూసి, వాళ్ళతో జతకట్టడానికి, స్నేహం చెయ్యడానికి, ఆడుకోవడానికి , ఎవరో ఒకరు వచ్చి కూర్చుని స్నేహం చేస్తారు" అన్నాడు. నేను మనసులో ఎంత అద్భుతమైన ఆలోచన ఎవరిదో కానీ అనుకుని , మావాడిని అడిగాను "ఒరే, నువ్వెప్పుడన్నా ఆ బెంచి మీద కూర్చున్నావా?" "కూర్చున్నాను తాతగారు, నేను ఈ స్కూల్లో కొత్తగా చేరినప్పుడు, నాకు ఎవరూ పరిచయం లేనప్పుడు" అన్నాడు నాతో నెమ్మదిగా, ఎదో గుర్తు చేసుకుంటున్నట్టు. "నేను ఆ బెంచి మీద కూర్చున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి పరిచయం చేసుకుని నాతో అడుకున్నాడు. మేమిద్దరం అప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని, నాకెప్పుడైనా ఎవరైనా ఆ బెంచి మీద కూర్చుని ఒంటరిగా కనిపిస్తే నేను వెళ్లి వాళ్ళతో కబుర్లు చెప్పి, వాళ్ళతో అడుకుంటాను తాతగారు" అన్నాడు . ఓ నిముషం ఆగి "ఆ బెంచ్ మీద కూర్చున్న వాళ్లు మూడో నాలుగో తరగతి పిల్లలైనా కూర్చుని వాళ్ళతో కబుర్లు చెప్తే బావుంటుంది తాతయ్య, వాళ్లెప్పుడు కనిపించినా అన్నయ్యా అంటూ నా దగ్గరకు పరుగెత్తుకువచ్చి పలకరిస్తారు" తరువాత వాడు వాడి క్లాస్ రూంలోకి వెళ్ళిపోయాడు. నాకెందుకో కొద్దిసేపు ఆ బెంచి మీద కూర్చోవాలి అనిపించి వెళ్లి కూర్చున్నాను. నా మనసు నా చిన్ననాటి రోజుల్లో నేను మొదటిసారి స్కూల్ కు వెళ్లడం గుర్తుకువచ్చింది. నేను స్కూల్లో చేరినప్పుడు నాకు స్నేహితులు ఎవరూ లేరు, ఎలా పరిచయాలు చేసుకోవాలో అన్న బిడియం ఒకటి. నేను చేరిన కొత్తలో మా టీచర్ పిల్లందరిని క్లాస్ ఉన్న ఎవరో ఒకరికి ఒక బొమ్మ గీసి ఇమ్మంది. అందరూ ఎదో ఒకటి గీసి వాళ్ళ వాళ్ళ స్నేహితులకిచ్చుకున్నారు. నాకు ఎవరూ ఇవ్వలేదు నేనూ ఎవరికి ఇవ్వలేదు. ఆ రోజు నాకు ఎంత ఏకాంతంగా అనిపించిందో నాకు బాగా గుర్తు. ఎంతో బెంగగా అనిపించింది స్నేహితులు లేకపోవడం అప్పుడు. ఆ రంగుల బెంచి మీద కూర్చుంటే నాకెంతో ఆనందమేసింది. ఎవరి ఆలోచనో కానీ కొత్తగా చేరిన పిల్లలు ఆడుకోవడానికి , జీవితాంతం చక్కటి స్నేహితులని సంపాదించుకోవడానికి చక్కటి దారి అనిపించింది. నెమ్మదిగా ఆ బెంచి మీద నుంచి లేచి బయటకు నడుస్తూ అనుకున్నాను నేను రోజూ ఉదయాన్నే నడిచే పార్కులో నలుగురు పెద్దవాళ్ళు కూర్చోవడానికి సరిపడే సిమెంట్ బెంచ్ చేయించాలి. ఆ బెంచిమీద స్నేహితుల బెంచి అని రాయించాలి, జీవిత చరమాంకంలో కొత్త స్నేహితులను సంపాదించుకోవాలి కష్టసుఖాలు చెప్పుకోవడానికి అనుకుంటూ ఇంటి దారి పెట్టను. నా చిన్ననాటి స్నేహితులు ఎక్కడెక్కడో స్థిరడ్డారు మరి. దగ్గరలో ఎవరు లేరు. ఉన్నవారితో స్నేహం చేస్తే ఎంత బాగుంటుందో. --సుబ్రమణ్యం వల్లూరి (చదవండి: డెత్ మిస్టరీ.. ఆరోజు ఏం జరిగింది? ఇప్పటికీ సమాధానం లేకుండానే..) -
సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులతో బెంచ్.. చరిత్రలో మూడోసారి..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో గురువారం మహిళా న్యాయమార్తులతో కూడిన ధర్మాసనం పిటిషన్లను విచారించనుంది. ఓ బెంచ్‌లో అందరూ మహిళా న్యాయమూర్తులే ఉండటం సుప్రీంకోర్టు చరిత్రలో ఇది మూడోసారి కావడం గమనార్హం. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బెలా ఎం త్రివేదిలతో కూడిన ఈ ధర్మాసనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టులో తొలిసారి 2013లో మహిళా న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ ఆ బెంచ్‌లో ఉన్నారు. ఆ తర్వాత 2018 సెప్టెంబర్‌లో మహిళా న్యాయముర్తులు జస్టిస్ బానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం ఏర్పాటయ్యింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మూడోసారి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బెలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఏర్పాటయ్యింది. ఈ బెంచ్ గురువారం మొత్తం 32 పిటిషన్లను విచారించనుంది. అందులో 10 వివాహ వివాదాల బదిలీ పిటిషన్లు కాగా, 10 బెయిల్‌కు సంబంధించినవి. సుప్రీంకోర్టులో ప్రస్తుతమున్న 27 మంది న్యాయమూర్తుల్లో ముగ్గురు మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. వారు.. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ త్రివేది. వీరిలో జస్టిస్ హిమా కోహ్లీ పదవీ కాలం 2024 సెప్టెంబర్‌లో ముగుస్తుంది. జస్టిస్ త్రివేది పదవీకాలం 2025 జూన్‌లో పూర్తవుతుంది. జస్టిస్ నాగరత్న 2027లో తొలి మహిళా సీజేఐగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించనున్నారు. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులకు గానూ ప్రస్తుతం 27 మందే ఉన్నారు. జస్టిస్ ఎ అబ్దుల్ నజార్ జనవరి 4న రిటైర్ అయ్యాక ఈ సంఖ్య 26కు తగ్గనుంది. దీంతో 8 ఖాళీలు ఉంటాయి. వచ్చే ఏడాది మరో ఏడుగురు న్యాయమూర్తులు కూడా రిటైర్ కానున్నారు. చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న నటి -
ఎదురుచూపులు ఇంకా ఎన్నాళ్లు..
సాక్షి, చెన్నై: చెన్నై సహా దేశంలోని ముఖ్యనగరాల్లో సుప్రీంకోర్టు శాఖలు ఏర్పాటయ్యేనా..? అనే ఎదురుచూపుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అప్పీలు కేసుల కోసం ఢిల్లీకి రాలేంబాబూ.. మా రాష్ట్రంలోని గల్లీలో శాఖ ఏర్పాటు చేయండని వేడుకుంటున్నారు. ఢిల్లీ, చెన్నై లేదా హైదరాబాద్, ముంబయి, కోల్కత్తా నగరాల్లో సుప్రీంకోర్టు శాఖలను ఏర్పాటు చేయాలని ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో కొందరు సభ్యులు గత గళాన్ని వినిపించారు. హైకోర్టులు ఇచ్చే తీర్పులు, జారీచేసే ఆదేశాలపై దేశ రాజధానిలోని సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు. సుప్రీంకోర్టులో ఇచ్చే తీర్పుపై అప్పీలు ఉండదు. అదే తుది తీర్పుగా పరిగణించాల్సి ఉంటుంది. సాధారణ పౌరులు సుప్రీంకోర్టు గడప ఎక్కడం సాధ్యమా..? అనేది ప్రశ్నార్థకమైంది. ఆర్థిక, సామాజికంగా బలమైన వ్యక్తులే సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకునే పరిస్థితి ఉందనే అభిప్రాయం ఉంది. ఢిల్లీ, చెన్నై, ముంబయి, కోల్కత్తా నగరాల్లో సుప్రీంకోర్టు శాఖలను ఏర్పాటు చేయడం ముఖ్యమనే అభిప్రాయాన్ని పార్లమెంటరీ బృందం, న్యాయశాఖ కమిషన్ ఇప్పటికే వెలిబుచ్చింది. ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి చెందిన ఎంపీలు శాఖల ఆవశ్యకతను ప్రస్తావించారు. కేంద్ర న్యాయాశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎంపీల ప్రశ్నలకు బదులిస్తూ ఉత్తరాలు కూడా రాశారు. (‘సుప్రీం’ చైతన్యం కోల్పోతోందా?!) ఆ తరువాత అటార్ని జనరల్ కేకే వేణుగోపాల్‌ను డీఎంకే ఎంపీ, సీనియర్ న్యాయవాదైన విల్సన్ నేరుగా కలుసుకుని విన్నవించారు. విల్సన్ మాట్లాడుతూ ఒక్కో సుప్రీంకోర్టు శాఖకు 15 మంది న్యాయమూర్తులను నియమించుకునే అవకాశం ఉందని, దీని వల్ల హైకోర్టు న్యాయమూర్తులకు పదోన్నతి లభిస్తుందని అన్నారు. ఢిల్లీకి వెళ్లి సీనియర్ న్యాయవాదిని నియమించుకుని సుప్రీంకోర్టులో అప్పీలు చేయడం సాధారణ వ్యక్తులకు అంత సులభం కాదని రాజ్యసభ మాజీ సభ్యులు, సీనియర్ న్యాయవాది పీఎస్ జ్ఞానదేశికన్ అన్నారు. విచారణ జాబితాలో ఉండే కేసులో ఒక్కోసారి విచారణకు నోచుకోక పోవచ్చని తెలిపారు. విచారణకు వచ్చినా కొట్టివేయవచ్చని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టు శాఖలు ఏర్పడినట్లు సుప్రీంకోర్టు సైతం వివిధ రాష్ట్రాల్లో శాఖలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. చెన్నైలో సుప్రీంకోర్టు శాఖను ఏర్పాటు చేయాలని కోర్కె ఎన్నో ఏళ్లుగా నానుతోందని చెప్పారు. అదే జరిగితే తరచూ ఢిల్లీకి ప్రయాణం కాకుండా కక్షదారులకు, న్యాయవాదులకు సైతం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అంతేగాక స్థానిక ప్రాధ్యాతను తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. డబ్బు ఖర్చు తగ్గడంతోపాటు పిటిషన్ దారులు నేరుగా హాజరయ్యే వసతి కూడా ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు శాఖల ఏర్పాటులో ప్రారంభ దశగా ‘సర్యూ్కట్ బెంచ్’ను నెలకొల్పి మండల స్థాయిలో నిర్వాహక కార్యాలయాలను ఏర్పాటు చేయవచ్చని ఆయన సూచించారు. అఖిలభారత బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ఎస్ ప్రభాకరన్ మాట్లాడుతూ దేశంలోని ముఖ్యనగరాల్లో సుప్రీంకోర్టు శాఖలను నెలకొల్పడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. కనీసం అప్పీలు కేసులను విచారించేందుకు మండలస్థాయిలోనైనా ఏర్పాటు చేయాలని అన్నారు. ఢిల్లీకి సమీపంలోని పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి 60 శాతం కేసులు అప్పీలుకు వస్తుండగా, దక్షిణాది రాష్ట్రాల నుంచి కనీసం 10 శాతం కేసులు కూడా అప్పీలు కోసం సుప్రీంకోర్టుకు రావడం లేదని తెలిపారు. హైకోర్టు ఆదేశాలను కాదని చేసే అప్పీలు కేసులను విచారించేందుకు సుప్రీంకోర్టు శాఖలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడిని కొనసాగిస్తామని ప్రభాకరన్ తెలిపారు. -
తీరని బడి గోస
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నా ఆచరణలో కనిపించడం లేదు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కూర్చోవడానికి బెంచీలు లేక నేలపైనే కూర్చుంటూ నానా ఇబ్బందులు పడుతున్నారు. అటు ప్రభుత్వం బెంచీలు మంజూరు చేయదు. ఇటు దాతలెవరూ ముందుకు రాక పిల్లలు నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బెంచీలు మంజూరు చేసి విద్యార్థుల కష్టాలు తీర్చే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కెరమెరి: సర్కారు బడులకు వచ్చే విద్యార్థులకు నేలబారు చదువులు తప్పడం లేదు. ఉన్నత పాఠశాలలకు ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు ప్రతి ఏడాది వస్తున్నా బల్లలు సమకూర్చడంలో ప్రధానోపాధ్యాయులు శ్రద్ధ వహించడం లేదు. దీంతో ఏళ్లుగా వేలాది మంది విద్యార్థులకు నేలపై కూర్చొని విద్యనభ్యసించాల్సిన పరిస్థితులు దాపురించాయి. అనేక చోట్ల బల్లలు లేకపోవడంతో పరీక్షలు సైతం నేలపైనే కూర్చొని రాస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా విద్యార్థులకు మాత్రం సౌకర్యాలు సమకూర్చడంలో విఫలమవుతుంది. మండలంలో 86 ప్రభుత్వ పాఠశాలలు కెరమెరి మండలంలో మొత్తం 86 ప్రభుత్వ పాఠశాలుల ఉన్నాయి. వాటిలో 7 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, 2 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 4 ప్రాథమికోన్నత, 63 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వాటిలో బాలురు 3033, బాలికలు 2919 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో యూపీఎస్ పాఠశాలల్లో 2014–15 లో 6, 7 తరగతుల వారికి మంజూరు కాగా 95 మంది ఉపయోగించుకుంటున్నారు. కాగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో అనుకున్న స్థాయిలో బల్లలు ఉండగా జిల్లా పరిషత్ పరిధిలోని ఏ ఒక్క పాఠశాలలో బల్లలు లేవు. గోయగాం, కెరమెరి ఉన్నత పాఠశాలలో సొంతంగా సమకూర్చగా, ఇతర బడుల్లో నేల పైనే చదువులు కొనసాగుతున్నాయి. ఉన్నత పాఠశాలలకు సర్కారు నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా రూ. 50 వేలు అందిస్తుండగా, ఈ సంవత్సరం ఆ నిధుల్లో కూడా కొంత కోత పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ప్రాథమిక పాఠశాలలకు నిధుల్ని రూ.10 వేల నుంచి రూ. 5 వేలకు తగ్గించారు. దీంతో ఎటూ పాలుపోక ప్రధానోపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే బల్లలు సమకూర్చాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. గిరిజన సంక్షేమ బడులకు ఓకే మండలంలోని రాంజీగూడ, అనార్పల్లి, హట్టి, మోడి, కేజీబీవీల్లో ఉన్నత పాఠశాలలుండగా జోడేఘాట్, బాబేఝరిల్లో ప్రాథమిక ఆశ్రమాలు ఉన్నాయి. అందులో 1740 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి సరిపడేంత బల్లలను గిరిజన సంక్షేమ శాఖ సమకూర్చింది. కొన్ని పాఠశాలల్లో స్థలం లేక ఆరుబయటే ఉండగా జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులు మాత్రం నేలబారు చదువులు ఇంకెన్నాళ్లని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
క్వాలిటీ మేరకే ఆ రేటు!
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖకు సరఫరా చేసిన డ్యుయల్ డెస్క్‌ల పరిమాణం, నాణ్యతను బట్టే రూ. 5,050 ధరను నిర్ణయించామని చర్లపల్లి ౖజైలు సూపరింటెండెంట్ అర్జునరావు తెలిపారు. ‘సబ్బు బిళ్ల.. స్కూలు బల్ల.. కాదేదీ అవినీతికి అనర్హం!’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. పాఠశాల విద్యా శాఖ సూచించిన ప్రమాణాల ప్రకారమే డెస్క్‌లను తయారు చేశామని, వీటి తయారీలో టాటా షీట్‌ను వినియోగించామని వెల్లడించారు. సరఫరా చేసిన డెస్క్‌లను ఖైదీలే తయారు చేశారని వెల్లడించారు. సెంట్రల్ జైలులో ఆధునిక యంత్రాలతో బల్లల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఖైదీలకు శిక్షణ ఇచ్చేందుకు ఎస్ఎస్ ఇండస్ట్రీస్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. ధరలు నిర్ణయించిందీ వారే... డ్యుయల్ డెస్క్‌ల ధరలను చర్లపల్లి సెంట్రల్ జైలే నిర్ణయించిందని పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో రూ. 5,041కు కొనుగోలు చేసిన డ్యుయల్ డెస్క్‌ల్లో నాణ్యత లేకపోవడంతో రూ. 5,050కు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అవినీతి ఆరోపణలపై జైళ్ల శాఖ కూడా వివరణ ఇచ్చిందని పేర్కొన్నారు. డెస్క్ కొనుగోళ్లలో ఎటువంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. -
డ్యుయల్ డెస్క్‌ల కొనుగోలు వివాదాస్పదం
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన డ్యుయల్ డెస్క్‌ల కొనుగోలు వివాదాస్పదమవుతోంది. చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి డ్యుయల్ డెస్క్‌ల సరఫరా పేరిట ఓ మధ్య వ్యాపారి అధిక ధరలతో వంద.. వెయ్యి కాదు.. ఏకంగా లక్ష బల్లలను సరఫరా చేసేలా ఆర్డర్ సొంతం చేసుకున్నారు. విద్యాశాఖ టెండర్లు పిలిచి ఈ పనులు అప్పగించిందా? అంటే అదీ లేదు. జైళ్ల శాఖ పేరుతో నామినేషన్‌పై వీటి కొనుగోలుకు విద్యా శాఖ ఓకే చెప్పింది. సాధారణంగా రూ.10 లక్షల విలువైన పనులకూ ప్రభుత్వానికి ఫైలు పంపించే విద్యా శాఖ రూ.50 కోట్ల విలువైన ఈ పనులకు సొంతంగా ఆర్డర్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. పైగా చర్లపల్లి సెంట్రల్ జైలులో ఏడాది పొడవునా పని చేసినా లక్ష బల్లల తయారీ సామర్థ్యం లేదని విద్యాశాఖ అధికారులే చెబుతున్నారు. అయినా జైలు పేరుతో బయటి వ్యక్తికి లక్ష బల్లల సరఫరా ఆర్డర్ అప్పగించారని, ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్ల దందా కొనసాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓపెన్ మార్కెట్లో చూస్తే.. విద్యాశాఖ ఆర్డర్ ఇచ్చిన డ్యుయల్ డెస్క్‌లను పరిశీలిస్తే అంత ధర లేదని చిన్నతరహా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముగ్గురు విద్యార్థులు కూర్చునేందుకు వీలున్న ఈ బల్లల తయారీకి రూ.2,800 వరకు ఖర్చవుతుందని, సరఫరా, లాభాల కింద రూ.1,200 కలిపినా రూ.4 వేలకు మించదని పేర్కొంటున్నాయి. కానీ ముగ్గురు విద్యార్థులు కూర్చునే బల్లలకు రూ.5,050 రేటుతో రూ.50 కోట్లకుపైగా విలువైన ఆర్డర్‌ను ఎలాంటి టెండర్లు లేకుండా ఇవ్వడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇవేకాదు పదో తరగతి పరీక్షల కోసం మరో 11 వేల వరకు డ్యుయల్ డెస్క్‌ల సరఫరాకూ ఆర్డర్ ఇచ్చింది. ఈ వ్యవహారంలో రూ.15 కోట్ల వరకు నిధుల దుర్వినియోగం జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. విద్యాశాఖ మాత్రమే కాదు.. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలు కూడా గురుకులాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జైల్లో ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయాలి. సాధారణంగా జైలులో తయారు చేసే బల్లలపై పన్నులు ఉండవు. అలాంటప్పుడు మరింత రేటు తగ్గాల్సి ఉన్నా.. అధిక ధరలకు ఆర్డర్ ఇవ్వడం గమనార్హం. జెమ్ ఏం చెబుతోందంటే.. గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్(జెమ్).. ప్రధానమంత్రి నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ సూచనల మేరకు ఏర్పాటైన ఆన్లైన్ మార్కెట్ ఇదీ. ఇందులో వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలు రిజిస్టర్ చేసుకోవాలి. ప్రభుత్వాలకు అవసరమైన పరికరాలను స్పెసిఫికేషన్స్ ప్రకారం ఆయా వ్యాపార సంస్థల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో డెస్క్‌లు సరఫరా చేసే వ్యాపార సంస్థలు వెయ్యికిపైగా ఉన్నాయి. విద్యాశాఖ నిర్దేశిత ప్రమాణాలతో కూడిన డ్యుయల్ డెస్క్‌లు రూ.1,600 నుంచి రూ.3,500 వరకు ధర ఉన్నాయి. కానీ దాని నుంచి కొనుగోలు చేసేందుకు విద్యా శాఖ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాగా, ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో విచారణకు ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ ఈ విషయాన్ని తేల్చాలని జైలు అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. ధరలు మేం నిర్ణయించం.. లక్ష డ్యుయల్ డెస్క్‌ల కొనుగోలు కోసం చర్లపల్లి జైలుకు ఆర్డర్ ఇచ్చింది వాస్తవమే. జైళ్లలో తయారయ్యే వస్తువులను ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేయాలన్న నిబంధన ఉంది. ఆ మేరకే మేం ఆర్డర్ ఇచ్చాం. అయితే ధరలను మేం నిర్ణయించం. మేం ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం జైలు అధికారులే ధర నిర్ణయించారు. ఆ ప్రకారమే కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాం. – కిషన్, పాఠశాల విద్యా కమిషనర్ -
ఐటీ కంపెనీల్లో ఖాళీ అవుతున్న ‘బెంచీ’లు
న్యూఢిల్లీ: అమెరికా లాంటి దేశాల ఆంక్ష లు, యాంత్రీకరణ పెరగడం వల్ల భారత ఐటీ దిగ్గజ సంస్థల్లోకూడా బెంచీలు ఖాళీ అవుతున్నాయి. ఐటీ కంపెనీల్లో ఇది వరకు బెంచీకి ఎనిమిది నుంచి పది మంది ఉండగా ఇప్పుడా సంఖ్య నాలుగు నుంచి ఐదుకు పడిపోయిందని మానవ వనరుల అభివద్ధి శాఖకు చెందిన నిపుణులు తెలియజేస్తున్నారు. ఐటీ రంగంలో ప్రస్తుతం పనిచేయడానికి ఏ ప్రాజెక్ట్ లేకపోయినా, భవిష్యత్ ప్రాజెక్టులకు పనికొస్తారన్న నమ్మకంతో రిజర్వ్‌లో ఉంచే ఉద్యోగులను బెంచీ ఉద్యోగులుగా వ్యవహరిస్తారు. వారిని కూడా రెగ్యులర్ రోల్స్‌లోనే ఉంచి ఇతర ఉద్యోగులలాగానే జీతభత్యాలు ఇస్తారు. ‘సిట్టింగ్ ఆన్ ది బెంచ్’ అనే పదం ఫుట్‌బాల్ ఆట నుంచి వచ్చిందంటారు. ఫుట్‌బాల్ ఆడేది 11 మంది క్రీడాకారులే అయినా అయిదారు ఆటగాళ్లు ఎక్స్ట్రా ఉంటారు. రెగ్యులర్ ఆటగాళ్లు గాయపడ్డ సందర్భాల్లో వారికి బదులుగా వీరు ఆడతారు. వీరిని ‘సిట్టింగ్ ఆన్ ది బెంచ్’ క్రీడాకారులు అని వ్యవహరిస్తారు. ఇలా ఎక్స్ట్రా ఉద్యోగులను ఐటీ పరిశ్రమలో ఉద్యోగుల బ్యాంక్ అని కూడా పిలుస్తారు. బ్యాంక్ అన్న పదం ఇటలీలోని బెంచీ నుంచే వచ్చిందట, 14వ శతాబ్దంలో ఇటలీలో ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఉద్యోగులు బెంచీల మీద కూర్చొని పనిచేసేవారని, ఆ బెంచీ పదం మీదనే బ్యాంక్ అనే పదం పుట్టుకొచ్చిందని ‘ది యాక్సెంట్ ఆఫ్ మనీ’ పుస్తకంలో రచయిత నీల్ ఫర్గూసన్ తెలిపారు. ‘అన్ని వేళల్లో మా వద్ద బెంచీపై తక్కువ ఉద్యోగులే ఉంటారు. దీన్ని మేము ప్రణాళికా కాలమని కూడా అంటాం. ఈ కాలంలో ఉద్యోగులు పని నేర్చుకుంటారు. అలాగే తమ అంతర్గత సజనాత్మకతపై దష్టిని కేంద్రీకరిస్తారు’ అని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ హెడ్ రిచర్డ్ లోబో ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈ బెంచీని ఐటి కంపెనీలు పరస్పరం భిన్నంగా కూడా చూస్తాయి. ప్రాజెక్ట్ ఇవ్వడమే తరువాయి, పనిచేసి పెట్టడానికి తమవద్ద తగినన్ని మానవ వనరులు ఉన్నాయని కస్టమర్లను నమ్మించడానికి, తమ సంస్థ ఆర్థికంగా కూడా బలమైనదని చెప్పడానికి ఈ బెంచీలను ఉపయోగిస్తే, లాభాలను తగ్గించుకోవడమే అవుతుందన్న ఉద్దేశంతో కొన్ని కంపెనీలు బెంచీల సైజును నామమాత్రంగానే ఉంచేవి. నైపుణ్యం పెంచుకోవడానికి, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఈ బెంచీలు బాగా ఉపయోగపడేవని ఓ ఐటీ కంపెనీలో 16 నెలల పాటు బెంచీపై కూర్చున్న ఇందిర రాఘవన్ అనే ఐటీ ఉద్యోగి వ్యాఖ్యానించారు. ఇదివరకు ఐటీ కంపెనీల్లో బెంచీపైన 30 శాతం మంది ఉద్యోగులు ఉంటుండగా, 70 శాతం మంది ఉద్యోగులు ప్రాజెక్టులపై పనిచేసే వారని, ఇప్పుడు బెంచీ సంఖ్య 19–20కి, పనిచేసే ఉద్యోగుల సంఖ్య 80–81 శాతంగా మారిందని ఇన్ఫోసిస్ ఎండీ, సీఈవో విశాల్ సిక్కా తెలిపారు. బ్యాంక్ అని పిలిచినా, బెంచీ అని పిలిచినా ఇప్పుడు ఐటీ దిగ్గజ సంస్థల్లో రిజర్వ్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుందని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ఇప్పుడు బెంచీకి బదులుగా ఐటీ సంస్థలు ‘జస్ట్ ఇన్ టైమ్’ అనే విధానానికి శ్రీకారం చుట్టాయి. ఈ జాబితో వున్న ఉద్యోగులకు జీత భత్యాలు ఇవ్వరు. ప్రాజెక్టు వచ్చినప్పుడు మాత్రమే వీరిని పిలుస్తారు. ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు వారిని కాంట్రాక్ట్‌పై ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఇంటికి పంపించి వేస్తారు. ఈ విధానం కారణంగా ఇక ఐటీ కంపెనీల్లో శాశ్వత లేదా దీర్ఘకాల ఉద్యోగులంటూ ఉండరు. -
జాతీయ లోక్ అదాలత్‌లో 2,046 కే సుల పరిష్కారం
వరంగల్ లీగల్ : జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహించారు. ప్రతీ నెల రెండో శనివారం నిర్వహించే లోక్‌అదాలత్‌లో భాగంగా జిల్లాలోని కోర్టుల్లో 17 బెంచీలు ఏర్పాటుచేయగా వివిధ రకాల 2,046 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా కోర్టు, మహబూబాబాద్ కోర్టుల్లో 23 సివిల్ కేసులు పరిష్కారం కాగా, జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో కలిపి 173 క్రిమినల్ కేసులు పరిష్కరించారు. ఇంకా 1,740 విద్యుత్ సంబంధిత కేసులు రాజీ మార్గంలో పరిష్కరించగా, ప్రమాద బాధితులకు నష్టపరిహారం చెల్లింపునకు సంబంధించి 23 కేసుల్లో బాధితులకు రూ.54.36 లక్షలు చెల్లించేందుకు వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించాయి. లోక్ ఆదాలత్‌లో జిల్లా ప్రధాన జడ్జి, జిల్లా న్యాయాధికార సంస్థ చైర్మన్ ఎం.లక్ష్మణ్, మొ దటి అదనపు జిల్లా జడ్జి కే.బీ.నర్సింహాలు, ఏడో అదనపు జిల్లా జడ్జి సాల్మన్‌రాజ్, సీనియర్ సివిల్ జడ్జి వరప్రసాద్, న్యాయాధికార సేవ సంస్థ కార్యదర్శి జడ్జి నీలిమతో పాటు ఇతర న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యా యవాదులు పాల్గొన్నారు.