సాక్షి, చెన్నై: చెన్నై సహా దేశంలోని ముఖ్యనగరాల్లో సుప్రీంకోర్టు శాఖలు ఏర్పాటయ్యేనా..? అనే ఎదురుచూపుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అప్పీలు కేసుల కోసం ఢిల్లీకి రాలేంబాబూ.. మా రాష్ట్రంలోని గల్లీలో శాఖ ఏర్పాటు చేయండని వేడుకుంటున్నారు. ఢిల్లీ, చెన్నై లేదా హైదరాబాద్, ముంబయి, కోల్‌కత్తా నగరాల్లో సుప్రీంకోర్టు శాఖలను ఏర్పాటు చేయాలని ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో కొందరు సభ్యులు గత గళాన్ని వినిపించారు. హైకోర్టులు ఇచ్చే తీర్పులు, జారీచేసే ఆదేశాలపై దేశ రాజధానిలోని సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు. సుప్రీంకోర్టులో ఇచ్చే తీర్పుపై అప్పీలు ఉండదు. అదే తుది తీర్పుగా పరిగణించాల్సి ఉంటుంది. సాధారణ పౌరులు సుప్రీంకోర్టు గడప ఎక్కడం సాధ్యమా..? అనేది ప్రశ్నార్థకమైంది. ఆర్థిక, సామాజికంగా బలమైన వ్యక్తులే సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకునే పరిస్థితి ఉందనే అభిప్రాయం ఉంది. ఢిల్లీ, చెన్నై, ముంబయి, కోల్‌కత్తా నగరాల్లో సుప్రీంకోర్టు శాఖలను ఏర్పాటు చేయడం ముఖ్యమనే అభిప్రాయాన్ని పార్లమెంటరీ బృందం, న్యాయశాఖ కమిషన్ ఇప్పటికే వెలిబుచ్చింది. ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి చెందిన ఎంపీలు శాఖల ఆవశ్యకతను ప్రస్తావించారు. కేంద్ర న్యాయాశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎంపీల ప్రశ్నలకు బదులిస్తూ ఉత్తరాలు కూడా రాశారు. (‘సుప్రీం’ చైతన్యం కోల్పోతోందా?!)
ఆ తరువాత అటార్ని జనరల్ కేకే వేణుగోపాల్‌ను డీఎంకే ఎంపీ, సీనియర్ న్యాయవాదైన విల్సన్ నేరుగా కలుసుకుని విన్నవించారు. విల్సన్ మాట్లాడుతూ ఒక్కో సుప్రీంకోర్టు శాఖకు 15 మంది న్యాయమూర్తులను నియమించుకునే అవకాశం ఉందని, దీని వల్ల హైకోర్టు న్యాయమూర్తులకు పదోన్నతి లభిస్తుందని అన్నారు. ఢిల్లీకి వెళ్లి సీనియర్ న్యాయవాదిని నియమించుకుని సుప్రీంకోర్టులో అప్పీలు చేయడం సాధారణ వ్యక్తులకు అంత సులభం కాదని రాజ్యసభ మాజీ సభ్యులు, సీనియర్ న్యాయవాది పీఎస్ జ్ఞానదేశికన్ అన్నారు. విచారణ జాబితాలో ఉండే కేసులో ఒక్కోసారి విచారణకు నోచుకోక పోవచ్చని తెలిపారు. విచారణకు వచ్చినా కొట్టివేయవచ్చని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టు శాఖలు ఏర్పడినట్లు సుప్రీంకోర్టు సైతం వివిధ రాష్ట్రాల్లో శాఖలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. చెన్నైలో సుప్రీంకోర్టు శాఖను ఏర్పాటు చేయాలని కోర్కె ఎన్నో ఏళ్లుగా నానుతోందని చెప్పారు. అదే జరిగితే తరచూ ఢిల్లీకి ప్రయాణం కాకుండా కక్షదారులకు, న్యాయవాదులకు సైతం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అంతేగాక స్థానిక ప్రాధ్యాతను తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. డబ్బు ఖర్చు తగ్గడంతోపాటు పిటిషన్ దారులు నేరుగా హాజరయ్యే వసతి కూడా ఉంటుందన్నారు.
సుప్రీంకోర్టు శాఖల ఏర్పాటులో ప్రారంభ దశగా ‘సర్యూ్కట్ బెంచ్’ను నెలకొల్పి మండల స్థాయిలో నిర్వాహక కార్యాలయాలను ఏర్పాటు చేయవచ్చని ఆయన సూచించారు. అఖిలభారత బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ఎస్ ప్రభాకరన్ మాట్లాడుతూ దేశంలోని ముఖ్యనగరాల్లో సుప్రీంకోర్టు శాఖలను నెలకొల్పడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. కనీసం అప్పీలు కేసులను విచారించేందుకు మండలస్థాయిలోనైనా ఏర్పాటు చేయాలని అన్నారు. ఢిల్లీకి సమీపంలోని పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి 60 శాతం కేసులు అప్పీలుకు వస్తుండగా, దక్షిణాది రాష్ట్రాల నుంచి కనీసం 10 శాతం కేసులు కూడా అప్పీలు కోసం సుప్రీంకోర్టుకు రావడం లేదని తెలిపారు. హైకోర్టు ఆదేశాలను కాదని చేసే అప్పీలు కేసులను విచారించేందుకు సుప్రీంకోర్టు శాఖలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడిని కొనసాగిస్తామని ప్రభాకరన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment