
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖకు సరఫరా చేసిన డ్యుయల్ డెస్క్‌ల పరిమాణం, నాణ్యతను బట్టే రూ. 5,050 ధరను నిర్ణయించామని చర్లపల్లి ౖజైలు సూపరింటెండెంట్ అర్జునరావు తెలిపారు. ‘సబ్బు బిళ్ల.. స్కూలు బల్ల.. కాదేదీ అవినీతికి అనర్హం!’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. పాఠశాల విద్యా శాఖ సూచించిన ప్రమాణాల ప్రకారమే డెస్క్‌లను తయారు చేశామని, వీటి తయారీలో టాటా షీట్‌ను వినియోగించామని వెల్లడించారు. సరఫరా చేసిన డెస్క్‌లను ఖైదీలే తయారు చేశారని వెల్లడించారు. సెంట్రల్ జైలులో ఆధునిక యంత్రాలతో బల్లల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఖైదీలకు శిక్షణ ఇచ్చేందుకు ఎస్‌ఎస్ ఇండస్ట్రీస్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు.
ధరలు నిర్ణయించిందీ వారే...
డ్యుయల్ డెస్క్‌ల ధరలను చర్లపల్లి సెంట్రల్ జైలే నిర్ణయించిందని పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో రూ. 5,041కు కొనుగోలు చేసిన డ్యుయల్ డెస్క్‌ల్లో నాణ్యత లేకపోవడంతో రూ. 5,050కు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అవినీతి ఆరోపణలపై జైళ్ల శాఖ కూడా వివరణ ఇచ్చిందని పేర్కొన్నారు. డెస్క్ కొనుగోళ్లలో ఎటువంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు.