jail superintendent
-
ఇదేందయ్యా ఇది: జైలులో గది అద్దెకు ఇస్తారంటా.. రెంట్ ఎంతో తెలుసా?
జైలులో ఎవరుంటారు.. ఈ ప్రశ్న చిన్నపిల్లలను అడిగినా వెంటనే చెప్పేస్తారు. జైలులో నేరస్తులు ఉంటారు అని. అయితే, ఉత్తరాఖండ్‌లోని జైలులో మాత్రం నేరం చేయకపోయినా.. అక్కడ ఉండొచ్చు. ఎన్ని రోజులైనా అక్కడ నివాసం ఉండవచ్చు. ఎలా అనుకుంటున్నారా?. వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని హల్ద్ వానీ జైలులో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి జైల్లో నేరం చేయని వారు సైతం ఉండొచ్చు. అయితే, జైలులోని ఒక రూమ్‌లో ఉండేందుకు ఒక రోజు అద్దెగా రూ.500 చెల్సించాల్సి ఉంటుంది. కాగా, ఒక్క రోజుకు రూ.500 చొప్పున చెల్లిస్తూ ఎన్ని రోజలైనా జైలులో ఉండొచ్చు అని జైలు సూపరింటెండెంట్ తెలిపారు. అయితే, ఇందుకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. కాగా, కొందరు వ్యక్తులు జాతకాలను బాగా నమ్ముతుంటారు. జాతకాల్లో దోషం కారణంగా పెళ్లిళ్లు కాకపోవడం, ఉద్యోగాలు సాధించకపోవడం, అనుకున్నది చేయలేకపోవడం వంటివి జరుగుతుంటాయని వారి నమ్మకం. ఇందుకోసం దోష నివారణ చేయడానికి కొన్ని పనులు చేస్తుంటారు. ఇందులో భాగంగానే జైలుకు సైతం వెళ్లి రావాలని కొందరి జాతకాల్లో ఉంటుంది కదా.. అందుకోసం ఇలాంటి సమస్య ఉన్నవారి కోసం బంధన్ యోగ్ పేరిట ఇలా ప్రత్యేకంగా జైలులో రూమ్స్ అద్దెకు ఇస్తున్నట్టు జైలు అధికారులు స్పష్టం చేశారు. Jail Tourism For ₹ 500 Per Night Uttarakhand Offers Real Jail Experience To Tourists https://t.co/ZJqPyoiwgN — JAS Sakulich (@JasSakulich) September 30, 2022 -
నిమ్మకాయల స్కాం.. ఏకంగా జైలు సూపరింటెండెంట్ సస్పెండ్!
అమృత్సర్: ఈ ఏడాది వేసవిలో ఎండలే కాదు నిమ్మకాయల ధరలు కూడా మండుతున్నాయి. వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు నిమ్మ రసం తాగడానికి కూడా సామాన్యులు జంకుతున్నారు. ఎందుకంటే నిమ్మ మునుపెన్నడూ లేనంత ధర పలుకుతోంది. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుందామని అనుకుని ప్రయత్నించి సస్పెండ్ అయ్యాడు ఓ జైలు అధికారి. ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం..గుర్నమ్ లాల్ అనే ఐపీఎస్ అధికారి కపుర్తలా మోడర్న్ జైలు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి 30 మధ్య రూ. 10,000 విలువ చేసే 50కిలోల నిమ్మకాయలను కిలో రూ.200 చొప్పున కొనుగోలు చేసినట్లు బిల్లులు ప్రభుత్వానికి సమర్పించాడు. అయితే జైలు సూపరింటెండెంట్ నకిలీ రేషన్ బిల్లులను సృష్టిస్తున్నారని, బిల్లుల్లో చూపిన వస్తువులు తమకు ఇవ్వడం లేదని జైలులోని ఖైదీలు పంజాబ్ జైళ్లు, మైనింగ్, పర్యాటక శాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు నిజాలు బయట పడ్డాయి. ఫిర్యాదుపై స్పందించిన మంత్రి ఈ వ్యవహారంపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. విచారణలో.. నిమ్మకాయల బిల్లులు నకిలీవని జైలు సీనియర్ అధికారులు వెరిఫికేషన్‌లో తేలింది. దీంతో పాటు తమకు నిమ్మకాయలు అందజేయలేదని జైలు ఖైదీలు కూడా అధికారులకు చెప్పారు. అంతేకాకుండా రేషన్, కూరగాయల నిల్వల క్రాస్ వెరిఫికేషన్ చేయగా అందులోనూ అక్రమాలు వెలుగు చూశాయి. ఇలా తీగ లాగితే డొంక కదిలినట్లు ఆ జైలు సూపరింటెండెంట్ బండారం బయటపడింది. దీంతో ప్రభుత్వం జైలు సూపరింటెండెంట్ గుర్నమ్‌ను సస్పెండ్ చేయడంతో పాటు అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. -
క్వాలిటీ మేరకే ఆ రేటు!
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖకు సరఫరా చేసిన డ్యుయల్ డెస్క్‌ల పరిమాణం, నాణ్యతను బట్టే రూ. 5,050 ధరను నిర్ణయించామని చర్లపల్లి ౖజైలు సూపరింటెండెంట్ అర్జునరావు తెలిపారు. ‘సబ్బు బిళ్ల.. స్కూలు బల్ల.. కాదేదీ అవినీతికి అనర్హం!’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. పాఠశాల విద్యా శాఖ సూచించిన ప్రమాణాల ప్రకారమే డెస్క్‌లను తయారు చేశామని, వీటి తయారీలో టాటా షీట్‌ను వినియోగించామని వెల్లడించారు. సరఫరా చేసిన డెస్క్‌లను ఖైదీలే తయారు చేశారని వెల్లడించారు. సెంట్రల్ జైలులో ఆధునిక యంత్రాలతో బల్లల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఖైదీలకు శిక్షణ ఇచ్చేందుకు ఎస్ఎస్ ఇండస్ట్రీస్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. ధరలు నిర్ణయించిందీ వారే... డ్యుయల్ డెస్క్‌ల ధరలను చర్లపల్లి సెంట్రల్ జైలే నిర్ణయించిందని పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో రూ. 5,041కు కొనుగోలు చేసిన డ్యుయల్ డెస్క్‌ల్లో నాణ్యత లేకపోవడంతో రూ. 5,050కు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అవినీతి ఆరోపణలపై జైళ్ల శాఖ కూడా వివరణ ఇచ్చిందని పేర్కొన్నారు. డెస్క్ కొనుగోళ్లలో ఎటువంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. -
పరివర్తన కేంద్రంగా..
క్షణికావేశంలో హత్యలు చేసిన వారు కొందరు.. తోటి వారిని మోసగించిన వారు ఇంకొందరు.. చోరీలకు పాల్పడినవారు మరికొందరు.. ఏ తప్పూ చేయకపోయినా కేసులు మోపబడి నిర్దోషిత్వం నిరూపించుకునే వరకు మగ్గేవారు కొందరు. వీరంతా ఉండేది కారాగారంలోనే. నేరాలకు పాల్పడిన వారికి, నిందలకు గురయ్యే వారికి న్యాయస్థానం జైలు శిక్షలు విధించేది వారిలో పరివర్తన తెచ్చి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దడానికే. నిబంధనల మేరకు జైలులో వారికి సమయపాలన నేర్పుతూ.. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం తేనీరు, రాత్రికి మరోసారి భోజనం వంటివి సమకూర్చాలి. మరి అవన్నీ సక్రమంగా అందుతున్నాయా.. వారిలో పరివర్తన కలిగేలా జైలు సిబ్బంది వ్యవహరిస్తున్నారా.. వారికేమైనా సమస్యలున్నాయా.. అనే విషయాలను తెలుసుకోవాలనుకున్నారు ఏలూరులోని జిల్లా జైలు సూపరింటెండెంట్ డి.రాఘవేంద్రరావు. జైలు సూపరింటెండెంట్‌గా వారి ముందుకు వెళితే సమస్యలు తెలుసుకునే అవకాశం ఉండదని భావించారు. మరి ఖైదీల మనోభావాలను తెలుసుకునేదెలా అనుకుంటుండగా ‘సాక్షి’ నిర్వహిస్తున్న వీఐపీ రిపోర్టర్ కార్యక్రమం ఆయన మనుసులో మెదిలింది. అనుకున్నదే తడవుగా తాను జర్నలిస్టుగా మారారు. ఖైదీల మనోభావాలు తెలుసుకునేందుకు ముందుకు కదిలారు. బ్యారక్ బయట ఒక కానిస్టేబుల్.. అతని పక్కనే కొంతమంది ఖైదీలు ఉండడాన్ని గమనించారు. తొలుత కానిస్టేబుల్‌తో మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు : ఇక్కడ ఎందుకున్నావ్. ఎల్.బుజ్జిబాబు : ఖైదీల్లో కొంతమంది ఆరోగ్యం బాగోలేదన్నారు సార్. వారిని ఆసుపత్రికి తీసుకు వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నాను. రాఘవేంద్రరావు : ఏమయ్యా..! నీ పేరేంటి. నీకు ఏం సుస్తీ చేసింది. ఖైదీ : ఈ మధ్యనే జైలుకు వచ్చాను సార్. ఇక్కడి నీరు ఒంటికి పడకపోవడంతో ఎలర్జీ వచ్చింది. డాక్టర్‌కు చూపించుకుందామని అడిగాను. రాఘవేంద్రరావు : నీకేమైనా సమస్యలున్నాయా. అండమాను శివ : మంచి భోజనం పెట్టించండి సార్. నేను కోరుకునేది అదే. రాఘవేంద్రరావు : నువ్వు చెప్పు. నీకేమైనా సాయం చేయగలమా. వంటెద్దు విజయ్‌కుమార్ : జైలుకు వచ్చిన కొత్తలో నా కేసు వాదించడానికి లాయర్ లేరయ్యా. ఆ తరువాత లాయర్‌ను ఏర్పాటు చేశారు. అది చాలు. రాఘవేంద్రరావు : ఏ నేరం చేసి వచ్చావు. మా సిబ్బంది ఎలా ప్రవర్తిస్తున్నారు. జవిదెల నాగ భూషణం : బాగానే చూసుకుంటున్నారు సార్. అక్కడి నుంచి ఖైదీలను ఉంచే బ్యారక్ వద్దకు వెళ్లిన సూపరింటెం డెంట్ అక్కడ భోజనాలు వడ్డిస్తున్న సిబ్బందిని చూసి.. రాఘవేంద్రరావు : ఏమయ్యా.. భోజనాలు బాగున్నాయా. సరిపడనంత పెడుతున్నారా. వంటెద్దు విక్రాంత్ : బాగున్నాయ్ సార్. సరిపడనంత పెడుతున్నారు. రాఘవేంద్రరావు : బ్యారక్‌లో పడక సౌకర్యం ఎలా ఉంది. మారే గోవిందరాజు : ఏ ఇబ్బందీ లేదు సార్. రాఘవేంద్రరావు : ఏమయ్యా.. ఏ నేరం చేసి ఇక్కడకొచ్చావ్. నీకు సమస్యలేమైనా ఉన్నాయా. ఎల్లసిరి శరత్‌రెడ్డి : తెలియని తనంలో నక్సలిజం వైపు ఆకర్షితుడినయ్యాను. ఎంబీఏ చదివి నక్సలైట్లకు ఆయుధాలు తయారు చేసి ఇచ్చాను. ఇప్పుడు తెలిసి వచ్చింది. ఇంక ఎప్పుడూ ఇటువంటి పొరపాటు చేయను. రాఘవేంద్రరావు : నీకేమైనా సమస్యలున్నాయా. మిర్యాల శ్రీను : నాకు ఆరోగ్య సమస్యలున్నాయ్ సార్. అప్పుడప్పుడూ ప్రభుత్వాసుపత్రికి వైద్యానికి వెళుతుంటాను. అక్కడ వైద్యం సరిగా అందడం లేదు. రాఘవేంద్రరావు : నేనేం చేయాలో చెప్పు మిర్యాల శ్రీను : జైలులోనే ఒక వైద్యుడు ఉండేలా చూడండి సార్. రాఘవేంద్రరావు : నువ్వు చెప్పు. నీకేమైనా సమస్యలున్నాయా. దాసరి బోసురాజు : ఒక కాయిన్ బాక్స్ ఫోన్ పెట్టించండి సార్. లాయర్లతో, మా కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి వీలుగా ఉంటుంది. అక్కడి నుండి మహిళా ఖైదీలు ఉండే బ్యార క్కు వెళ్లిన సూపరింటెం డెంట్ అక్కడి వారితో మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు : ఏమ్మా.. మీకేమైనా సమస్యలున్నాయా. మరీదు వరలక్ష్మి : ఏమీ లేవు సార్. రాఘవేంద్రరావు : ఏమ్మా. నీకేమైనా సమస్యలున్నాయా. బోసిలి చిన్నారి : నాకు బెయిల్ రావడం లేదు సార్. త్వరగా బెయిల్ వచ్చే ఏర్పాటు చేయండి. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌తో మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు : ఇక్కడ విధి నిర్వహణ ఎలా ఉంది. మహిళా ఖైదీలతో ఏమైనా ఇబ్బందులు ఎదురౌతున్నాయా. డి.నిర్మలకుమారి : విధి నిర్వహణ సంతృప్తికరంగా ఉంది సార్. ఖైదీలతో ఇబ్బందులేమీ లేవు. కాకపోతే మాది చింతలపూడి. అక్కడ సబ్‌జైలు తెరిచే ఏర్పాటు చేయండి సార్. జైలు బయట ఖైదీలను కలవడానికి ఎదురుచూస్తున్న బంధువుల వద్దకు వెళ్లిన సూపరింటెండెంట్ ‘మీ పేరేంటమ్మా. ఎవరిని కలవడానికి వచ్చారు’ అని అడిగారు. బి.దుర్గాప్రశాంతి : మా నాన్న లోపల ఉన్నాడు సార్. ఆయనను కలుద్దామని ఉదయం ఎప్పుడో వచ్చాం. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. ఇక్కడ మాలాంటి వాళ్లు కూర్చోవడానికి ఒక గది ఏర్పాటు చేయండి సార్. ఖైదీలకూ ఆదాయం వచ్చే ఏర్పాటు జైలు శిక్ష అనుభవిస్తున్న వాళ్లంతా చెడ్డవాళ్లు కాదు. ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి సూపరింటెం డెంటుగా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఖైదీలకు వారి శిక్షా కాలంలో కొంత ఆదాయం వచ్చేలా ఏదో ఒక ఏర్పాటు చేయాలనే అలోచనలో ఉన్నాం. జైలు పరిసరాల్లో ఒక బేకరీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. ఖైదీలను కలవడానికి వచ్చేవారి కోసం గత ఎంపీ కావూరి సాంబశివరావు ఎంపీ నిధుల నుండి మంజూరు చేసిన రూ.2 లక్షలతో వెయిటింగ్ రూమ్ కడుతున్నాం. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్ కార్యక్రమం ద్వారా ఖైదీలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలిశాయి. జైలులో రెసిడెంట్ వైద్యుణ్ణి ఏర్పాటు చేసే విషయమై ఇప్పటికే డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకెళ్లాం. జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇచ్చాం. మహిళల బ్యారక్‌పై మరో బ్యారక్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. ఖైదీల సౌకర్యం కోసం జనరేటర్ ఏర్పాటుకు ఎంపీ మాగంటి బాబు హామీ ఇచ్చారు. ఖైదీలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ పెడుతున్నాం. ఖైదీల్లో మానసిక పరివర్తన తీసుకొచ్చేందుకు తరచూ ఆధ్యాత్మిక ప్రసంగాలను ఏర్పాటు చేస్తున్నాం. ఖైదీలకు హక్కులపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నాం. భవిష్యత్‌లో ఖైదీలకు మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం. - బి.రాఘవేంద్రరావు, జైలు సూపరింటెండెంట్ -
జైలు నుంచి నలుగురు ఖైదీలు పరారు
ఖైదీలు, జైలు సిబ్బందికి మధ్య ఘర్షణను అసరాగా చేసుకుని నలుగురు విచారణలో ఉన్న ఖైదీలు పరారైయ్యారు. ఆ ఘటన బీహార్ సీతామర్హి జిల్లాలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఖైదీలు పరారైన విషయాన్ని జైలు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దాంతో వారిని పట్టుకునేందుకు అధికారులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. పరారైన ఖైదీలు సడ్రి అలాం, సుభోద్ కుమార్, సురజ్ కుమార్, వినయ్ బైతాలుగా గుర్తించినట్లు జైలు సుపరింటెండెంట్ మంగళవారం వెల్లడించారు. సుపరింటెండెంట్ కథనం ప్రకారం... తినే ఆహారం నాణ్యత ఉండటం లేదంటూ ఖైదీలు సోమవారం జైలులో నిరసనకు దిగారు. ఆ క్రమంలో జైలు సిబ్బందికి, ఖైదీలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ ఘర్షణలో పలువురు తీవ్రంగా ఖైదీలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందించడంలో జైలు సిబ్బంది తలమునకలై ఉన్న సమయంలో విచారణలో ఉన్న ఖైదీలు పరారైయ్యారన్నారు. ఖైదీలను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని జైలు సుపరింటెండెంట్ వెల్లడించారు.