పరివర్తన కేంద్రంగా.. | D. Raghavendra Rao Jail Superintendent VIP Reporter program | Sakshi
Sakshi News home page

పరివర్తన కేంద్రంగా..

Published Sun, Feb 8 2015 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

పరివర్తన  కేంద్రంగా..

పరివర్తన కేంద్రంగా..

 క్షణికావేశంలో హత్యలు చేసిన వారు కొందరు.. తోటి వారిని మోసగించిన వారు ఇంకొందరు..  చోరీలకు పాల్పడినవారు మరికొందరు.. ఏ తప్పూ చేయకపోయినా కేసులు మోపబడి నిర్దోషిత్వం నిరూపించుకునే వరకు మగ్గేవారు కొందరు. వీరంతా ఉండేది కారాగారంలోనే. నేరాలకు పాల్పడిన వారికి, నిందలకు గురయ్యే వారికి న్యాయస్థానం జైలు శిక్షలు విధించేది వారిలో పరివర్తన తెచ్చి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దడానికే. నిబంధనల మేరకు జైలులో వారికి సమయపాలన నేర్పుతూ.. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం తేనీరు, రాత్రికి మరోసారి భోజనం వంటివి సమకూర్చాలి.
 
 మరి అవన్నీ సక్రమంగా అందుతున్నాయా.. వారిలో పరివర్తన కలిగేలా జైలు సిబ్బంది వ్యవహరిస్తున్నారా.. వారికేమైనా సమస్యలున్నాయా.. అనే విషయాలను తెలుసుకోవాలనుకున్నారు ఏలూరులోని జిల్లా జైలు సూపరింటెండెంట్ డి.రాఘవేంద్రరావు. జైలు సూపరింటెండెంట్‌గా వారి ముందుకు వెళితే సమస్యలు తెలుసుకునే అవకాశం ఉండదని భావించారు. మరి ఖైదీల మనోభావాలను తెలుసుకునేదెలా అనుకుంటుండగా ‘సాక్షి’ నిర్వహిస్తున్న వీఐపీ రిపోర్టర్ కార్యక్రమం ఆయన మనుసులో మెదిలింది. అనుకున్నదే తడవుగా తాను జర్నలిస్టుగా మారారు. ఖైదీల మనోభావాలు తెలుసుకునేందుకు ముందుకు కదిలారు. బ్యారక్ బయట ఒక కానిస్టేబుల్.. అతని పక్కనే కొంతమంది ఖైదీలు ఉండడాన్ని గమనించారు. తొలుత కానిస్టేబుల్‌తో మాట్లాడుతూ..
 
 రాఘవేంద్రరావు : ఇక్కడ ఎందుకున్నావ్.
 ఎల్.బుజ్జిబాబు : ఖైదీల్లో కొంతమంది
 ఆరోగ్యం బాగోలేదన్నారు సార్.
 వారిని ఆసుపత్రికి తీసుకు వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నాను.
 రాఘవేంద్రరావు :  ఏమయ్యా..! నీ పేరేంటి. నీకు ఏం సుస్తీ చేసింది.
 ఖైదీ : ఈ మధ్యనే జైలుకు వచ్చాను సార్. ఇక్కడి నీరు ఒంటికి పడకపోవడంతో ఎలర్జీ వచ్చింది. డాక్టర్‌కు చూపించుకుందామని అడిగాను.
 రాఘవేంద్రరావు :  నీకేమైనా
 సమస్యలున్నాయా.
 అండమాను శివ : మంచి భోజనం పెట్టించండి సార్. నేను కోరుకునేది అదే.
 రాఘవేంద్రరావు : నువ్వు చెప్పు. నీకేమైనా సాయం చేయగలమా.
 వంటెద్దు విజయ్‌కుమార్ : జైలుకు వచ్చిన కొత్తలో నా కేసు వాదించడానికి లాయర్ లేరయ్యా. ఆ తరువాత లాయర్‌ను ఏర్పాటు చేశారు. అది చాలు.
 రాఘవేంద్రరావు : ఏ నేరం చేసి వచ్చావు. మా సిబ్బంది ఎలా ప్రవర్తిస్తున్నారు.
 జవిదెల నాగ భూషణం : బాగానే చూసుకుంటున్నారు సార్.
 అక్కడి నుంచి ఖైదీలను ఉంచే బ్యారక్ వద్దకు వెళ్లిన సూపరింటెం డెంట్ అక్కడ భోజనాలు వడ్డిస్తున్న సిబ్బందిని చూసి..
 రాఘవేంద్రరావు : ఏమయ్యా.. భోజనాలు బాగున్నాయా. సరిపడనంత పెడుతున్నారా.
 వంటెద్దు విక్రాంత్ : బాగున్నాయ్ సార్. సరిపడనంత పెడుతున్నారు.
 రాఘవేంద్రరావు : బ్యారక్‌లో పడక
 సౌకర్యం ఎలా ఉంది.
 మారే గోవిందరాజు : ఏ ఇబ్బందీ
 లేదు సార్.
 రాఘవేంద్రరావు : ఏమయ్యా.. ఏ నేరం చేసి ఇక్కడకొచ్చావ్. నీకు సమస్యలేమైనా ఉన్నాయా.
 ఎల్లసిరి శరత్‌రెడ్డి : తెలియని తనంలో నక్సలిజం వైపు ఆకర్షితుడినయ్యాను. ఎంబీఏ చదివి నక్సలైట్లకు
 ఆయుధాలు తయారు చేసి ఇచ్చాను. ఇప్పుడు తెలిసి వచ్చింది.
 ఇంక ఎప్పుడూ ఇటువంటి
 పొరపాటు చేయను.
 రాఘవేంద్రరావు : నీకేమైనా
 సమస్యలున్నాయా.
 మిర్యాల శ్రీను : నాకు ఆరోగ్య సమస్యలున్నాయ్ సార్. అప్పుడప్పుడూ ప్రభుత్వాసుపత్రికి వైద్యానికి వెళుతుంటాను. అక్కడ వైద్యం సరిగా అందడం లేదు.
 రాఘవేంద్రరావు : నేనేం చేయాలో చెప్పు
 మిర్యాల శ్రీను : జైలులోనే ఒక వైద్యుడు ఉండేలా చూడండి సార్.
 రాఘవేంద్రరావు : నువ్వు చెప్పు. నీకేమైనా సమస్యలున్నాయా.
 దాసరి బోసురాజు : ఒక కాయిన్ బాక్స్ ఫోన్ పెట్టించండి సార్. లాయర్లతో, మా కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి వీలుగా ఉంటుంది.
 అక్కడి నుండి మహిళా ఖైదీలు ఉండే బ్యార క్‌కు వెళ్లిన సూపరింటెం డెంట్ అక్కడి వారితో మాట్లాడుతూ..
 రాఘవేంద్రరావు : ఏమ్మా.. మీకేమైనా సమస్యలున్నాయా.
 మరీదు వరలక్ష్మి : ఏమీ లేవు సార్.
 రాఘవేంద్రరావు : ఏమ్మా. నీకేమైనా సమస్యలున్నాయా.
 బోసిలి చిన్నారి : నాకు బెయిల్ రావడం లేదు సార్. త్వరగా బెయిల్ వచ్చే ఏర్పాటు చేయండి.
 విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌తో మాట్లాడుతూ..
 రాఘవేంద్రరావు : ఇక్కడ విధి నిర్వహణ ఎలా ఉంది. మహిళా ఖైదీలతో ఏమైనా ఇబ్బందులు ఎదురౌతున్నాయా.
 డి.నిర్మలకుమారి : విధి నిర్వహణ సంతృప్తికరంగా ఉంది సార్. ఖైదీలతో ఇబ్బందులేమీ లేవు. కాకపోతే మాది చింతలపూడి. అక్కడ సబ్‌జైలు తెరిచే ఏర్పాటు చేయండి సార్.
 జైలు బయట ఖైదీలను కలవడానికి ఎదురుచూస్తున్న బంధువుల వద్దకు వెళ్లిన సూపరింటెండెంట్ ‘మీ పేరేంటమ్మా. ఎవరిని కలవడానికి వచ్చారు’ అని అడిగారు.
 బి.దుర్గాప్రశాంతి : మా నాన్న లోపల ఉన్నాడు సార్. ఆయనను కలుద్దామని ఉదయం ఎప్పుడో వచ్చాం. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. ఇక్కడ మాలాంటి వాళ్లు కూర్చోవడానికి ఒక గది ఏర్పాటు చేయండి సార్.
 
 ఖైదీలకూ ఆదాయం వచ్చే ఏర్పాటు
 జైలు శిక్ష అనుభవిస్తున్న వాళ్లంతా చెడ్డవాళ్లు కాదు. ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి సూపరింటెం డెంటుగా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఖైదీలకు వారి శిక్షా కాలంలో కొంత ఆదాయం వచ్చేలా ఏదో ఒక ఏర్పాటు చేయాలనే అలోచనలో ఉన్నాం. జైలు పరిసరాల్లో ఒక బేకరీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. ఖైదీలను కలవడానికి వచ్చేవారి కోసం గత ఎంపీ కావూరి సాంబశివరావు ఎంపీ నిధుల నుండి మంజూరు చేసిన రూ.2 లక్షలతో వెయిటింగ్ రూమ్ కడుతున్నాం. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్ కార్యక్రమం ద్వారా ఖైదీలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలిశాయి. జైలులో రెసిడెంట్ వైద్యుణ్ణి ఏర్పాటు చేసే విషయమై ఇప్పటికే డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకెళ్లాం. జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇచ్చాం. మహిళల బ్యారక్‌పై మరో బ్యారక్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. ఖైదీల సౌకర్యం కోసం జనరేటర్ ఏర్పాటుకు ఎంపీ మాగంటి బాబు హామీ ఇచ్చారు. ఖైదీలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ పెడుతున్నాం. ఖైదీల్లో మానసిక పరివర్తన తీసుకొచ్చేందుకు తరచూ ఆధ్యాత్మిక ప్రసంగాలను ఏర్పాటు చేస్తున్నాం. ఖైదీలకు హక్కులపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నాం. భవిష్యత్‌లో ఖైదీలకు మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం.
 - బి.రాఘవేంద్రరావు, జైలు సూపరింటెండెంట్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement