ఐటీ కంపెనీల్లో ఖాళీ అవుతున్న ‘బెంచీ’లు
న్యూఢిల్లీ: అమెరికా లాంటి దేశాల ఆంక్ష లు, యాంత్రీకరణ పెరగడం వల్ల భారత ఐటీ దిగ్గజ సంస్థల్లోకూడా బెంచీలు ఖాళీ అవుతున్నాయి. ఐటీ కంపెనీల్లో ఇది వరకు బెంచీకి ఎనిమిది నుంచి పది మంది ఉండగా ఇప్పుడా సంఖ్య నాలుగు నుంచి ఐదుకు పడిపోయిందని మానవ వనరుల అభివద్ధి శాఖకు చెందిన నిపుణులు తెలియజేస్తున్నారు. ఐటీ రంగంలో ప్రస్తుతం పనిచేయడానికి ఏ ప్రాజెక్ట్ లేకపోయినా, భవిష్యత్ ప్రాజెక్టులకు పనికొస్తారన్న నమ్మకంతో రిజర్వ్‌లో ఉంచే ఉద్యోగులను బెంచీ ఉద్యోగులుగా వ్యవహరిస్తారు. వారిని కూడా రెగ్యులర్ రోల్స్‌లోనే ఉంచి ఇతర ఉద్యోగులలాగానే జీతభత్యాలు ఇస్తారు.
‘సిట్టింగ్ ఆన్ ది బెంచ్’ అనే పదం ఫుట్‌బాల్ ఆట నుంచి వచ్చిందంటారు. ఫుట్‌బాల్ ఆడేది 11 మంది క్రీడాకారులే అయినా అయిదారు ఆటగాళ్లు ఎక్స్‌ట్రా ఉంటారు. రెగ్యులర్ ఆటగాళ్లు గాయపడ్డ సందర్భాల్లో వారికి బదులుగా వీరు ఆడతారు. వీరిని ‘సిట్టింగ్ ఆన్ ది బెంచ్’ క్రీడాకారులు అని వ్యవహరిస్తారు. ఇలా ఎక్స్‌ట్రా ఉద్యోగులను ఐటీ పరిశ్రమలో ఉద్యోగుల బ్యాంక్ అని కూడా పిలుస్తారు. బ్యాంక్ అన్న పదం ఇటలీలోని బెంచీ నుంచే వచ్చిందట, 14వ శతాబ్దంలో ఇటలీలో ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఉద్యోగులు బెంచీల మీద కూర్చొని పనిచేసేవారని, ఆ బెంచీ పదం మీదనే బ్యాంక్ అనే పదం పుట్టుకొచ్చిందని ‘ది యాక్సెంట్ ఆఫ్ మనీ’ పుస్తకంలో రచయిత నీల్ ఫర్గూసన్ తెలిపారు.
‘అన్ని వేళల్లో మా వద్ద బెంచీపై తక్కువ ఉద్యోగులే ఉంటారు. దీన్ని మేము ప్రణాళికా కాలమని కూడా అంటాం. ఈ కాలంలో ఉద్యోగులు పని నేర్చుకుంటారు. అలాగే తమ అంతర్గత సజనాత్మకతపై దష్టిని కేంద్రీకరిస్తారు’ అని ఇన్ఫోసిస్ హెచ్‌ఆర్ హెడ్ రిచర్డ్ లోబో ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈ బెంచీని ఐటి కంపెనీలు పరస్పరం భిన్నంగా కూడా చూస్తాయి. ప్రాజెక్ట్ ఇవ్వడమే తరువాయి, పనిచేసి పెట్టడానికి తమవద్ద తగినన్ని మానవ వనరులు ఉన్నాయని కస్టమర్లను నమ్మించడానికి, తమ సంస్థ ఆర్థికంగా కూడా బలమైనదని చెప్పడానికి ఈ బెంచీలను ఉపయోగిస్తే, లాభాలను తగ్గించుకోవడమే అవుతుందన్న ఉద్దేశంతో కొన్ని కంపెనీలు బెంచీల సైజును నామమాత్రంగానే ఉంచేవి.
నైపుణ్యం పెంచుకోవడానికి, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఈ బెంచీలు బాగా ఉపయోగపడేవని ఓ ఐటీ కంపెనీలో 16 నెలల పాటు బెంచీపై కూర్చున్న ఇందిర రాఘవన్ అనే ఐటీ ఉద్యోగి వ్యాఖ్యానించారు. ఇదివరకు ఐటీ కంపెనీల్లో బెంచీపైన 30 శాతం మంది ఉద్యోగులు ఉంటుండగా, 70 శాతం మంది ఉద్యోగులు ప్రాజెక్టులపై పనిచేసే వారని, ఇప్పుడు బెంచీ సంఖ్య 19–20కి, పనిచేసే ఉద్యోగుల సంఖ్య 80–81 శాతంగా మారిందని ఇన్‌ఫోసిస్ ఎండీ, సీఈవో విశాల్ సిక్కా తెలిపారు. బ్యాంక్ అని పిలిచినా, బెంచీ అని పిలిచినా ఇప్పుడు ఐటీ దిగ్గజ సంస్థల్లో రిజర్వ్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుందని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం.
ఇప్పుడు బెంచీకి బదులుగా ఐటీ సంస్థలు ‘జస్ట్ ఇన్ టైమ్’ అనే విధానానికి శ్రీకారం చుట్టాయి. ఈ జాబితో వున్న ఉద్యోగులకు జీత భత్యాలు ఇవ్వరు. ప్రాజెక్టు వచ్చినప్పుడు మాత్రమే వీరిని పిలుస్తారు. ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు వారిని కాంట్రాక్ట్‌పై ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఇంటికి పంపించి వేస్తారు. ఈ విధానం కారణంగా ఇక ఐటీ కంపెనీల్లో శాశ్వత లేదా దీర్ఘకాల ఉద్యోగులంటూ ఉండరు.