భారత్, ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులైతే తక్కువ జీతాలకే పని చేస్తారన్న ఉద్దేశంతో అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన ఐటీ కంపెనీ పీపుల్ టెక్ గ్రూప్ సంస్థ హెచ్1బీ నిబంధనల్ని అతిక్రమించింది. అత్యంత నైపుణ్యం కలిగిన హెచ్1–బీ ప్రోగ్రామ్ అనలిస్ట్‌లకు అతి తక్కువ వేతనాలు ఇచ్చి ఉద్యోగాల్లో నియమించింది.అమెరికాలోని లేబర్ చట్టాలను అతిక్రమిస్తూ ఆ ఉద్యోగులకు చాలా కాలంగా ఆ ఐటీ కంపెనీ అతి తక్కువ జీతాలను ఇస్తోంది దీనిపై విచారణ జరిపిన అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ వేజ్ అండ్ అవర్ డివిజన్ (డబ్ల్యూహెచ్‌డీ) హెచ్–1 బీ వీసా కార్యక్రమానికి సంబంధించిన నిబంధనల్ని ఆ కంపెనీ ఉల్లంఘించిందని తేల్చింది.
తమ కంపెనీ ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన జీతం కంటే చాలా తక్కువగా ఇస్తోందని లేబర్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. పీపుల్ టెక్ గ్రూప్‌కి బెంగుళూరు, హైదరాబాద్‌లో కూడా శాఖలు ఉన్నాయి. హెచ్–1బీ కంప్యూటర్ అనలిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రామ్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు ఒక అనుభవం కలిగిన ఉద్యోగి కంటే ఎక్కువ పని చేయించుకుంటూ తక్కువ వేతనం ఇవ్వడం చట్టవ్యతిరేకం అంటూ ఆ ప్రకటన పేర్కొంది. ఆ కంపెనీలో పని చేస్తున్న హెచ్1–బీ వీసా కలిగిన 13 మంది ఉద్యోగులకు 3,09,914 డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. సదరు కంపెనీకి 45,564 డాలర్లు జరిమానా కూడా విధించింది. ‘హెచ్1బీ ఫారెన్ లేబర్ సర్టిఫికేషన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అమెరికా ఉద్యోగులకి కొరత ఏర్పడితే అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునే అవకాశం అమెరికా కంపెనీలకు వస్తుంది.
అలాగని వాళ్లకు తక్కువ జీతం ఇవ్వడమంటే చట్ట వ్యతిరేకం. అమెరికా స్థానికుల ప్రయోజనాల కోసమే మేము పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం‘ అని లేబర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. అయితే ఈ చర్య పట్ల హెచ్1బీ వీసాతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పీపుల్ టెక్ మాత్రమే కాదు అమెరికాలో హెచ్–1బీ ప్రోగ్రామ్‌ని దాదాపుగా 30 కంపెనీలు ఉల్లంఘిస్తున్నాయి. 2013 నుంచి ఇప్పటివరకు గణాంకాల్ని పరిశీలిస్తే నిబంధనల్ని అతిక్రమిస్తున్నది ఎక్కువగా ఇండియన్ అమెరికన్లు, లేదంటే వారి ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలేనని తేలింది. ఉద్దేశపూర్వకంగా తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగుల్ని నియమిస్తున్న పది కంపెనీలపై అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే అనర్హత వేటు వేసింది.
ఇది చదవండి : అమెరికాకు తగ్గిన భారత సందర్శకులు
Comments
Please login to add a commentAdd a comment